17వ దినము, అరణ్యకాండ
పరవాన్ అస్మి కాకుత్స్థ త్వయి వర్ష శతం స్థితే |
స్వయం తు రుచిరే దేశే క్రియతాం ఇతి మాం వద ||
అప్పుడు లక్ష్మణుడు \” స్వామీ! నన్ను నిర్మించమని చెప్తావేంటి, నిర్మించేవాడిని నేను కాదు. నూరు సంవత్సరములకు కూడా నువ్వు ఆజ్ఞాపించాలి, నేను నీ ఆజ్ఞని పాటించాలి. లక్ష్మణా! ఈ ప్రదేశంలో పర్ణశాలని నిర్మించు అని నువ్వు ఆజ్ఞాపిస్తే, రాముడు ఆజ్ఞాపించాడు కనుక ఇక్కడ పర్ణశాల నిర్మిస్తున్నాను అన్న భావనలో ఉన్న సంతోషం, నేనే ఒక ప్రదేశాన్ని నిర్ణయించి, రాముడు కోరినట్టు ఆశ్రమాన్ని నిర్మించాను అనడంలో లేదు \” అన్నాడు.
అప్పుడు రాముడు లక్ష్మణుడి చెయ్యి పట్టుకొని తీసుకెళ్ళి \” లక్ష్మణా! ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించినట్టయితే చాలా బావుంటుంది. మనం ఎక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకోవాలని అగస్త్య మహర్షి మనసులో కోరుకున్నారో, ఇది అటువంటి రమ్యమైన ప్రదేశం. ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుంటే గలగలా పారే గోదావరి కనబడుతుంది, దూరంగా పెద్ద పెద్ద పర్వతాలు కనబడతాయి, ఆ పర్వత చెరియల మీద విహరించే అనేక మృగాల గుంపులు కనబడతాయి. హంసలు, కారణ్డవములు మొదలైన జలపక్షులు కనబడుతుంటాయి, ఈ ప్రాంతం చాలా అందంగా, పనస, పున్నాగ, నేరేడు, మామిడి మొదలైన దేవతా వృక్షములతో శోభితమై అలరాడుతోంది. అగస్త్యుడు మనన్ని ఉండమని చెప్పిన ప్రదేశం ఇదేనని నాకు అనిపిస్తోంది, అందుకని లక్ష్మణా, నువ్వు ఇక్కడ పర్ణశాలని నిర్మించు \” అన్నాడు.
ఉత్సాహంతో లక్ష్మణుడు భూమిని తవ్వి, మట్టిని తీసి, నీరు పోసి, ముద్దని చేసి పెద్ద పెద్ద రాటలు తెచ్చి పాతాడు, వాటి మధ్య మట్టితో అందమైన గోడలు కట్టాడు, దానిమీద అడ్డుకర్రలు వేశాడు, వాటిమీద జమ్మి మొదలైన కర్రలు, దర్భ గడ్డి వేసి పందిరి నిర్మించి చక్కని పర్ణశాలని నిర్మించాడు. తరువాత గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేసి, కొన్ని నీళ్ళని, పండ్లని, పుష్పాలని తీసుకొని వచ్చి కొత్త ఇంటిలోకి ప్రవేసించేముందు చేసెటటువంటి శాంతికర్మలన్నిటిని నిర్వహించి సీతారాముల దెగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని \” అన్నయ్యా! నువ్వు చెప్పినట్టే పర్ణశాల నిర్మాణం చేశాను, వదినతో కలిసి నువ్వు ఒక్కసారి లోపలికి వెళ్ళి, బావుందో లేదో చెప్తే నేను సంతోషిస్తాను \” అని అన్నాడు. ( ఆ పర్ణశాల నిర్మాణం తాను ఒక్కడినే చేస్తున్నానని లక్ష్మణుడి ఆనందం. భగవంతుడికి సేవ చెయ్యడంలో తన కష్టాన్ని కూడా మరిచిపోయి చేస్తాడు, అదే ఆయన లక్ష్మి, అందుకనే వశిష్ఠుడు ఆయనకి లక్ష్మణా అని పేరు పెట్టారు)
ప్రీతో అస్మి తే మహత్ కర్మ త్వయా కృతం ఇదం ప్రభో |
ప్రదేయో యన్ నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః ||
ఆ పర్ణశాలని చూసిన రాముడు \” ఏమి పని చేశావయ్యా, నువ్వు చేసిన ఈ పనికి నేను నీకు ఏమి ఇవ్వగలను. నేను ఇవ్వగలిగిన కానుక ఏంటో తెలుసా \” అని లక్ష్మణుడిని రాముడు గట్టిగా కౌగలించుకుని \” లక్ష్మణా! నువ్వు నాతో భావము చేత, కృతజ్ఞత చేత, ధర్మము చేత నాకు తమ్ముడివి కాదయ్యా, నువ్వు నాకు తండ్రివి. దశరథ మహారాజు గారు వెళ్ళిపోలేదు, నీ రూపంలో నా దెగ్గరే ఉన్నారు. నేను ఎంత అదృష్టవంతుడిని \” అన్నాడు.
అలా వారు ఆ పంచవటిలో రోజూ చెయ్యవలసిన కార్యములను చక్కగా చేసుకుంటూ, వచ్చిన ఋషులతో భగవత్ సంబంధమైన విషయముల మీద చర్చిస్తూ, తెచ్చుకున్న కందమూలాలను తింటూ చాలా సంతోషంగ కాలం గడపసాగారు.
కొంతకాలానికి హేమంత ఋతువు వచ్చింది, అప్పుడు రాముడు ఉదయాన్నే నదిలో స్నానం చెయ్యడానికి బయలుదేరాడు. రాముడి వెనకాల సీతమ్మ, లక్ష్మణుడు వెళ్ళారు. నదిలో స్నానం చేస్తున్న రాముడితో లక్ష్మణుడు \” అన్నయ్యా! నీకు చాలా ఇష్టమైన కాలం వచ్చింది. ఈ కాలంలొ మంచు బాగా పడుతుంది. ఈ ఋతువులో జనాలందరికీ నీటిని చూస్తే స్నానాదులు చెయ్యడానికి భయమేస్తుంది, సూర్యుడిని చూస్తే ఆనందిస్తారు. అసలు నీటిని చూస్తేనే ఒళ్ళు గడ్డ కట్టేస్తుంది.
నవ ఆగ్రయణ పూజాభిర్ అభ్యర్చ్య పితృ దేవతాః |
ఈ ఋతువులో పంటలు ఇంటికి చేరుతాయి, కనుక అందరూ తమ పితృదేవతలకి నవాగ్రయణ పూజలు చేస్తారు. ఈ సమయంలో పశువులు పాలు బాగా ఇస్తాయి, పాడిపంట చేతికిరావడంతో పల్లెల్లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇక్కడున్నటువంటి జలపక్షులు నీటిలోకి వెళ్ళకుండా, ఒడ్డున కూర్చొని, ముఖాన్ని రెక్కలలో పెట్టుకొని కూర్చున్నాయి. వీటిని చూస్తే నాకు ఏమనిపిస్తుందంటే, ఉత్తమ క్షత్రియవంశంలో పుట్టి, ప్రగల్భాలు పలికి, యుద్ధంరంగం వైపు చూసి, యుద్ధానికి వెళ్ళకుండా పిరికివాడిలా బయట కూర్చున్నట్టు ఉన్నాయి ఈ పక్షులు. అన్నయ్యా! నాకు ఒక విషయం ఆశ్చర్యాన్ని కలగజేస్తుంది, అదేంటంటే……సాధారణంగా మనుషులకి తల్లి పోలికలు ఎక్కువగా వస్తాయి, మృగాలకి తండ్రి పోలికలు ఎక్కువగా వస్తాయి. దశరథుడు ధర్మాత్ముడు, భరతుడు చాలా మంచివాడు, భరతుడు కూడా నీలాగే ఇప్పుడు నదిలో స్నానం చేస్తుంటాడు, మరి కైకేయ దుష్టబుద్ధి కలిగినది కదా, ఆవిడ పోలికలు భరతుడికి రాలేదేమిటి \” అన్నాడు.
\” లక్ష్మణా! నువ్వు ఇప్పటిదాకా భరతుడి గురించి మాట్లాడావు, నా మనస్సు ఎంత సంతోషపడిందో తెలుసా. మధ్యలో కైకమ్మని జ్ఞాపకం తెచ్చుకొని ఎందుకు నిందిస్తుంటావు. అమ్మని అలా నిందించడం తప్పు. ఇంకెప్పుడూ అలా మాట్లాడకు, భరతుడి గురించి మాట్లాడు, నేను పరమ సంతోషిస్తాను. భరతుడిని విడిచిపెట్టి నేను ఉండలేకపోతున్నాను, చిత్రకూట పర్వతం మీద భరతుడు నాతొ మాట్లాడిన మాటలే నాకు గుర్తొస్తున్నాయి. అయోధ్యకి వెళ్ళి భరతుడిని చూసి రావాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది \” అని రాముడన్నాడు.
కృతాభిషేకః స రరాజ రామః సీతా ద్వితీయః సహ లక్ష్మణేన |
కృత అభిషేకో తు గిరి రాజ పుత్ర్యా రుద్రః స నందిః భగవాన్ ఇవ ఈశః ||
సీతారామలక్ష్మణులు ముగ్గురూ స్నానం చేసి తడి బట్టలతో నిలబడితే, వాళ్ళు అటుగా వెళ్ళే వాళ్ళకి ఇప్పుడే స్నానం చేసి బయటకి వచ్చిన నందికేశ్వర సహిత పార్వతీపరమేశ్వరులులాగ కనబడుతున్నారు అని వాల్మీకి మహర్షి చెప్పారు.
అలా కొంత కాలం గడిచాక, భగవంతుడి నిర్ణయం మేర అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె పేరు శూర్పణఖ( చాటలంత గోళ్ళు ఉన్నది). అప్పుడామె మదించిన ఏనుగు నడిచినట్టు నడిచేవాడు, విచ్చుకున్న పద్మముల వంటి కన్నులున్నవాడు, అపారమైన తెజస్సున్నవాడు, మన్మధుని సౌందర్యమును గెలవగలిగిన అందమున్నవాడు అయిన రాముడిని చూసింది. అప్పుడామెకి విశేషమైన కామం కలిగింది.
రాముడిని చూస్తే \’ అబ్బ ఎంత బావున్నాడో \’ అంటారు, ఆమెని చూస్తే \’ బాబోయి అలా ఉందేంటి \’ అంటారు. రాముడి కడుపు బయటకి కనపడకుండా లోపలికి ఉంటుంది, ఈమె బాన బోర్లించినట్టు పెద్ద పొట్టతో ఉంటుంది. రాముడివి పెద్ద కళ్ళు, ఈమెని వికృతమైన కళ్ళు. అందమైన జుట్టు రాముడిది, ఎర్రటి తీగలలాగ ఉన్న జుట్టు శూర్పణఖది. చూడంగానే మళ్ళి చూడాలనిపించే రూపం రాముడిది, పిల్లలు దడుచుకునే రూపం ఆమెది. రాముడిది మంచి కంఠం, ఈమె మాట్లాడితే కుక్క మొరిగినట్టు ఉంటుంది. రాముడు మంచి యవ్వనంలో ఉన్నాడు, ఈమె ముసలితనంలో ఉంది. రాముడు ఎప్పుడూ న్యాయంగా ప్రవర్తిస్తాడు, ఈమెది ఎప్పుడూ దుష్ట ప్రవర్తన. రాముడు ఎవరినన్నా ఒకసారి చూస్తే, వాళ్ళు సంతోషపడతారు, ఈమె ఎవరినన్నా చూస్తే, వాళ్ళు భయపడతారు.
ఇటువంటి శూర్పణఖ రాముడి వంక చూసి \” నువ్వు ఇంత అందంగా ఉన్నావు, జటామండలం కట్టుకున్నావు. నీలాగే ఇంకొక పురుషుడు కూడా కనబడుతున్నాడు. కాని ఇక్కడ ఎవత్తో అందవికారంగా ఒక స్త్రీ కనబడుతోంది. ఇంతకీ మీరు ఎవరు \” అని అడిగింది.
అబద్ధం చెప్పడం రాని, తనని కోరి వచ్చింది కదా అని లేనిపోనీ మాటలు స్త్రీల దెగ్గర మాట్లాడడం ఇష్టపడని రాముడు ఇలా అన్నాడు \” నేను దశరథ మహారాజు పెద్ద కొడుకుని, నన్ను రాముడు అంటారు. అతను నా తమ్ముడు లక్ష్మణుడు, ఆమె నా భార్య సీత. మేము ముగ్గురమూ తండ్రిగారి మాటకి కట్టుబడి అరణ్యాలకి వచ్చాము. ఇక్కడ తాపసులమై, ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతున్నాము. నువ్వు ఎవరు? \” అని రాముడు అన్నాడు.
అహం శూర్పణఖా నామ రాక్షసీ కామరూపిణీ |
వీరో విశ్రవసః పుత్రో యది తే శ్రోత్రం ఆగతః ||
అప్పుడు శూర్పణఖ \” నా పేరు శూర్పణఖ. నాకు కామరూపం ఉంది. నేను చాలా భయంకరమైన రీతిలో ఈ అరణ్యం అంతా తిరుగుతూ ఉంటాను. విశ్రవసోబ్రహ్మ యొక్క కుమారుడైన రావణాసురుడు నాకు అన్నయ్య. నాకు కుంభకర్ణుడు అనే మరో అన్నయ్య ఉన్నాడు, ఆయన ఎక్కువగా నిద్రపోతూ ఉంటాడు. ఒక్క రాక్షస చేష్టితం లేకుండా ఎప్పుడూ ధర్మం అనే తమ్ముడు కూడా ఉన్నాడు, అతని పేరు విభీషణుడు. గొప్పగా యుద్ధం చెయ్యగలిగే ఖర దూషణులు కూడా నా అన్నలు. నేను ప్రపంచంలో ఎవరిని లెక్కపెట్టను, నాకు అపారమైన బలం ఉంది, స్వేచ్ఛావిహారం చేస్తుంటాను, ఇవ్వాళ నిన్ను చూశాక, నిన్ను నా భర్తగా పొందాలన్న కోరిక పుట్టింది. నువ్వు నన్ను భార్యగా పొంది సుఖం అనుభవించు \” అని సీతమ్మ వైపు చూసి \” ఈవిడెవరు, ఇంత అసహ్యంగా ఉంది. ఈవిడా నీ భార్య, ఈవిడ నీకు తగినది కాదు, నేను నీకు తగినదానిని. నువ్వు నన్ను స్వీకరిస్తే, ముందు ఈమెని, తరువాత నీ తమ్ముడిని తినేస్తాను, అప్పుడు మనం హాయిగా ఈ అరణ్యంలో విహరించచ్చు\” అనింది.
విశేషమైన కామమును పురుషునియందు పొందిన స్త్రీ యుక్తాయుక్తములను మరిచి, నోరు తెరిచి అడిగినప్పుడు ఆమెని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తే, ఆమె మనస్సు ఖేదపడుతుంది. ఒక ఆడదాని మనస్సుని బాధపెట్టేటట్టు మాట్లాడకూడదు కనుక, కాసేపు అటూ ఇటూ తిప్పితే ఆమెకి విసుగొచ్చి వెళ్ళిపోతుందని అనుకొని, చిన్న చిరునవ్వుతో రాముడు ఇలా అన్నాడు \” నాకు వివాహం అయ్యిపోయిందమ్మ, నా భార్య మీద నాక చాలా ప్రేమ ఉంది. ఆవిడని విడిచిపెట్టి నేను నిన్ను ఎలా స్వీకరిస్తాను. రెండవ భార్యగా ఉండడానికి ఆడవారు ఇష్టపడరు. అందుకని అన్నివిధాల నాలా ఉన్న, తేజస్సు కలిగిన, చాలాకాలంగా స్త్రీ సుఖానికి దూరంగా ఉన్నవాడైన నా తమ్ముడు కోరుకుంటే, ఆయనకి భార్యగా ఉండు \” అన్నాడు.
అప్పుడా శూర్పణఖ లక్ష్మణుడి దెగ్గరికి వెళ్ళి \” నీకు తగినటువంటి భార్యని నేను, నువ్వు ఎంత కాంతిగా ఉంటావో నేనూ అంతే కాంతిగా ఉంటాను. నువ్వు అందంగా యవ్వనంలో ఉన్నావు, నేనూ అందంగా యవ్వనంలో ఉన్నాను. అందుకని మనిద్దరమూ సంతోషంగా కాలం గడుపుదాము, నన్ను స్వీకరించు \” అనింది.
అప్పుడు లక్ష్మణుడు \” నేనే ఓ దాసుడిని, మరి నన్ను కట్టుకుంటే నువ్వు దాసివి అవుతావు. కాబట్టి నన్ను కాదు మా అన్నగారినే అడుగు. నీలాంటి అందగత్తెని చూశాక మా అన్నయ్య వృద్ధురాలు అయిన మా వదినతో ఎలా ఉంటాడు. ఆమెని వదిలేసి నీతోనే ఉంటాడు, అందుకని మా అన్నగారినే అడుగు \” అని పరిహాసం ఆడాడు.
అప్పుడు లక్ష్మణుడు ఒక ఖడ్గాన్ని తీసుకొని శూర్పణఖ యొక్క ముక్కు, చెవులని కోసేసాడు. కోసేయబడ్డ ముక్కు, చెవులతో శూర్పణఖ గట్టిగా అరుస్తూ ఆ వనంలోనే ఉన్నటువంటి తన అన్నగార్లైన ఖర దూషణులు దెగ్గరికి వెళ్ళి కిందపడింది. అప్పుడు ఖరుడు \” ఇదేమిటి ఇలా ముక్కు, చెవులు కోయించుకున్నావు. తన పక్కన నిశబ్దంగా వెళ్ళిపోతున్న త్రాచుని గోళ్ళతో గీరినవాడు ఎవడు, నిన్ను ముట్టుకున్న వాడు ఎవడు. వాడు ఈ పృథ్విలో ఎక్కడున్నా బతకడు. నా బాణముల చేత వాడి రక్తాన్ని బయటకి తీస్తాను. ఇప్పుడే చెప్పు, వాడు ఎక్కడున్నాడు \” అని అడిగాడు.
అప్పుడా శూర్పణఖ ఇలా చెప్పింది \” ఇక్కడికి దెగ్గరలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, నార చీరలు కట్టుకున్నారు, మంచి యవ్వనంలో ఉన్నారు, కందమూలాలు తింటూ తాపసులుగా ఉంటున్నారు, ధర్మంతో ప్రవర్తిస్తున్నారు, దశరథ మహారాజు కొడుకులమని చెప్పారు, వాళ్ళ పేర్లు రామ లక్ష్మణులు, వాళ్ళని చూస్తుంటే గంధర్వులు అనాలో, రాజకుమారులు అనాలో నాకు తెలియడం లేదు, అంత అందంగా ఉన్నారు, వారు ఒక చక్కటి ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ ఉంటున్నారు. కాని వాళ్ళ మధ్యలో ఒక అందమైన స్త్రీ ఉంది, ఆమె కారణంగానే నా ముక్కు చెవులు కోసేసారు. అన్నయ్యా! నాకు ఒక్కటే కోరిక ఉంది. నువ్వు ఆ రాముడిని సంహరించాలి. ఆయనలో నుంచి నురగతోటి, బుడగలతోటి వేడి నెత్తురు బయటకి వస్తుంటే, ఆ నెత్తురుని నా దోసిళ్ళతో పట్టుకొని తాగాలని ఉంది, కనుక నా కోరిక తీరుస్తావా \” అనింది.
\” అయ్యయ్యో, నువ్వు కోరిక అడగడం నేను తీర్చకపోవడమా, తప్పకుండా తీరుస్తాను \” అని ఖరుడు అన్నాడు.
తరువాత 14 మంది సైన్యాధిపతులని పిలిచి \” మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి, శూర్పణఖ మీకు ఒక ఆశ్రమానికి దారి చూపిస్తుంది. అక్కడ మీరు రామలక్ష్మణులు ఇద్దరినీ సంహరించండి. వాళ్ళని చంపాక ఇక్కడికి తీసుకురండి, మా చెల్లి వాళ్ళ రక్తాన్ని తాగుతుంది \” అన్నాడు.
తాపసులైన ఆ రామలక్ష్మణులని చంపడం చాలా తేలికని భావించి ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆశ్రమానికి చేరుకున్నారు. అప్పుడు శూర్పణఖ వాళ్ళకి రామ లక్ష్మణులని చూపించింది. వెంటనే ఈ 14 మంది శూలాలు, కత్తులు, పరిఘలు మొదలైన ఆయుధాలని పట్టుకొని రామలక్ష్మణుల మీదకి పరుగుతీసారు. అప్పుడు రాముడు \” లక్ష్మణా! నువ్వు సీతమ్మ పక్కన నిలబడు, నేను వీళ్ళ సంగతి చూస్తాను \” అన్నాడు.
ఇంద్రుడి చేతినుండి వజ్రాయుధం విడువబడినట్టు, రాముడు బాణములను తన ధనుస్సుకి సంధించి విడిచిపెట్టాడు. రాముడు వదిలిన ఆ బాణాలు వాళ్ళ గుండెలకి ఉన్న కవచాలని పగలగొట్టి, వాళ్ళ గుండెల్ని చీల్చుకుంటూ భూమిలో గుచ్చుకున్నాయి. ఆ 14 మంది పెద్ద పెద్ద కేకలు వేస్తూ, నెత్తురోడుతూ నేల మీద పడి మరణించారు.
ఇదంతా చూసిన శూర్పణఖ మళ్ళి వెళ్ళి ఖరుడి దెగ్గర పడింది. ఇప్పుడే కదా 14 మందిని పంపించాను, మళ్ళి ఏమయ్యిందని ఇలా పడిపోయావు, అని ఖరుడు అడిగాడు. అప్పుడా శూర్పణఖ \” పంపించావులేవయ్య 14 మందిని రామలక్ష్మణులని చంపమని, వాళ్ళని రాముడు ఒక్క క్షణంలో చంపేసాడు. రాముడు మహావీరుడు. నిజంగా నీకు రాముడిని ఎదురించే శక్తి ఉంటె నీ దెగ్గరున్న కింకరులని పంపించడం కాదు, నువ్వే స్వయంగా బయలుదేరు. నువ్వు వచ్చి దండకారణ్యంలో రాక్షసులకి కంటకంగా ఉన్న ఆ రాముడిని సంహరించు. నువ్వు రాముడిని చంపడానికి వెళ్ళకపోతే, నీ ఎదురుగుండా నేను నా ప్రాణాలని వదిలేస్తాను. అస్తమానం నా దెగ్గరికి వచ్చి, నేను వాడిని వీడిని చంపాను అంటావేంటి, అవన్నీ ఒట్టిదే, నువ్వు శూరుడివి కాదు. రాముడు మహావీరుడని చెప్పాను కదా, వెంటనే లేచి ఎక్కడికన్నా పారిపో \” అనింది.
ఈ మాటలు విన్న ఖరుడికి ఎక్కడలేని ఉక్రోషం వచ్చి \” నేను ఇప్పుడే బయలుదేరతాను, నా ఎదుట యుద్ధంలో దేవేంద్రుడే నిలబడ్డా సంహరిస్తాను. మృత్యుదేవతకి మృత్యువుని నేను. నేను కాని యుద్ధానికి వెళితే, నా ముందు నిలబడగలిగే వాడు అంటూ ఎవడూ ఉండడు \” అని పలికి, 14,000 మంది రాక్షసులతో కలిసి రామలక్ష్మణుల మీదకి యుద్ధానికి బయలుదేరాడు.
ఆ ఖరుడు బంగారంతో చెయ్యబడ్డ రథం ఎక్కి బయలుదేరాడు. అప్పుడు గాడిద రంగులో ఉన్నటువంటి మేఘాలు ఆకాశంలో వచ్చి ఎర్రటి నీటిని వర్షించాయి, ఆయన రథాన్ని నడుపుతున్న గుర్రాలు చాలా సమతలంగా ఉన్నటువంటి ఆ దారిలో తొట్రుపడి, ముందుకి పడిపోయి, పైకి లేచి నడిచాయి. ఆకాశంలో సూర్యుడి చుట్టూ నలుపు–ఎరుపు రంగుల వలయం ఏర్పడింది. ఒక గ్రద్ద ఎగురుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలి వెళ్ళిపోయింది. దిక్కులన్నీ అకారణంగా చీకటితో నిండిపోయాయి. నక్కలు నోట్లోనుంచి అగ్నిని కక్కుతూ, ఎదురుగా వచ్చి పెద్దగా ఏడిచాయి. ఇన్ని దుశ్శకునాలు ఎదురొచ్చినా, ఆ ఖరుడు వాటిని లెక్కపెట్టకుండా ముందుకి వెళ్ళాడు.
ఆ ఖరుడి చుట్టూ 12 మంది రాక్షస సేనానులు నిల్చున్నారు. వాడితోపాటు దూషణుడు, త్రిశిరస్కుడు, ప్రమాథి, స్థూలాక్షుడు, మహాకపాలుడు మొదలైన భయంకరమైన రాక్షసులు కూడా బయలుదేరారు.
అటుపక్క రాముని ఆశ్రమంలో, పక్షులు చిత్రవిచిత్రమైన కూతలు కూస్తున్నాయి, భూమి ఒక్కసారి కంపించింది, అలా కంపించడం వలన బంగారు పిడి కలిగిన ధనస్సు ఎగిరి ఎగిరి పడుతోంది, బాణముల చుట్టూ ధూమం ఆవరించింది. అప్పుడు రాముడు లక్ష్మణుడిని పిలిచి \” లక్ష్మణా! నిష్కారణంగా పర్ణశాలలో ఉన్న ధనుస్సు భూమి కంపించేసరికి ఎగిరి ఎగిరి పడుతోంది, అలాగే బాణముల చుట్టూ ధూమం ఆవహిస్తోంది, అంటె గొప్ప యుద్ధం వస్తోందని ధనుర్బాణములు ఆనందపడుతున్నాయి. దూరంగా పక్షి కూస్తోంది అంటె, ఈ యుద్ధంలో జయాపజయాలు దైవనిర్ణయాలు. నా ఎడమ భుజం అదురుతోంది కనుక, ఖచ్ఛితంగా మనం గెలుస్తామని అనుకుంటున్నాను.
తస్మాత్ గృహీత్వా వైదేహీం శర పాణిః ధనుర్ ధరః |
గుహాం ఆశ్రయ శైలస్య దుర్గాం పాదప సంకులాం ||
అందుకని లక్ష్మణా నువ్వు వెంటనే ధనుర్బాణములని పట్టుకొని, సీతని తీసుకొని, ఎవరు చూసినా కూడా కనపడనంతగా చెట్లతో కప్పబడిన ఒక పర్వత గుహలోకి వెళ్ళిపో. నేను యుద్ధం చేస్తాను. నువ్వు నాతో \’సీతమ్మని తీసుకొని లోపలికి వెళ్ళిపో\’ అనే మాటలు చెప్పమాకు. నువ్వు యుద్ధం చెయ్యలేవు అని కాదు, నువ్వు ఒక్కడివే వీళ్ళని చంపగలవు, కాని వీళ్ళతో యుద్ధం చెయ్యాలని నేను కోరుకుంటున్నాను, అంతేకాని నిన్ను తక్కువ చేసి చూడడం లేడు. నేను చెప్పింది విని తొందరగా సీతని తీసుకొని వెళ్ళిపో \” అన్నాడు.
అప్పుడు సీతమ్మని తీసుకొని లక్ష్మణుడు ఒక పర్వత గుహలోకి వెళ్ళాడు. క్రోధంతో కోదండాన్ని పట్టుకొని ఉన్న రాముడిని చూస్తే, ఆనాడు పినాకిని అనే ధనుస్సుని పట్టుకొని దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చెయ్యడానికి నిలబడ్డ రుద్రుడైన శివుడిలా ఉన్నాడని వాల్మీకి మహర్షి చెప్పారు.
ఆశ్రమానికి వచ్చిన ఖరుడు తన సైన్యంతో రాముడిని చుట్టుముట్టాడు. మధ్యలో రాముడు ఒక్కడే ఉన్నాడు, రాముడి చుట్టూ 14,000 మంది రాక్షసులు నిలబడ్డారు. అప్పుడు వాళ్ళు రాముడి మీద బాణాలు, శూలాలు, గదలు మొదలైనవి విసిరారు. వాటి దెబ్బలకి రాముడి ఒళ్ళంతా నెత్తురోడింది. నదీ ప్రవాహం వచ్చి కలిసిపోతునప్పుడు సముద్రం ఎలా సంతోషంగా ఉంటుందో, పెద్ద వర్షం పడుతున్నప్పుడు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఆబోతు ఎలా నిలబడుతుందో అలా రాముడు నిలబడి, ఆ బాణ ప్రవాహాన్ని స్వీకరిస్తూ నిలబడ్డాడు.
రాముడు ఒక్కసారి తన ధనుస్సుని తీసి మండలాకారంగా తిప్పి ఆ రాక్షసుల మీద బాణ ప్రయోగం చేశాడు. ఎప్పుడు ఆ అక్షయబాణ తూణీరంలొ నుంచి బాణం తీశాడో, ఎప్పుడు ఆ బాణాన్ని తన ధనుస్సుకి సంధించాడో, ఎప్పుడు గురి చూసి ఆ బాణాన్ని విడిచిపెట్టాడో ఎవరూ చూడలేదు, అంత వేగంగా బాణ ప్రయోగం చేశాడు. రాముడు ఒక్కడు నేల మీద నుంచి యుద్ధం చేస్తుంటే, దారుణంగా 14,000 మంది రాక్షసులు రథాలలో ఉండి రాముడితో యుద్ధం చేస్తున్నారని ఆకాశంలో దేవతలు, మునులు నిలబడి రాముడికి విజయం చేకూరాలని ఆశీర్వదించారు. ఆ యుద్ధానికి దిక్కులన్నీ కదిలిపోతున్నాయి, పర్వతాలు ప్రకంపించాయి, వన దేవతలు వనాన్ని విడిచి పారిపోయారు, క్రూరమృగాలు దిక్కులు పట్టి పారిపోయాయి. రాముడి బాణ పరంపరకి ఏనుగుల తొండాలు తెగిపోయాయి, గుర్రాల కాళ్ళు రాలిపోయాయి, రాక్షసుల కంఠాలు నేల మీద పడ్డాయి, కొందరికి భుజాలు, కొందరికి కాళ్ళు తెగిపోయాయి. రాముడు ఏక కాలంలో 13 బాణాలని వింటినారికి తొడిగి విడిచిపెట్టేవాడు. అలా ఆ 14,000 మంది రాక్షసులని రాముడు ఒక్కడే సంహరించాడు.
దూషణుడు ఆగ్రహంతో ఒక పరిఘని పట్టుకొని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు వాడి రెండు చేతులు నరికి ఒక దెబ్బ కొట్టాడు. రాముడు కొట్టిన దెబ్బకి ఆ దూషణుడు ఏనుగు పడిపోయినట్టు నేల మీద పడి మరణించాడు. ఇంక ఆ యుద్ధరంగంలో ఖరుడు, త్రిశిరస్కుడు మాత్రమే మిగిలారు. ఖరుడి ఆజ్ఞ మేరకు త్రిశిరస్కుడు యుద్ధానికి వచ్చి రాముడి చేతిలో మరణించాడు.
అప్పుడు ఖరుడు రాముడితో భయంకరమైన యుద్ధం చేశాడు. రాముడు వింటినారిలో బాణం తొడుగుతుంటే, ఆ ఖరుడు అపారమైన వేగంతో తన రథంలో వచ్చి రాముడి పిడికిలి మీద కొట్టాడు. ఆ దెబ్బకి వింటినారి తెగిపోయి ఆ ధనుస్సు విరిగిపోయింది. అప్పుడా ఖరుడు అమితమైన వేగంతో రాముడి గుండెల మీద బాణాలని వేసేసరికి, ఆయన కవచం పిట్లిపోయి కింద పడిపోయింది. అప్పుడాయన రాముడి గుండెల మీద బాణాలతో కొట్టాడు, ఆ దెబ్బలకి పర్వతాల నుంచి సెలయేళ్ళు పారినట్టు, రాముడి గుండెల నుంచి రక్తం కారింది.
అప్పుడు రాముడు పక్కనే ఉన్న అగస్త్య మహర్షి ప్రసాదమైన విష్ణు ధనుస్సుని తీసుకుని ఖరుడితో ఇలా అన్నాడు \” వాడు మూడులోకములను పరిపాలించగల సమర్ధుడైనా, పాపకర్మలను చేస్తున్నవాడు మాత్రం బతకడు. లోకానికి విరుద్ధమైన పనులు చేస్తూ బతికేవాడికి కొంతకాలం లోకం తలవంచి ఉండవచ్చు, కాని వాళ్ళకి ఒకసారి అవకాసం వస్తే, పదిమందిలో ఒక్కత్తె వెళ్ళిపోతున్న పాము కనబడితే అందరూ కర్రలతో కొట్టి చంపినట్టు, అందరూ కలిసి అటువంటివాడిని చంపేస్తారు. ఎక్కడో పర్ణశాలల్లో కూర్చుని తపస్సు చేసుకునే ఋషుల మీద నీకు ఎందుకు ఆగ్రహం, వాళ్ళని ఎందుకు బాధ పెట్టావు. వాళ్ళని బాధ పెట్టిన ఫలితాన్ని నువ్వు ఇప్పుడు అనుభవిస్తావు. ఏ ఋతువులో ఏ పువ్వు పుయ్యాలో, ఆ ఋతువులో ఆ పువ్వు పూస్తుంది. అలా పాపము యొక్క ఫలితాన్ని ఎప్పుడు ఇవ్వాలో పరమేశ్వరుడికి తెలుసు, ఆయన ఇవ్వడం సిద్ధం చేసిననాడు ఆ ఫలాన్ని అనుభవించాలి. ఏ భూమిని నువ్వు ఇంతకాలం బాధ పెట్టావో, ఆ భూమి ఈనాడు నీ ఒంట్లోనుంచి కారే వేడి నెత్తురు తాగుతుంది. నువ్వు ఇంతకాలం చేసిన పాపాలకి ఫలితంగా నీ కుత్తుకని తీసేస్తున్నాను \” అన్నాడు.
ఆ మాటలకి ఆగ్రహించిన ఖరుడు యమపాశం లాంటి ఒక అద్భుతమైన గదని రాముడి మీదకి వేశాడు. ఆ గద దారిలో అడ్డొచ్చిన చెట్లని కాల్చుకుంటూ రాముడి మీదకి దూసుకువచ్చింది. అప్పుడు రాముడు ఏకకాలంలో కొన్ని బాణములను ప్రయోగించగా, ఆ గద మార్గమధ్యలోనే తుత్తునియలు అయిపోయింది. తరువాత రాముడు వేసిన బాణాలకి ఆ ఖరుడి ధ్వజం, గుర్రాలు, సారధి పడిపోయారు. ఆ బాణాలు ఖరుడి గుండెల్లో దిగేసరికి, ఆయన గుండెల్లో నుంచి నెత్తురు ఏరులై ప్రవహించింది. ఇక తాను చనిపోతానన్న ఆక్రోశంతో, అక్కడ ఉన్న ఒక పెద్ద సాలవృక్షాన్ని పెరికించి, దాన్ని రాముడి మీద వెయ్యబోగా, రాముడు ఆ చెట్టుని నారాచ బాణములతో ముక్కలు చేశాడు. అప్పుడా ఖరుడు రాముడి మీద పడబోగా, ఆయన బాణం పెట్టి కొట్టగానె, ఖరుడు భూమి మీద పడి మరణించాడు.
అర్థ అధిక ముహూర్తేన రామేణ నిశితైః శరైః |
ఖర దూషణ ముఖ్యానాం నిహతాని మహామృధే ||
రాముడు ఆ 14,000 మంది రాక్షసులని ఒక గంటా 12 నిమిషాల్లో సంహరించాడు. ఆయన తిరిగి వెనక్కి వస్తుంటే పైనుండి పుష్పవృష్టి కురిసింది. అక్కడున్న ఋషులందరూ ఎంతో సంతోషించారు. అప్పటిదాకా ఏమి జెరుగుతోందో అని కంగారుపడుతూ చూస్తున్న సీతమ్మ ఒక్కసారి పరుగుపరుగున వచ్చి రాముడిని ముందునుంచి గట్టిగా కౌగలించుకుంది. పూర్ణచంద్రుడిలా వెలిగిపోతున్న ముఖంతో సీతమ్మ రాముడిని పక్కన నుంచి, వెనక నుంచి, మళ్ళి మళ్ళి కౌగలించుకుంది.