19వ దినము అరణ్యకాండ.
కాని మారీచుడు మిగతా మృగాల దెగ్గరికి వెళ్లేసరికి, అవి ఈయనని రాక్షసుడిగా కనిపెట్టి దిక్కులు పట్టి పారిపోయాయి. అదే సమయంలో సీతమ్మ పువ్వులు కొయ్యడానికని అటుగా వెళ్ళింది. ఆవిడ కర్ణికారవ వృక్షం యొక్క పూవులు కోస్తుంటే, ఆవిడకి అభిముఖంగా వచ్చి మారీచుడు నిలబడ్డాడు. ఆ జింకని చూసిన సీతమ్మ పొంగిపోయి \” రామా! లక్ష్మణా! మీరు మీ ఆయుధములను ధరించి గబగబా రండి \” అనింది. రామలక్ష్మణులు వచ్చాక, సీతమ్మ వాళ్ళతో \” ఎదురుగా ఉన్న ఆ మృగాన్ని చూశార, ఎంత అందంగా ఉందో. సృష్టిలో ఇలాంటి మృగాన్ని నేను ఇప్పటివరకు చూడలేదు. ఆ బంగారు రంగు చర్మము, వెండి చుక్కలు…………..\” అని సీతమ్మ ఆ మృగాన్ని గూర్చి వర్ణించబోతుండగా, వెంటనే లక్ష్మణుడు ఇలా అన్నాడు…..
శంకమానః తు తం దృష్ట్వా లక్ష్మణో రామం అబ్రవీత్ |
తం ఏవ ఏనం అహం మన్యే మారీచం రాక్షసం మృగం ||
\” అన్నయ్యా, ఇది మృగం కాదు, ఇది మారీచుడు. ఈ సృష్టిలో ఎక్కడా ఇటువంటి జింక లేదు. ఈ మారీచుడు ఇలా కామరూపాన్ని పొంది, వేటకి వచ్చిన ఎందరో రాజులని ఆకర్షించి, భుజించాడు. నామాట నమ్ము, ఇది కచ్ఛితంగా మారీచుడి మాయ \” అన్నాడు.
అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని ఇంక మాట్లాడవద్దు అన్నట్టు వారించి రాముడితో \” ఆర్యపుత్రా! నా మనస్సుని ఈ మృగం హరిస్తోంది, నాకు ఆడుకోవడానికి ఆ మృగాన్ని తెచ్చి ఇవ్వండి. చంద్రుడు అరణ్యాన్ని ప్రకాశింపచేసినట్టు, ఒంటి మీద రాత్నాలలాంటి చుక్కలతో ఈ జింక అరణ్యాన్ని ప్రకాశింపచేస్తుంది. మనం కట్టుకున్న ఆశ్రమంలో ఎన్నో మృగాలు ఉన్నాయి, వాటితో పాటు ఈ జింక కూడా ఉంటె నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆహా, ఏమి లక్ష్మీ స్వరూపం, ఏమి అందం, ఏమి ప్రకాశం, మీరు ఎలాగన్నా సరే ఆ మృగాన్ని పట్టి నాకు ఇవ్వండి. ఇంక కొంతకాలంలో ఈ అరణ్యవాసం పూర్తయిపోయి మనం అంతఃపురానికి వెళ్ళి పోతాము. అప్పుడు ఈ మృగాన్ని తీసుకొనివెళదాము. ఈ మృగం భవిష్యత్తులో అంతఃపురాన్ని శోభింపచేస్తుంది. మనం అంతఃపురానికి వెళ్ళగానే భరతుడు ఈ మృగాన్ని చూసి \’ అబ్బ, ఏమి మృగం వదిన \’ అంటాడు, అత్తగార్లు అందరూ చూసి \’ అబ్బ, ఏమి మృగం \’ అంటారు. అందుకని మీరు దాన్ని జీవించి ఉండగానన్నా పట్టుకురండి, లేకపోతే చంపైనా తీసుకురండి. మీరు ఒకవేళ దాన్ని చంపి తీసుకువస్తే, దాని చర్మాన్ని ఒలుచుకొని, లేత పచ్చగడ్డి మీద ఈ జింక చర్మాన్ని పరుచుకొని దాని మీద కూర్చుంటే, ఎంతబాగుంటుందో. రామ! నేను స్త్రీని కావడం చేత, ఏదన్నా కోరిక కలిగేటప్పటికి భావంలో వ్యగ్రత ఏర్పడుతుంది. \’ ఎలాగైనా నా కోరిక తీర్చవలసిందే \’ అని మంకుపట్టు పట్టినట్టు మాట్లాడాన. అలా మాట్లాడితే ఏమి అనుకోకండె \” అనింది.
అప్పుడు రాముడు లక్ష్మణుడి వంక చూసి \” లక్ష్మణా! మీ వదిన ఈ 13 సంవత్సరాల అరణ్యవాసంలో ఏమి అడగలేదు. మొట్టమొదటి సారి ఈ జింకని అడుగుతుంది. ఆ మృగం పట్ల ఎంత వ్యామోహాన్ని పెంచుకుందొ మీ వదిన మాటలలో స్పష్టంగా అర్ధమవుతోంది. ఆమె ఇంతగా ఈ మృగాన్ని అడుగుతుంటే, తీసుకురాను అని నేను ఎలా అనగలను. అందుకని నేను ఆ మృగాన్ని పట్టుకొని తీసుకువస్తాను. ఒకవేళ నేను దాన్ని ప్రాణాలతో తీసుకురాలేకపోతే, దాని శరీరాన్ని అయినా తీసుకువస్తాను. మీ వదిన చెప్పినట్టు ఇలాంటి మృగాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఇలాంటివి నాకు తెలిసి రెండే ఉన్నాయి, ఒకటి చంద్రుడిలో ఉంది, ఇది భూమి మీద ఉంది ( దీని అర్ధం ఏంటంటే, చంద్రుడిలో ఎటువంటి మృగం ఉండదు, అలాగే భూమి మీద ఇది ఉందంటే, ఈ రెండూ మాయె అని అర్ధం). ఒకవేళ నువ్వు చెప్పినట్టు ఆ మృగం మారీచుడె అయితే నేను వాడిని సంహరిస్తాను. లక్ష్మణా! చాలా జాగ్రత్త సుమా. ప్రతి క్షణమూ నువ్వు శంకిస్తూనె ఉండాలి. నువ్వు మరియు జటాయువు సీతని జాగ్రత్తగా కాపాడండి \” అని చెప్పి, రాముడు ఆ మృగాన్ని పట్టుకోవడానికని దాని వెనకాల వెళ్ళాడు.
జింక రూపంలో ఉన్న మారీచుడు ముందు పరిగెడుతున్నాడు, వెనకాల రాముడు పరిగెడుతున్నాడు. ఆ మారీచుడు కనపడినట్టు కనపడి మాయమవుతూ, మందలలో కలిసిపోతూ అటూ ఇటూ పరుగులు తీస్తున్నాడు. మారీచుడు రాముడికి ఒక్కొక్కసారి ఇక్కడే కనపడుతున్నాడు, కాని రాముడు అక్కడికి వెళ్ళేసరికి అక్కడెక్కడో దూరంగా కనపడతాడు. సరే అని రాముడు అక్కడిదాకా పరుగు తీసి వెళ్ళేసరికి అంతర్ధానమయిపోతున్నాడు. అలా రాముడిని పరిగెత్తించి పరిగెత్తించి ఆ అరణ్యంలోకి చాలా దూరంగా తీసుకుపోయాడు. అప్పుడిక రాముడు పరిగెత్తలేక అలసిపోయి ఒక చెట్టుకింద కూర్చున్నాడు. అప్పుడు దూరంగా, మృగాల యొక్క మందలో చెవులు అటూ ఇటూ తిప్పుతూ ఆ మృగం మళ్ళి కనపడింది. ఈ మృగాన్ని పట్టుకోవడానికి ఇక పరిగెత్తడం అనవసరమని రాముడు అనుకొని, ఒక త్రాచుపాములాంటి బాణాన్ని కొదండానికి సంధించి, బ్రహ్మగారి చేత నిర్మింపబడిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి, ఆ మృగం వైపు గురి చూసి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బ్రహ్మాస్త్రం నిప్పులు కక్కుతూ మారీచుడి మీద పడింది. అప్పుడా మారీచుడు రాముడి స్వరంతో గట్టిగా \” హా! సీత, హా! లక్ష్మణా \” అని అరిచాడు. ఆనకట్ట పగిలి అందులోనుంచి నీరు బయటకి వస్తే ఎలా ఉంటుందో, అలా మారీచుడి శరీరం నుండి నెత్తురు బయటకి ప్రవహిస్తుండగా ఆ మారీచుడు భూమి మీద తన నిజస్వరూపంతో పడిపోయాడు.
ఆ దృశ్యాన్ని చూశిన రాముడికి వెంటనే సీతమ్మ గుర్తుకువచ్చింది, లక్ష్మణుడి మాట గుర్తుకువచ్చింది. సీతకి ఎటువంటి ఉపద్రవం రాలేదు కాదా అని బెంగపెట్టుకొని, అక్కడున్నటువంటి రెండు మృగాలని సంహరించి, వాటి మాంసాన్ని తీసుకొని గబగబా ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఇంతలో మారీచుడు అన్నటువంటి \’ హా! సీత, హా! లక్ష్మణా \’ అనే కేక సీతమ్మ చెవినపడింది. అప్పుడు సీతమ్మ లక్ష్మణుడిని పిలిచి \” చూడవయ్యా మీ అన్నగారు ఏదో ఉపద్రవంలో ఉన్నారు. \’ హా! సీత, హా! లక్ష్మణా\’ అని ఒక పెద్ద కేక వేశారు. బలిష్టమైన ఎద్దుని సింహం లాగుకొని పోతుంటే ఆ ఎద్దు ఎలా అరుస్తుందో, ఇవ్వాళ మీ అన్నగారు అలా అరుస్తున్నారు. నాకు చాలా బెంగగా ఉంది, నువ్వు వెంటనే బయలుదేరి అరణ్యంలోకి వెళ్ళు \” అని అనింది.
అప్పుడు లక్ష్మణుడు \” వదినా! నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు, అన్నయ్యకి ఏ ప్రమాదము రాదు \” అని అన్నాడు.
తన భర్త ప్రమాదంలో ఉన్నాడేమో అన్న బెంగతో ఉన్న సీతమ్మ లక్ష్మణుడి మాటలకి ఆగ్రహించి \” నాకు ఇప్పుడు అర్ధమయ్యింది నువ్వు ఎందుకు వచ్చావో. నువ్వు మీ అన్నకి తమ్ముడివి కావు, నువ్వు మీ అన్న పాలిట పరమ శత్రువువి. అందుకే మీ అన్న ప్రమాదంలో ఉంటె నువ్వు ఇంత సంతోషంగా కుర్చోగలుగుతున్నావు. నువ్వు ఇంతకాలం రాముడి వెనకాల ఉండడానికి కారణం నా మీద నీకు కోరిక ఉండడమే. అందుకే, రాముడికి ప్రమాదం వస్తే నన్ను పొందాలని వెనకాలే వచ్చావు. నీ ముఖంలో ఒక గొప్ప నమ్మకం, హాయి కనపడుతున్నాయి. శత్రువు చేతిలో దెబ్బతిన్న రాముడి గొంతువిని ఇంత హాయిగా కూర్చున్నావు. ఈ క్షణం కోసమే నువ్వు 13 సంవత్సరాల నుంచి నిరీక్షిస్తున్నావు. మహాపాపి! ఎంత ద్రోహబుద్ధితో వచ్చావురా. నువ్వు రాముడిని విడిచిపెట్టి ఉండలేక, రాముడికి సేవ చెయ్యడానికే వచ్చినవాడివి అయితే, రాముడు అరణ్యంలో \’ హా! సీత, హా! లక్ష్మణా \’ అని అరిస్తే నువ్వు ఇంత హాయిగా కుర్చోగాలవా, నాతో కూడా చెప్పకుండా అన్నగారిని కాపాడడం కోసం పరుగెత్తేవాడివి. బహుశా భరతుడే నిన్ను పంపాడేమో, మీ ఇద్దరు కలిసి కుట్ర చేశారు \” అనింది.
తన రెండుచేతులతో సీతమ్మకి అంజలిఘటించి లక్ష్మణుడు ఇలా అన్నాడు \” దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఈ బ్రహ్మాండంలో ఉన్న వీరులంతా ఒకపక్క, మా అన్నయ్య ఒక పక్క ఉన్నా ఆయనని ఎవరూ నిగ్రహించలేరు. అన్నయ్య పరాక్రమమేమిటో నాకు తెలుసు. వదినా! ఎవరో అరిస్తే నువ్వు బెంగ పెట్టుకొని మాట్లాడుతున్నావు, అరిచినది మయా మారీచుడు, అన్నయ్య అరవలేదు. నామాట నమ్ము.
న సస్ తస్య స్వరో వ్యక్తం న కశ్చిత్ అపి దైవతః |
గంధర్వ నగర ప్రఖ్యా మాయా తస్య చ రక్షసః ||
నేను యదార్ధం చెబుతున్నాను, అది అసలు మా అన్నయ్య అరుపే కాదు. మాయావి అయినవాడు నిర్మించిన గంధర్వ నగరం ఎలా ఉంటుందో, అలా మా అన్నయ్య కంఠంతో చనిపోయేముందు ఒక మాయావి అరిచాడు. మా అన్నయ్య కంఠం అక్కడ పూర్తిగా రాలేదు. నన్ను దూరంగా పంపితే నువ్వు ప్రమాదంలోకి వెళతావు. అందుకని నువ్వు బెంగపెట్టుకోకు. నువ్వు అలా చూస్తూ ఉండు, అన్నయ్య కోదండం పట్టుకొని వచ్చేస్తాడు. ఆ మాయ మృగం చర్మంతో వస్తాడు. అన్నయ్య వెళ్ళేముందు, వదినని నీకు అప్పజెప్పి వెళుతున్నాను ప్రతి క్షణాన్ని సంకిస్తూ నువ్వు వదిన పక్కనే ఉండు అన్నాడు. నేను ఇప్పుడు నిన్ను వదిలి వెళితే, అన్నయ్యకి ఇచ్చిన మాట తప్పినవాడిని అవుతాను. ధర్మం తప్పిపోతానని నిలుచున్నాను తప్ప నేను అన్యబుద్ధి కలిగిన వాడిని కాదు వదినా. నన్ను క్షమించు. అన్నయ్య మాట మీద నేను నిలబడేటట్టు అనుగ్రహించు. నిన్నగాక మొన్న ఖర దూషణులతో కలిపి 14,000 మంది రాక్షసులని అన్నయ్య చంపాడు. అన్నయ్య మీద రాక్షసులు పగబట్టి ఉన్నారు. అందుచేత ఎలాగైనా మనకి ఉపద్రవం తేవాలని మాయా స్వరూపంతో ఇవ్వాళ ప్రవర్తించారు. నా మాట నమ్ము, ఆ అరుపులని నమ్మకు \” అన్నాడు.
అప్పుడు సీతమ్మ \” నాకు అర్ధమయ్యిందిరా మహా పాపి! కృరాత్ముడా! నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదని అనుకోకు. రాముడు మరణించాడన్న మాటని ద్రువపరుచుకోడానికి ఇక్కడ నిలుచున్నావు. నన్ను పొందడం కోసమే నువ్వు రాముడి వెనకాల వచ్చావు, నిన్ను భరతుడే పంపించాడు. మీ ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. కాని నువ్వు ఒక విషయం తెలుసుకో, ఇందీవరశ్యాముడైన రాముడు పడిపోయాక నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. నేను వెళ్ళమన్నా వెళ్ళకుండా, రాముడు ప్రాణాపాయంలో ఉంటె నువ్వు నా దెగ్గర నిలబడి మాట్లాడుతున్నావు కనుక, నీ ఎదుటనే విషం తాగి శరీరాన్ని విడిచిపెట్టేస్తాను \” అనింది.
అప్పుడు లక్ష్మణుడు \” ఎంత ప్రమాదం తెచ్చావు వదిన ఇవ్వాళ. నేను ఇక్కడ నిలబడితే నీ ప్రాణాలు తీసుకుంటావు, నేను వెళ్ళిపోతే నీకు ప్రమాదం వస్తుంది \” అని అన్నాక రెండుచేతులతో సీతమ్మ పాదాలు పట్టుకొని \” వదినా! నువ్వు ఇవ్వాళ ఒక సామాన్యమైన స్త్రీ మాట్లాడినట్టు మాట్లాడావు, నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు, కాని నేను మాత్రం ఒక్కదానికి కూడా జవాబు చెప్పను. ఆ మాటలకి ఏమి చెప్పుకొని జవాబు చెప్పను. నేను నిన్ను ఎన్నడూ ఆ భావనతో చూడలేదు. అటువంటి నన్ను ఇన్ని మాటలు అన్నావు, భరతుడిని కూడా కలిపావు. ఎన్ని మాటలు చెబితే నేను తిరిగి నీ మాటలకి జవాబు చెప్పగలను. అందుకని నేను ఏ ఒక్క మాటకి జవాబు చెప్పను. నువ్వు వదినవి, పెద్దదానివి, అనడానికి నీకు అర్హత ఉంది. కాని నన్ను ఇన్నిమాటలు అని దూరంగా పంపించడం వలన ఫలితాన్ని మాత్రం నువ్వు పొందుతావు.
వదిన నాతో అన్న మాటలని నేను అన్నయ్యతో చెప్పలేను కనుక, ఓ వనదేవతలార! మీరు నాకు సాక్ష్యంగా ఉండండి. నేను ఇప్పుడు వదినని వెళ్ళడంలో ఉన్న న్యాయాన్ని వనదేవతలు గ్రహించెదరుగాక. వదినా! నేను రాముడి దెగ్గరికి వెళుతున్నాను, నిన్ను ఈ వనదేవతలు రక్షించాలని కోరుకుంటున్నాను \” అని వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సీతమ్మ పాదాల వంక చూసి శిరస్సు వంచి నమస్కరిస్తూ \” అమ్మా! నేను మళ్ళి తిరిగొచ్చి, మా అన్నయ్య నీ పక్కన నిలుచుంటే, మా అన్నయ్య పాదాలకి నీ పాదాలకి కలిపి నమస్కరించే అదృష్టం నాకు దొరుకుతుందా….\” అన్నాడు.
అప్పుడు సీతమ్మ \” పాపిష్ఠివాడ, నువ్వు ఇంకా వెళ్ళకుండా నిలుచుంటే నీకు దక్కుతానని అనుకుంటున్నావేమో. నా పాదంతో కూడా నిన్ను తాకను. నువ్వు వెళ్ళకపోతే ఇప్పుడే విషం తాగన్నా, అగ్నిలో దూకన్నా, గోదావరిలో దూకన్నా, ఉరి వేసుకొని అయినా చనిపోతాను. కదులుతావ కదలవా \” అని సీతమ్మ తన కడుపు మీద బాదుకొని ఏడ్చింది.
అప్పుడా లక్ష్మణుడు సీతమ్మకి ప్రదక్షిణం చేసి ఏడుస్తూ వెళ్ళిపోయాడు.
అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని, ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి, రాశిభూతమైన తేజస్సుతో పరివ్రాజక(సాధువు) వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. అప్పటిదాకా చక్కగా వీచిన గాలి రావణుడిని చూడగానే మందంగా వీచింది. రావణుడు తన ఎర్రటి కళ్ళతో చూసేసరికి, అప్పటిదాకా ఉరకలు వేసిన గోదావరి చప్పుడు చెయ్యకుండా చాలా నెమ్మదిగా ప్రవహించింది.
అలా ఆ రావణుడు సీతమ్మ దెగ్గరికి వెళ్ళి \” నువ్వు పచ్చని పట్టుచీర కట్టుకొని, పద్మం వంటి ముఖంతో, పద్మములవంటి చేతులతో, పద్మాలలాంటి పాదాలతో ఉన్నావు. నువ్వు భూమి మీద యదేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా. నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి……….\” అంటూ సీతమ్మని కేశములనుండి పాదముల వరకూ ఏ అవయవాన్ని వదలకుండా అంగాంగ వర్ణన చేశాడు. అలాగే \” చాలా వేగంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుని విరిచినట్టు, నువ్వు నా మనస్సుని విరిచేస్తున్నావు. యక్ష, కిన్నెర, గంధర్వ స్త్రీలలో నీవంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు? అయ్యయ్యో ఇది చాలా క్రూరమృగాలు ఉండే అరణ్యం, ఇక్కడ రాక్షసులు కామరూపాలలో తిరుగుతుంటారు, నువ్వు తొందరగా ఇక్కడినుంచి వెళ్ళిపో. నువ్వు మంచి మంచి నగరాలలో, పట్టణాలలో ఉండాలి, అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి. నువ్వు శ్రేష్టమైన మాలికలు, హారాలు వేసుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి \” అన్నాడు. ( ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దెగ్గరికి వచ్చి, ఆమె అందాన్ని పొగుడుతూ, తనని తాను పొగుడుకుంటూ, ప్రేమ అనే అందమైన భావాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడే వాళ్ళలాగ ఆనాడు రావణుడు మాట్లాడాడు.)
కాని సీతమ్మ తల్లి మనస్సు రాముడి మీదనే ఉండిపోవడం వలన, రావణుడి నీచపు మాటలని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. కాని ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో, అలా ఆ భిక్షుని రూపంలో ఉన్న రావణుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆయనకి అర్ఘ్య పాద్యములు ఇచ్చింది.
సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోడానికి సిధ్దపడుతున్న రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తుంది అని వాల్మీకి మహర్షి అన్నారు.
అప్పుడా సీతమ్మ \” నా పేరు సీత, నేను జనక మహారాజు కూతురిని. రాముడి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని పెళ్ళి చేసుకున్న తరువాత మనుషులు అనుభవించే భోగములన్నిటిని అనుభవించాను( సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది). కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములయందు మాకు సేవ చేస్తుంటాడు.
మమ భర్తా మహాతేజా వయసా పంచ వింశకః ||
అష్టా దశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||
అరణ్యవాసానికి వచ్చేటప్పటికి నాకు 18 సంవత్సరాలు, రాముడికి 25 సంవత్సరాలు \” అని చెప్పి \” ఓ బ్రాహ్మణుడా! నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, నీ గోత్రం ఏమిటి, నువ్వు ఎవరు \” అని అడిగింది.
అప్పుడా రావణుడు \” సీత! నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు, అందరూ భయపడిపోతారు. పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దెగ్గరి నుంచీ, ఎందరో భార్యలు ఉన్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడంలేదు, అందుకని నీకోసం వచ్చాను. నువ్వు నాతో వస్తే, నిన్ను పట్టమహిషిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే, 5000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు, సమస్త లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను \” అన్నాడు.
రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ \” రావణా! నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహా సముద్రాన్ని, పర్వతాన్ని కదపడం ఎలా చేతకాదో, అలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, జితేంద్రియుడు, సింహంలాంటి బాహువులు కలిగినవాడు, మదించిన ఏనుగులా నడవగలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప, నీవంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో, నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని దెగ్గరికి వెళ్ళి ఎలా ముట్టుకోలేమో, నువ్వు నన్ను అలా పొందలేవు. నువ్వు పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత అజ్ఞానో, పెద్ద రాయిని మెడకి చుట్టుకుని సముద్రాన్ని ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, సూర్య చంద్రులని చేతితో పట్టుకుని ఇంటికి తీసుకువెళదాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, ఇనుప కొనలున్న శూలం మీద నడుద్దాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, నువ్వు అంత అజ్ఞానివి. సీసానికి బంగారానికి, గంధపు నీటికి బురదకి, ఏనుగుకి పిల్లికి, కాకికి గరుగ్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో, రాముడికి నీకు అంత తేడా ఉంది \” అని అనింది.
అప్పుడా రావణుడు \” నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని, ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి, ఆ కుబేరుడిని లంకా పట్టణం నుంచి వెళ్ళగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. మళ్ళి ఉత్తర దిక్కుకి వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను. నాకు కాని కోపం వచ్చి కనుబొమ్మలని ముడేస్తే, ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు. దశరథుడి చేత వెళ్ళగొట్టబడి, రాజ్యం లేక, అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటావేంటి. నా దెగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు. నేను చిటికిన వేలితో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు నీ అదృష్టం, నా కన్ను నీ మీద పడింది, నన్ను నువ్వు పొందు \” అని గర్వంగా అన్నాడు.
అప్పుడు సీతమ్మ \” కుబేరుడి తమ్ముడిని అంటావు, పదిమంది నిలేదీసేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గువెయ్యటం లేదా. ఎందుకురా ఈ ప్రవర్తన నీకు. పద్దాక రాముడు పనికిమాలినవాడు అంటున్నావు, మరి ఆయన లేనప్పుడు నన్ను తీసుకువెళ్ళాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు. రాముడు వచ్చేవరకు అలా నిలబడు చూద్దాము \” అనింది.
అప్పుడు ఆ రావణుడు తన శరీరాన్ని పర్వతమంత పెంచి, తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ధనుర్బాణాలతో, కుండలాలతో మెరిసిపోతున్నాడు, ఆకాశం నుండి దిగి వచ్చిన నల్లటి మబ్బులా ఉన్నాడు. అప్పుడాయన \” నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు, నిన్ను ఇప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతానో చూడు \” అని, అపారమైన కామంతో కన్ను మిన్ను కానక, భయపడుతున్న సీతమ్మ దెగ్గరికి వచ్చి తన ఎడమ చేతితో సీతమ్మ తల్లి జుట్టు గట్టిగా పట్టుకొని, కుడి చేతిని సీతమ్మ తొడల కింద పెట్టి, ఆవిడని పైకి ఎత్తాడు. పైకి ఎత్తి ఆశ్రమం బయటకి వచ్చాడు. అప్పటివరకూ ఎవరికీ కనపడకుండా అదృశ్యంగా ఉన్న ఆ బంగారు రథం ఒక్కసారి ప్రత్యక్షమయ్యి భూమి మీదకి దిగింది.
ఆడ త్రాచుపాము కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్న సీతమ్మని పరుషమైన మాటలతో భయపెడుతూ, రథంలో బలవంతంగా తన తొడల మీద కుర్చోపెట్టుకున్నాడు. అప్పుడాయన రథాన్ని బయలుదేరు అనేసరికి, ఆ రథం బయలుదేరింది. ఆకాశమార్గంలో వెళుతున్న ఆ రథం నుండి సీతమ్మ \” రామ, రామ, మీరు ఎక్కడో అరణ్యంలో దూరంగా ఉండిపోయారు. నా కేక మీకు ఎలా వినబడుతుంది. ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. ధర్మంకోసమని జీవితాన్ని, రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామ! నీ భార్యని ఇవ్వాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు. ఈ విషయం మీకు తెలియదు కాదా. లక్ష్మణా! సర్వకాలముల యందు రాముడిని అనుసరించి ఉండేటటువంటివాడ, నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు కాదా. రక్షించండి, రక్షించండి \” అని పెద్దగా కేకలు వేస్తూ సీతమ్మ ఏడుస్తోంది. అలాగే \” ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ భూమి, ఓ గోదావరీ మీ అందరూ దయచేసి వినండి. నన్ను రావణాసురుడు అపహరించాడన్న వార్త రాముడికి తెలియచెయ్యండి \” అని ఏడుస్తూ ఆ తల్లి రావణుడి తొడ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే, 20 బాహువులతో ఆడ త్రాచుని నొక్కినట్టు నొక్కి తన తోడ మీద కుర్చోపెట్టుకున్నాడు.
అలా రావణుడు సీతమ్మతో వెళ్ళిపోతుంటే, అక్కడే చెట్టు మీద కూర్చొని ఉన్న వృద్ధుడైన జటాయువు కనబడ్డాడు. అప్పటికి ఆయనకి 60,000 సంవత్సరాలు. అప్పుడా జటాయువు \” దుష్టుడైన ఓ రావణా! నువ్వు చెయ్యకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి, అరణ్యాలకి వచ్చి తాపసిలా జీవిస్తున్న రాముడి ఇల్లాలిని అపహరిస్తున్నావు. దీనిచేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. రాజ్యంలో పరిపాలింపబడుతున్న ప్రజలకి ధర్మంలో కాని, అర్ధంలో కాని, కామంలో కాని ఎలా ప్రవర్తించాలి అని అనుమానమొస్తే, తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి, వాళ్ళు అలాగే బ్రతుకుతారు. రాజె ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు. పనికిమాలినవాడికి స్వర్గానికి వెళ్ళడం కోసం విమానం ఇచ్చినట్టు, నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడురా? నిన్ను రాజుని చేసినవాడు ఎవడురా? నేను వృద్ధుడిని, నాకు కవచం లేదు, రథం లేదు. నువ్వేమో యువకుడివి, కవచం కట్టుకున్నావు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, రథం మీద ఉన్నావు. అలాగని నిన్ను విడిచిపెడతాను అనుకున్నావ. నా ప్రాణములు ఉన్నంతవరకూ నువ్వు సీతమ్మని తీసుకెళ్ళకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమాలు అంటె ఏంటో చూద్దువు \” అని పెద్ద పెద్ద రెక్కల ఊపుతూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు.
తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించిన రావణుడు, ఆయన మీదకి కొన్ని వేల బాణములు వేశాడు. ఆ బాణాలు జటాయువు ఒంటి నిండా గుచ్చుకున్నా, ఆయన తన రెక్కలని విదిల్చి ఆ బాణాలని కింద పడేసాడు. తరువాత ఆయన తన రెక్కలని అల్లారుస్తూ ఆ రథాన్ని కొట్టి, రావణుడిని తన ముక్కుతో కుమ్మాడు. ఆ దెబ్బలకి రావణుడి కోదండం విరిగిపోయి, బాణాలు కింద పడిపోయాయి. మళ్ళి ఆ జటాయువు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కింద పడిపోయింది. అప్పుడాయన తన వాడి ముక్కుతో ఆ రథసారధి శిరస్సుని కోసేసాడు. తన కాళ్ళ గోళ్ళతో ఆ రథానికి ఉన్న పిశాచాల్లాంటి గాడిదలని సంహరించాడు. అప్పుడు రావణుడు సీతమ్మతో కిందపడిపోయాడు. అలా పడిపోతు పడిపోతూ ఆ రావణుడు సీతమ్మని ఎడమ చంకలో దూర్చి పట్టుకున్నాడు.
ఇది చూశిన జటాయువుకి ఎక్కడలేని కోపం వచ్చి రావణుడి 10 ఎడమ చేతులని తన ముక్కుతో నరికేశాడు. నరకబడ్డ 10 చేతులతో సహా సీతమ్మ కిందపడిపోయింది. రావణుడికి మళ్ళి ఆ 10 చేతులు పుట్టాయి. అప్పుడా రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని తన మీదకి వస్తున్న జటాయువు యొక్క రెండు రెక్కలని, కాళ్ళని నరికేశాడు.
అప్పుడా రావణుడు అక్కడికి వెళ్ళి \” చెట్లని, లతలని కౌగలించుకుంటావే, రా \” అని, ఆవిడ జుట్టు పట్టుకొని వెనక్కి ఈడ్చేశాడు. రావణుడు సీతమ్మని అలా నేల మీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు, చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకి వెళ్ళిపోతే, ప్రపంచాన్నంతటిని అకారణంగా చీకటి ఆవరించింది. సత్యలోకంలో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. అప్పుడాయన తన దివ్య నేత్రంతో చూసి \” ఒరేయ్, నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవ్వాళ మూటకట్టుకున్నావురా \” అన్నారు.
రావణుడు సీతమ్మ జుట్టు పట్టి, ఈడ్చుకొని తెచ్చి, తన తొడల మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అటూ ఇటూ తన్నుకుంటున్న సీతమ్మని 20 చేతులతో ఓడిసిపట్టుకున్న రావణాసురుడిని చూసి ఋషులు, ఈ కళ్ళతో ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారు, అలాగే రావణ సంహారం అవుతుందని సంతోషించారు.
ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మ ఆభరణాలు కిందపడిపోయాయి, ఆవిడ జుట్టు విడిపోయి చల్లుకుపోయింది, తిలకం పక్కకి తొలగిపోయింది. అలా ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మకి ఒక పర్వత శిఖరం మీద 5 వానరాలు కనబడ్డాయి. వీళ్ళు నా సమాచారాన్ని రాముడికి అందజేస్తారు అనుకొని, తాను కట్టుకున్న వస్త్రం నుండి ఒక ఖండాన్ని చింపి, అందులో తాను ధరించిన నగలని మూటకట్టి ఆ 5 వానరముల మధ్యలో పడేటట్టు విడిచింది. సీతమ్మని తీసుకుపోతున్నాను అన్న ఆనందంలో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు. రెప్ప వెయ్యకుండా ఆ 5 వానరాలు ఈ దృశ్యాన్ని చూశారు.