30వ దినము సుందరకాండ.

ఆ లంబగిరి పర్వతం మీద దిగిన హనుమంతుడు సముద్రం వంక చూసి \” రాముడి అనుగ్రహం ఉండాలి కాని ఇలాంటి యోజనముల ఎన్ని అయినా దాటి వస్తాను \” అన్నాడు.

ధృతిదృష్టితిదాక్ష్యం అనే ఈ నాలుగింటిని ఎవరు తమ పనులలో కలుపుకుంటున్నారో వారికి జీవితంలో ఓటమి అన్నది లేదు అని వాల్మీకి మహర్షి చెప్పారు. ధృతి అంటె పట్టుదల, దృష్టి అంటె మంచి బుద్ధితో ఆలోచించగల సమర్ధత, మతి అంటె బుద్ధితో నిర్ణయించవలసినది, దాక్ష్యం అంటె శక్తి సామర్ధ్యాలు.

ఆ పర్వతం మీద దిగిన హనుమంతుడు విశ్వకర్మ నిర్మితమైన లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఈ లంకా పట్టణాన్ని సొంతం చేసుకోవడం ఆ దేవతల వల్ల కూడా కాదు అని అనుకొని, ఈ రూపంతో సీతమ్మని వెతకడం కష్టం కనుక పిల్లంత రూపంలో సీతమ్మని వెతుకుతాను అనుకున్నాడు. చీకటి పడ్డాక ఆయన పిల్లంత స్వరూపాన్ని పొంది లంక యొక్క రాజద్వారము దెగ్గరికి వెళ్ళాడు.

అక్కడికి వెళ్ళేసరికి వికటాట్టహాసం చేస్తూ పర్వతం అంత ఆకారంతో ఒక రాక్షస స్త్రీ కనపడింది. ఆమె హనుమంతుడిని చూడగానే \” నువ్వు ఎవరు?. అరణ్యములలో తిరిగే కోతివి, నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడికి ఎందుకొచ్చావు? \” అని అడిగింది.

హనుమంతుడు అన్నాడు \” ఓ వికృతమైన కన్నులున్నదాన! నేను ఎందుకు వెళుతున్నానో తెలుసా? ఒకసారి ఆ వనాలని, ఉపవనాలని, చెట్లని, భవనాలని, సరస్సులని చూసి వచ్చేస్తాను. నాకు అనుమతి ఇవ్వు \” అన్నాడు.

అప్పుడు ఆవిడ అనింది \” నేను అనుమతి ఇవ్వడం కాదు, నన్ను గెలిచినవాడు మాత్రమే లోపలికి వెళ్ళగలడు. నువు లోపలికి వెళ్ళడానికి వీలులేదు \” అనింది.

\” సరే ఇంతకీ నువ్వు ఎవరు? \” అని హనుమంతుడు ఆ స్త్రీని ప్రశ్నించాడు.

అప్పుడామె \” నేను లోపలున్న మహాత్ముడైన రావణుడి పనుపున ఈ లంకా పట్టణానికి కాపలా కాస్తుంటాను \” అని చెప్పి చట్టుకున్న హనుమంతుడిని తన చేతితో ఒక దెబ్బ కొట్టింది.

ఆ దెబ్బకి హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చింది. కుడి చేతితో కొడితే ఈమె చనిపోతుందని, తన ఎడమ చేతితో ఆమెని ఒక్క గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి ఆమె కళ్ళు తేలేసి కిందపడిపోయింది.

అప్పుడామె అనింది \” నన్ను లంక అంటారు. నువ్వు నన్ను గెలిచావు, నేను ఈ రావణాసురుడి బాధ భరించలేకపోతున్నాను, కొన్ని వేల సంవత్సరాల నుండి నన్ను విసిగిస్తున్నాడు. \’ ఒక వానరుడు వచ్చి నిన్ను గెలిచిననాడు, నీకు ఈ రావణుడి గొడవ వదిలిపోతుంది \’ అని బ్రహ్మగారు నాకు వరం ఇచ్చారు. ఇప్పుడు నాకు అర్ధమయ్యింది, ఈ లంకలోని రాక్షసుల పని, రావణుడి పని అయిపోయింది. ఇక నువ్వు లోపలికి వెళ్ళి సీతమ్మని కనిపెట్టు \” అని రాజద్వారం తెరిచింది.

అప్పుడు హనుమంతుడు అక్కడున్న గోడమీద నుంచి ఎగిరి లోపలికి ఎడమకాలు పెట్టి దూకాడు. లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణాన్ని చూడగా, ఇది గంధర్వ నగరమా అన్నట్టుగా ఉంది. అక్కడున్న మేడలు, స్తంభాలు బంగారంతో చెయ్యబడి ఉన్నాయి. అన్నిటికీ నవరత్నాలు తాపడం చెయ్యబడి ఉన్నాయి. స్ఫటికములతో మెట్లు కట్టబడి ఉన్నాయి. ఎక్కడ చూసినా దిగుడుబావులు, సరోవరాలతో ఆ ప్రాంతం సోభిల్లుతుంది. ఆ ప్రాంతం చెట్లతో, పక్షులతో, పళ్ళతో, నెమళ్ళ అరుపులతో, ఏనుగులతో, బంగారు రథాలతో అత్యంత రమణీయంగా ఉంది. ఆ రాత్రి పూట ఆకాశంలో ఉన్న చంద్రుడు వెన్నెల కురిపిస్తూ, లోకం యొక్క పాపం పోగొట్టేవాడిలా ఉన్నాడు. ఆ చంద్రుడి ప్రకాశంతో హనుమంతుడు ఆ లంకా పట్టణంలోని వీధులలో సీతమ్మ కోసం వెతుకుతున్నాడు.

ఆ లంకా పట్టణంలో ఉన్నవాళ్లు దీక్షితులు, కొంతమంది తల మీద వెంట్రుకలన్ని తీయించుకున్నారు, కొంతమంది ఎద్దు చర్మాలు కట్టుకొని ఉన్నారు, కొంతమంది దర్భలని చేతితో పట్టుకొని ఉన్నారు, కొంతమంది అగ్నిగుండాలని చేతితో పట్టుకొని ఉన్నారు. ఒకడు పక్కవాడికి తన ఛాతిని చూపిస్తున్నాడు, కొంతమంది తమ శరీరాలని కనపడ్డ స్త్రీల మీద పడేస్తున్నారు, కొంతమంది ఎప్పుడూ తమ చేతులలో పెద్ద పెద్ద శూలాలు పట్టుకొని ఉన్నారు, కొంతమంది పరస్పరం ఒకడిని ఒకడు తోసుకుంటూ ఉన్నారు, తమ భుజాల బలాలని చూపించుకుంటు ఉన్నారు, ఒకడిని మరొకడు అధిక్షేపించుకుంటు మాట్లాడుకుంటున్నారు. ఆ లంకలో ఒకడు శూలం పట్టుకొని, ఒకడు ముద్గరం, ఒకడు పరిఘ, అలా రకరకములైన ఆయుధములు పట్టుకొని ఉన్నారు.

అక్కడున్న రాక్షసుల పేర్లు ఏంటంటే, ప్రహస్తకుంభకర్ణమహొదరవిరూపాక్షవిద్యున్మాలివజ్రదంష్టసుఖసారణఇంద్రజిత్జంబుమాలిసుమాలిరస్మికేతుసూర్యకేతువజ్రకాయధూమ్రాక్షభీమఘనహస్తిముఖకరాళపిశాచమత్తధ్వజగ్రీవసుకనాసవక్రశటవికటబ్రహ్మకర్ణదంష్ట్రరోమస.

హనుమంతుడు ఆ రాక్షసుల అందరి ఇళ్ళల్లోకి వెళ్ళి సీతమ్మ కోసం వెతికారు, ఆ సమయంలో రాక్షస స్త్రీలు తమ భర్తలతో కలిసి ఆనందాన్ని పొందుతున్నారు.

ఆ స్త్రీలందరినీ చూసిన హనుమంతుడు అనుకున్నాడు \” మా అమ్మ సీతమ్మ ఇలా ఉండదు. మా సీతమ్మ కనిపించి కనపడకుండా ఉండే చంద్రరేఖలా ఉంటుంది, మట్టిపట్టిన బంగారు తీగలా ఉంటుంది, బాణపు దెబ్బ యొక్క బాధలా ఉంటుంది, వాయువు చేత కొట్టబడ్డ మేఘంలా ఉంటుంది \” అంటూ, ఆ లంకా పట్టణాన్ని వెతుకుతూ రావణాసురుడి యొక్క ప్రాసాదం దెగ్గరికి వెళ్ళాడు.

అది రాక్షసేంద్రుడైన రావణాసురుడి అంతఃపురం. దానికి మొదటి కక్ష్యలో కొంతమంది గుర్రాల మీద కాపలా కాస్తుంటారు. రెండవ కక్ష్యలో ఏనుగుల మీద కొంతమంది తిరుగుతూ ఉంటారు. ఆ వెనక కక్ష్యలో కొంతమంది కత్తులు పట్టుకొని తిరుగుతుంటారు. ఆ తరువాత కక్ష్యలో, ప్రభువు నిద్రలేవగానే ఒంటికి రాయడానికి కొంతమంది చందనం తీస్తుంటారు. తరువాత కక్ష్యలో ఆయన ధరించే పుష్పమాలికలు ఉంటాయి, ఆ వెనకాల ఆయనకి బాగా నిద్ర పట్టడానికి వాద్యపరికరాల మీద సన్నటి సంగీతాన్ని కొంతమంది వాయిస్తూ ఉంటారు.

\’ ఇంకా అందరూ నిద్రపోలేదు కనుక కొంతసేపయ్యాక రావణ అంతఃపురంలోకి వెళ్ళి చూస్తాను \’ అని హనుమంతుడు అనుకొని, బయటకి వచ్చి మళ్ళి కొన్ని ఇళ్ళల్లోకి వెళ్ళి చూశాడు. ఆ ఇళ్ళల్లో ఉన్న రాక్షసులు లంకకి పూజ చేస్తూ శంఖాలు, భేరీలు, గంటలు మోగిస్తున్నారు. అక్కడ ఉన్న ఇళ్ళు చూసి \” ఇది ఇంద్రపురా, గంధర్వ నగరమా, పొరపాటున నేను స్వర్గలోకానికి వచ్చానా?. అసలు ఇంద్రుడికి ఎన్ని భోగాలు ఉన్నాయో అవన్నీ ఈ లంకా పట్టణంలో కనిపిస్తున్నాయి \” అనుకున్నాడు. అక్కడున్న ఇళ్ళల్లో ఎంత గొప్ప పండితుడైనా ఒక దోషాన్ని కూడా చూపలేడు, అంత అద్భుతంగా అక్కడి ఇళ్ళు ఉన్నాయి. దేవతలకి కూడా ఆ ఇళ్ళల్లోకి వస్తే పూజ చేసుకోవాలనిపిస్తుంది. అక్కడున్న కిటికీలు కూడా వజ్ర వైడుర్యాలతో అలంకరింపబడి చాలా అందంగా ఉన్నాయి. ఆ లంకా పట్టణం యొక్క శోభని హనుమంతుడు చాలా బలంతో చూశాడు (లంకా పట్టణం యొక్క సౌందర్యాన్ని చూసి, తాను వచ్చిన కార్యాన్ని మరిచిపోకుండా ఉండాలని, హనుమంతుడు ఆ నగరం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నప్పుడు సీతమ్మని కనిపెట్టాలనే విషయాన్ని మనస్సులో బలంగా పెట్టుకొని ఉన్నాడు). ఆ రాక్షసుల ఇళ్లన్నీ వెతికిన తరువాత హనుమంతుడు మెల్లగా రావణ అంతఃపురంలోకి ప్రవేశించాడు.

అప్పుడాయన రావణ అంతఃపురంలో ఉన్న పుష్పక విమానంలోకి ప్రవేశించాడు. ( పుష్పక విమానాన్ని మొట్టమొదట విశ్వకర్మ నిర్మించి బ్రహ్మకి ఇచ్చాడు. కొంతకాలానికి కుబేరుడు బ్రహ్మని గురించి తపస్సు చేస్తే, బ్రహ్మదేవుడు కుబేరుడికి పుష్పక విమానాన్ని ఇచ్చాడు. కుబేరుడి తమ్ముడైన రావణుడు ఆయనని చావగొట్టి ఆ విమానాన్ని తెచ్చుకున్నాడు). ఆ పుష్పక విమానంలో కూర్చుని మనస్సులో ఒక ప్రదేశాన్ని ఊహించుకుంటే, అది వాళ్ళని కన్నుమూసి తెరిసేలోగా అక్కడికి తీసుకువెళుతుంది. ఆ పుష్పకానికి వజ్ర వైడుర్యాలతో నగిషీలు పెట్టబడి ఉంటాయి, అందులో సరోవరాలు, పద్మాలు, ఉద్యానవనాలు, బంగారంతో చెయ్యబడ్డ వేదికలు, కూర్చోడానికి ఆసనాలు, పడుకోడానికి తల్పాలు, విహరించడానికి ప్రదేశాలు ఉంటాయి. అందులోకి ఎంతమంది ఎక్కినా, ఇంకా ఒకడికి చోటు ఉంటుంది. అందులో ఉన్న తివాచి మీద ఈ భూమండలం అంతా చిత్రీకరించబడి ఉంది. ఈ భూమి మీద ఎన్ని పర్వతాలు ఉన్నాయో, అవన్నీ ఆ తివాచి మీద చెక్కబడి ఉన్నాయి. అలాగే ఏ పర్వతం మీద ఎన్ని చెట్లు ఉన్నాయో, అన్ని చెట్లు అందులో ఉన్నాయి. వాటితో పాటు ఆ చెట్లకి ఉన్న పువ్వులే కాకుండా ఆ పువ్వులలో ఉన్న కేసరములు కూడా చెక్కబడి ఉన్నాయి. దానికి కొంచెం పక్కనే లక్ష్మీదేవి పద్మములలో పద్మాసనం వేసుకొని, నాలుగు చేతులతో కూర్చున్నట్టుగా, రెండు ఏనుగులు బంగారు కలశములు పట్టుకొని, పద్మపు రేకులతో అమ్మవారిని అభిషేకిస్తున్నట్టుగా అక్కడ ఒక చిత్రం ఉంది.

అప్పుడు హనుమంతుడు \” మా అమ్మ ఇలాంటి స్థలంలో, ఇలా రాక్షసులతో మధ్యం సేవించి, ఆనందంగా ఉండదు. మా అమ్మ కన్నులవెంట వేడి నీరు కారుతూ వక్షస్థలం మీద పడిపోతూ ఉంటుంది, రాముడి చేత కట్టబడిన దీర్ఘమైన మంగళసూత్రం మా అమ్మ మెడలో మెరుస్తూ ఉంటుంది, మా అమ్మ కన్నులకు ఉన్న వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా ఉంటాయి, పరిపూర్ణమైన ప్రేమ కురిపించే కన్నులతో మా అమ్మ ఉంటుంది, వనంలో ఉన్న నెమలిలా మా అమ్మ ఉంటుంది \” అనుకుంటూ, పుష్పక విమానం నుంచి కిందకి దిగి, రావణాసురుడు పడుకున్న శయనాగారం వైపు వెళ్ళాడు.

Thank you for watching 30వ దినము సుందరకాండ.

Please watch to 31వ దినము సుందరకాండ.

And follow us on YouTube channel

Leave a Reply

error: Content is protected !!