శ్రీసాయి చాలీసా:

 

షిరిడీవాస సాయిప్రభో జగతికి  మూలం నీవే ప్రభో
దత్తదిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
త్రిమూర్తి రూపా ఓ సాయీ కరుణించి కాపాడోయి
దర్శన మియ్యగరావయ్య ముక్తికి మార్గం చూపుమయా

కఫిని వస్త్రము ధరియించి భుజమునకు జోలీ తగిలించి
నింబ వృక్షము ఛాయలలో ఫకీరు వేషపుధారణలో
కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి
షిరిడీ గ్రామం నీ నివాస భక్తుల మదిలో నీ రూపం

చాంద్ పాటిల్ ను కలుసుకుని అతని బాధలు తెలుసుకొని
గుఱ్ఱము జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి
వెలిగించావు జ్యోతులను నీవుపయోగించీ జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం చూసి వింతైన ఆ దృశ్యం

బాయిజా చేసెను నీ సేవ ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి
పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి
జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం

నీ ద్వారములో నిలిచిని నిన్నే నిత్యము కొలిచితిని
అభయము నిచ్చి బ్రోవుమయా ఓ షిరిడీశా దయామయా
ధన్యము ద్వారక ఓ మాయీ నీలో నిలిచెను శ్రీసాయి
నీ ధుని మంటల వేడిమికి పాపము పోవును తాకిడికి

ప్రళయ కాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహామ్మారీ నాశం కాపాడి షిరిడి గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహాత్మ్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి పాము విషము తొలగించి

భక్త భీమాజీకి క్షయరోగం నశియించే అతని సహనం
ఊదీ వైద్యం చేసావు వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి విఠల దర్శన మిచ్చితివి
దామూకిచ్చి సంతానం కలిగించితివి సంతోషం

కరుణాసింధూ కరుణించు మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి భావమును
ముస్లిమనుకొని నిను మేఘా తెలుసుకుని అతని బాధ
దాల్చి శివశంకర రూపం ఇచ్చావయ్యా దర్శనము

డాక్టరుకు నీవు రామునిగా బల్వంతుకు శ్రీదత్తునిగా
నిమోనుకరకు మారుతిగా చిడంబరకు శ్రీగణపతిగా
మార్తాండకు ఖండోబాగా గణూకు సత్యదేవునిగా
నరసింహస్వామిగా జోషికి దర్శనము మిచ్చిన శ్రీసాయి

రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం
భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు బాబా మాకివి వేదాలు
శరణణి వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి

అందరిలోన నీ రూపం నీ మహిమా అతిశక్తిమాయం
ఓ సాయి మేఘ మూఢులము ఒసగుమయా నీవు జ్ఞానమును
సృష్టికి నీవేనయ మూలం సాయి మేము సేవకులం
సాయి నామము తలచెదము నిత్యము సాయిని కొలిచెదము

భక్తి భావన తెలుసుకొని సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయీ ధ్యానం చేయండీ ప్రతినిత్యం
బాబా కాల్చిన ధుని ఊది నివారించును అది వ్యాధి
సమాధి నుండి శ్రీసాయి భక్తులను కాపాడేనోయి

మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు
వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి
సత్సంగమును చేయండి సాయి స్వప్నము పొందండి
భేద భావమును మానండి సాయి మన సద్గురువండి

వందనమయ్యా  పరమేశా ఆపద్భాందవ సాయీశా
మా పాపములా కడతేర్చు మా మది కోరిక నెరవేర్చు
కరుణామూర్తి ఓ సాయి కరుణతో మమ్ము దరిచేర్చోయి
మా మనసే నీ మందిరము మా పలుకులే నీకు నైవేద్యం

శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు షిరిడీ సాయినాథ మహరాజ్ కి జై !!

Thank you for watching శ్రీ సాయి చాలీసా.

 

Please watch to గణేశ సహస్ర నామ స్తోత్రం.

And follow us on YouTube channel

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!