32వ దినము సుందరకాండ :

 

32వ దినము సుందరకాండ.

హనుమంతుడు సీతమ్మని అలా చూస్తుండగా, మెల్లగా తెల్లవారింది. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో ఆ లంకా పట్టణంలో బ్రహ్మరాక్షసులు(యజ్ఞ యాగాది క్రతువులని నిర్వహించేటప్పుడు సరైన దృష్టి లేకుండా, పక్షపాత బుద్ధితో మంత్రాన్ని ఎవరైతే పలుకుతారో, వారు ఉత్తర జన్మలలో బ్రహ్మరాక్షసులుగా పుడతారు) వేద మంత్రాలను పఠింస్తుండగా, మంగళవాయిద్యాలు వినపడుతుండగా రావణుడు నిద్రలేచాడు. రావణుడు నిద్రలేస్తూ, జారుతున్న వస్త్రాన్ని గట్టిగా బిగించుకున్నాడు. ఆ సమయంలో ఆయనకి సీతమ్మ గుర్తుకు వచ్చి విశేషమైన కామం కలిగింది. ఆయన వెంటనే ఉత్తమమైన ఆభరణములని ధరించి, స్నానం కూడా చెయ్యకుండా అశోకవనానికి బయలుదేరాడు. రాత్రి రావణుడితో క్రీడించిన కాంతలు కూడా ఆయన వెనకాల బయలుదేరారు. ఆ స్త్రీలలో ఒక స్త్రీ రావణుడి కోసం బంగారు పాత్రలో మద్యాన్ని పట్టుకొని వెళ్ళింది , ఇంకొక స్త్రీ రావణుడు ఉమ్మి వెయ్యడం కోసమని ఒక పాత్ర పట్టుకొని వెళ్ళింది , కొంతమంది ఆయనకి గొడుగు పట్టారు. ఆయన వెనకాల కొంతమంది మంగళవాయిద్యాలు మ్రోగిస్తూ వస్తున్నారు, అలాగే కొంతమంది రాక్షసులు కత్తులు పట్టుకొని వచ్చారు. ఇంతమంది పరివారంతో కలిసి దీనురాలైన ఒక స్త్రీ పట్ల తన కామాన్ని అభివ్యక్తం చెయ్యడానికి తెల్లవారుజామున రావణుడు బయలుదేరాడు.

అప్పటివరకూ శింశుపా వృక్షం కింద కూర్చుని రాముడిని తలుచుకుంటూ ఉన్న సీతమ్మ రావణుడు రావడాన్ని గమనించి, ఇటువంటి దుర్మార్గుడికి శరీరంలో ఏ అవయవములు కనపడితే ఏ ప్రమాదమో అని, స్త్రీ అవయవములు ఏవి కనపడితే పురుషుడు ఉద్రేకం చెందుతాడో అటువంటి అవయవములు కనపడకుండా జాగ్రత్తపడి, తన తొడలతో, చేతులతో శరీరాన్ని ముడుచుకొని కూర్చుంది. అలా ఉన్న సీతమ్మ తగ్గిపోయిన పూజలా, అపవాదాన్ని భరిస్తున్నదానిలా, శ్రద్ధ నశించిపోయినదానిలా, యజ్ఞ వేదిలో చల్లారిపోతున్న దానిలా ఉంది. అలా ఉన్న సీతమ్మ దెగ్గరికి తెల్లటి పాలనురుగులాంటి వస్త్రం ధరించి రావణుడు వచ్చాడు. అప్పుడాయన తేజస్సుని చూడలేక హనుమంతుడు కొంచెం వెనక కొమ్మలలోకి వెళ్ళి, ఆకులని అడ్డు పెట్టుకొని రావణుడిని చూశాడు.

రావణుడు సీతమ్మతో \” సీత! నీకు అందమైన స్తనములు ఉన్నాయి, ఏనుగు తొండాల్లాంటి తొడలు ఉన్నాయి. పిరికిదాన! నీకు ఎందుకు భయం, ఇక్కడ ఎవరున్నారు, ఇక్కడున్న వాళ్ళందరూ రాక్షసులే, నేను రాక్షసుడినే. ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఎవ్వరూ రాలేరు. నేను అన్ని లోకాలని ఓడించాను. నా వైపు కన్నెత్తి చూసేవాడు ఎవ్వడూ లేడు, ఇక్కడ తప్పు చెయ్యడానికి భయపడతావు ఎందుకు. ఎవరన్నా ఉత్తమమైన స్త్రీలు కనపడితే వాళ్ళని తీసుకొచ్చి మాదిగా అనుభవించడం రాక్షసుల ధర్మం. నేను రాక్షసుడిని, నేను నా ధర్మాన్ని పాటించాను. ఏదో నేను తప్పు చేసినట్టు చుస్తావేంటి. మనిషికి శరీరంలో యవ్వనం అనేది కొంతకాలం మాత్రమే ఉంటుంది, నువ్వు యవ్వనంలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను కామించాను, నువ్వు ఇలాగె చెట్టు కింద కూర్చొని ఉపవాసం చేస్తే నీ యవ్వనం వెళ్ళిపోతుంది, అప్పుడు నేను నిన్ను కన్నెత్తి కూడా చూడను. యవ్వనంలో ఉన్నప్పుడే భోగం అనుభవించాలి. నేను నిన్ను పొందాలి అని అనుకుని ఉండుంటే అది నాకు క్షణంలో పని, కాని నేను నిన్ను బలవంతంగా పొందను. నీఅంతట నువ్వు నా పాన్పు చేరాలి.

ఎందుకు ఇలా ఒంటిజెడ వేసుకొని, మలినమైన బట్ట కట్టుకొని, భూమి మీద పొడుకుని ఉపవాసాలు చేస్తూ ఉంటావు. నా అంతఃపురంలో ఎన్ని రకాల వంటలు ఉన్నాయో, ఆభరణములు ఉన్నాయో, వస్త్రములు ఉన్నాయో చూడు. 7000 మంది ఉత్తమకాంతలు నీకు దాసీ జనంగా వస్తారు. ఆ రాముడు దీనుడు, అడవులు పట్టి తిరుగుతున్నాడు, అసలు ఉన్నాడో లేదో కూడా తెలీదు. దేవతలు కూడా నన్ను ఏమి చెయ్యలేరు, అలాంటిది ఒక నరుడు ఈ 100 యోజనముల సముద్రాన్ని దాటి వస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు. నువ్వు హాయిగా తాగు, తిరుగు, కావలసినది అనుభవించు, ఆభరణాలు పెట్టుకో, నాతో రమించు. నాకున్న ఐశ్వర్యం అంతా నీ ఐశ్వర్యమే, నీ బంధువులని పిలిచి ఈ ఐశ్వర్యాన్ని వాళ్ళకి ఇవ్వు \” అన్నాడు.

రావణుడి మాటలను విన్న సీతమ్మ శుద్ధమైన నవ్వు నవ్వి, ఒక గడ్డిపరకని తనకి రావణుడికి మధ్యలో పెట్టి \” రావణా! నీ మనస్సు నీవారి యందు పెట్టుకో. నీకు అనేకమంది భార్యలు ఉన్నారు, వాళ్ళతో సుఖంగా ఉండు, పరాయి వాళ్ళ భార్యల గురించి ఆశపడకు. ఒంట్లో ఓపిక ఉంటె ఎలాగన్నా బతకవచ్చు, కాని చనిపోవడం నీ చేతులలో లేదు. నువ్వు సుఖంగా బతకాలన్న, చనిపోవాలన్న నీకు రామానుగ్రహం కావాలి. ఒంట్లో ఓపిక ఉందని పాపం చేస్తున్నావు, కాని ఆ పాపాన్ని అనుభవించవలసిననాడు బాధపడతావు. నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించి సంతోషంగా జీవించు, శరణు అన్నవాడిని రాముడు ఏమి చెయ్యడు. \’ నేను సీతని తీసుకొచ్చాను \’ అంటావేంటి, నీ జీవితంలో నువ్వు నన్ను తేలేవు. సూర్యుడి నుంచి సుర్యుడికాంతిని వేరు చేసి తేగలవా, వజ్రం నుంచి వజ్రం యొక్క ప్రభని వేరు చేసి తేగలవా, పువ్వు నుంచి పువ్వు యొక్క వాసనని వేరు చేసి తేగలవా, ఇవన్నీ ఎలా తీసుకురాలేవో అలా రాముడి నుండి నన్ను తీసుకురాలేవు. మరి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అని అంటావేమో, ఇదంతా నిన్ను చంపడానికి బ్రహ్మగారు వేసిన ప్రాతిపదిక.

ఒక పతివ్రత అయిన స్త్రీని అపహరించి చెయ్యరాని పాపం చేశావు, ఇక నీ పాపం పోదు. దీనికి ఒకటే మార్గం, నన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పగించు, బతికిపోతావు. నేను నిన్ను ఇప్పుడే నా తపఃశక్తి చేత బూడిద చెయ్యగలను, కాని నన్ను రాముడు వచ్చి రక్షిస్తాడన్న కారణం చేత ఆగిపోయాను. అసలు ఈ ఊరిలో ధర్మం అనేది చెప్పేవారు లేరా? ఒకవేళ ఎవరన్నా చెప్పినా నువ్వు వినవా? ఒకవేళ విన్నా దానిని ఆచరించవా? \” అని ప్రశ్నించింది.

ఈ మాటలు విన్న రావణుడికి ఆగ్రహం వచ్చి \” ఏ స్త్రీయందు విశేషమైన కామం ఉంటుందో ఆ స్త్రీయందు ఉపేక్షించే స్వభావం కూడా ఉంటుంది. నన్ను చూసి ఇంతమంది స్త్రీలు కామించి వెంటపడ్డారు. నీకు ఐశ్వర్యం ఇస్తాను, సింహాసనం మీద కుర్చోపెడతాను, నా పాన్పు చేరు అంటె ఇంత అమర్యాదగా మాట్లాడుతున్నావు, నీకు నా గొప్పతనం ఏంటో తెలియడం లేదు \” అని చెప్పి, అక్కడున్న రాక్షస స్త్రీలను పిలిచి \” ఈమెయందు సామమును, దానమును, బేధమును ప్రయోగించండి అని నేకు మీకు చెప్పాను, కాని ఈమె లొంగలేదు, 10 నెలల సమయం అయిపోయింది. ఇంకా 2 నెలల సమయం మాత్రమే ఉంది, ఆ సమయంలో సీత నా పాన్పు తనంతట తాను చేరితే సరి, లేకపోతె మీరు సీతని దండించండి \” అన్నాడు.

( ఇంట్లో తనని ప్రేమించి, అనుగమించే భార్య ఉన్నాకూడా, ఆ భార్యయందు మనస్సు ఉంచకుండా పరస్త్రీయందు మనస్సు ఉంచుకొని, పరస్త్రితో సంగమించిన పురుషుడికి ఆ దోషం పోవాలంటె, 6 నెలలపాటు తిరిగిన వీధి తిరగకుండా, మిట్టమధ్యానం వేళ, చీకటి పడ్డాక, పాత్ర పట్టుకొని ఇళ్ళ ముందుకి వెళ్ళి \’ నాయందు మనస్సున్న ఆరోగ్యవంతురాలైన భార్య ఇంట్లో ఉండగా వేరొక స్త్రీతో సంగమించిన మహాపాతకుడిని. నేను ఆ పాప విముక్తుడిని అవ్వాలి, అందుకని మీ చేతితో ఇంత అన్నం తీసుకొచ్చి పడెయ్యండమ్మా \’ అని ముష్టి ఎత్తుకున్న అన్నం తింటే వాడి పాపం పోతుంది. ఇది పురుషులకి వర్తిస్తుంది, స్త్రీలకి వర్తిస్తుంది.)

అప్పుడు రావణుడి భార్య అయిన ధాన్యమాలిని రావణుడిని గట్టిగా కౌగలించుకొని \” నీయందు మనస్సున్న స్త్రీతో భోగిస్తే అది ఆనందము, నీయందు మనస్సులేని స్త్రీతో ఎందుకు ఈ భోగము. మనము క్రీడిద్దాము పద \” అనేసరికి ఆ రావణుడు నవ్వుకుంటూ తన భార్యలతో వెనక్కి వెళ్ళిపోయాడు.

 

Thank you for watching 32వ దినము సుందరకాండ.

Please watch to 33వ దినము సుందరకాండ.

And follow us on YouTube channel


Discover more from Namo Narayanaya Bhakthi Channel

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

error: Content is protected !!