39వ దినము యుద్ధకాండ :

రావణుడి ఆజ్ఞ మేరకు నిద్రపోతున్న కుంభకర్ణుడిని నిద్రలేపడానికి ఎందరో సైనికులు ఆయన యొక్క శయనాగారంలోకి ప్రవేశించారు. లోపల కుంభకర్ణుడు వింధ్య పర్వతం, మేరు పర్వతం పడుకున్నట్టు పడుకున్నాడు. ఆయన ముక్కు యొక్క రంధ్రములు పెద్ద పర్వత గుహలలా ఉన్నాయి, ఆయన ఊరిపి తీసేసరికి తలుపులు తీసిన వాళ్ళందరూ ఆయన ముక్కులోకి దూరిపోయారు. మళ్ళి ఆయన ఊపిరి విడిచేసరికి లోపలికి వెళ్ళిన వాళ్ళు అక్కడున్న గోడలకి, తలుపులకి కొట్టుకొని కిందపడిపోయారు. ఆయనని ఎలా నిద్రలేపాలి అని వాళ్ళు బాగా ఆలోచించి \” ఈయనకి తినడం అంటె బాగా ఇష్టం. అందుకని ఈయనకి ఇష్టమైన పదార్ధాలని తీసుకొచ్చి పెడదాము. ఎంత నిద్రపోతున్నవాడైనా వాసన పీల్చడం అనేది తప్పదు కదా, మనం పెట్టిన పదార్ధాల వాసనకి నిద్ర లేస్తాడు \” అని అనుకొని ఆయనకి ఇష్టమైన దున్నపోతులని, జింకలని మొదలైన అనేక మృగాలని చంపి, వాటితో మంచి వాసనలు వచ్చే కూరలు వండారు. వండినవాటిని పెద్ద పెద్ద పాత్రలలోకి సర్దారు. తరువాత ఆ పాత్రలని తీసుకొచ్చి ఆయన పడుకున్న శయనాగారంలో సర్దారు. కొన్ని వేల కుంభములతొ మద్యాన్ని తీసుకొచ్చి పెట్టారు. అన్ని ఆహార పదార్ధాలు తీసుకొచ్చి పెట్టినా కుంభకర్ణుడికి తెలివి రాలేదు.

అప్పుడు వాళ్ళు తెల్లటి శంఖాలను పట్టుకొచ్చి మోగించారు, భేరీలు, మృదంగాలు మోగించారు. పెద్ద పెద్ద శూలాలు, పరిఘలు, తోమరాలు పట్టుకొచ్చి ఆయనని పొడిచారు. ఆ కుంభకర్ణుడి చేతులని కొన్ని వందల మంది రాక్షసులు ఎత్తి కిందపడేశారు. తరువాత వాళ్ళు ఏనుగుల్ని, కంచర గాడిదలని, ఎద్దులని, ఒంటెలని తెచ్చి ఆయన శరీరం మీదకి తోలారు. అవి ఆయన శరీరం మీదకి ఒక వైపు నుండి ఎక్కి మళ్ళి ఇంకొక వైపు నుండి దిగుతున్నాయి. వాళ్ళు అన్ని చేసినా కుంభకర్ణుడు మాత్రం చెలించకుండా అలానే నిద్రపోతున్నాడు.

తరువాత వాళ్ళు బాగా చల్లగా ఉన్న నీటి కడవలని తీసుకొచ్చి, ఆ నీటిని ఆయన చెవులలో పోసేశారు. ఇంక లాభం లేదనుకొని ఆ రాక్షసులు ఆయన చెవులని కొరికెయ్యడం మొదలుపెట్టారు. తరువాత పర్వతాలంత ఎత్తు, బరువు ఉన్న 1000 ఏనుగుల్ని తీసుకొచ్చి ఆయన శరీరం మీదకి ఎక్కించారు. అ ఏనుగులు తన శరీరం మీద తిరుగుతుంటే కుంభకర్ణుడికి కొంచెం తెలివొచ్చినట్టనిపించింది. ఈయన మళ్ళి కునుకులోకి వెళ్ళిపోతాడేమో అని అక్కడున్న రాక్షసులు వెంటనే భేరీలు, మృదంగాలు, శంఖాలు మ్రోగించారు. కొంతమంది పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు, కొంతమంది పెద్ద పెద్ద కర్రలతో, శూలాలతొ ఆయనని పొడుస్తున్నారు. అక్కడున్న రాక్షసులందరూ కలిసి ఒకేసారి గట్టిగా అరిచారు. అప్పుడా కుంభకర్ణుడు మెల్లగా కన్నులు తెరిచి, రెండు చేతులని కలిపి ఒళ్ళు విరుచుకొని, పెద్దగా ఆవలించాడు. ఆయన నిద్రలేస్తూనే అక్కడున్న పాత్రలలో ఉన్న మాంసాహారాన్ని అంతా తినేశాడు. ఆ పక్కన ఉన్న కల్లుని కూడా తాగేసాడు.

అప్పుడా రాక్షసులు \” కుంభకర్ణా! ఎన్నడూ లేని ప్రమాదం ఇవ్వాళ లంకకి ఏర్పడింది. మీ అన్నగారు సీతని అపహరించి తీసుకొచ్చారు. కేవలం నరుడైన రాముడు వానరములని తన సైన్యంగా మలుచుకొని 100 యోజనముల సముద్రానికి సేతువు కట్టి, ఆ సముద్రాన్ని దాటి లంకలోకి ప్రవేశించి యుద్ధోన్ముఖుడై తీవ్రమైన యుద్ధం చేస్తున్నాడు. మన వైపు ఉన్న రాక్షస బలంలో అతిరథులు, మహారథులైన ఎందరో యోధులు మరణించారు. ఇంక దిక్కులేని పరిస్థితులలో మీ అన్నగారు నిన్ను నిద్రలేపమని మమ్మల్ని నియమించాడు. అందుకని మేము మిమ్మల్ని నిద్రలేపాము \” అన్నారు.

అప్పుడు కుంభకర్ణుడు \” ఈ మాత్రం దానికి నేను అన్నయ్య దెగ్గరికి వెళ్ళడం ఎందుకు, ఇలానే యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతాను. నేను యుద్ధానికి వెళితే యముడు తన సైన్యంతో పారిపోయాడు, ఇంద్రుడు పారిపోయాడు. నరులైన రామలక్ష్మణులని సంహరించడం నాకు ఒక లెక్కా. నాకు చాలా ఆకలిగా ఉంది, అందరూ యుద్ధ భూమిలోకి యుద్ధం చెయ్యడానికి వెళితే నేను తినడానికి వెళతాను. అక్కడున్న వానరాలని, భల్లూకాలని తింటాను \” అన్నాడు.

అప్పుడు ఆ రాక్షసులు \” అలా వెళ్ళిపోకయ్యా. మీ అన్నగారు నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయనతో మాట్లాడి, ఆయన ఎలా నిర్దేసిస్తే అలా వెళ్ళు \” అన్నారు.

\” ఇవన్నీ తిన్నాక, స్నానం చేసి వస్తాను \” అని కుంభకర్ణుడు అన్నాడు.

స్నానం చేసి బయటకి వచ్చిన కుంభకర్ణుడికి దాహం వేసి అక్కడ 1000 కడవలలో ఉన్న కల్లుని తాగి రావణుడి అంతఃపురానికి బయలుదేరాడు. రావణుడి అంతఃపురానికి వెళుతున్న కుంభకర్ణుడిని చూసిన వానరాలు భయంతో పారిపోయాయి,( కుంభకర్ణుడిది అంత పెద్ద శరీరం, లంకా పట్టణానికి దూరంగా యుద్ధ భూమిలో ఉన్న వానరాలికి కూడా వాడు కనిపించాడు) కొంతమంది చెట్లు ఎక్కేసారు, కొంతమంది పర్వత గుహలలోకి దూరిపోయారు, కొంతమంది సేతువెక్కి పారిపోయారు.

ఈ గందరగోళాన్ని చూసి సుగ్రీవుడు, అంగదుడు \’ ఏంటి విషయము \’ అని అడుగగా, విభీషణుడు అన్నాడు \” మా అన్నయ్య నడిచి అంతఃపురంలోకి వెళుతున్నాడు. ఇంక కొంచెంసేపటిలో వాడు యుద్ధానికి రాబోతున్నాడు. ఇతను రావణుడి తమ్ముడు, ఇతను కూడా ఒక రాక్షసుడే అని వానరాలకి చెప్పకండి, అలా చెబితే వాళ్ళు భయపడతారు, అది కేవలం ఒక యంత్రం అని చెప్పండి \” అన్నాడు.

అప్పుడు కుంభకర్ణుడిని యంత్రము అని ప్రకటించారు. అలా ప్రకటించగానే పారిపోయిన వానరాలన్నీ మళ్ళి తిరిగి వచ్చాయి.

అప్పుడు రాముడు \” విభీషణ! నీ అన్నయ్య ఇలా ఉన్నాడేంటి. వీడు ఇంతేనా లేక పుట్టాక ఇలా పెరిగాడ \” అని అడిగాడు.

విభీషణుడు అన్నాడు \” కొంతమంది రాక్షసులు జన్మించిన తరువాత తపస్సు చేసి బలాన్ని సంపాదిస్తారు. మా అన్నయ్య గొప్పతనం ఏమిటంటె, ఆయన పుట్టడమే ఇలా పుట్టాడు. వీడు పుట్టినప్పటి నుంచి \’ ఆకలీ \’ అని దేశం మీద పడి మనుష్యులని, రాక్షసులని, జంతువులని తినేవాడు. అలా గంటకి కొన్ని లక్షల మందిని తినేవాడు. వీడిని చూసి లోకమంతా తల్లడిల్లిపోయి ఇంద్రుడిని ప్రార్ధించారు. అప్పుడాయన కుంభకర్ణుడు ఆహారం తింటున్న ప్రాంతానికి ఆకాశంలో ఐరావతం మీద వెళ్ళి \’ ఏరా నీకు బుద్ధి ఉందా లేదా, ఏమిట్రా ఆ తినెయ్యడం. కొన్ని గంటల్లో ఈ ప్రపంచంలోని ప్రాణి కోటిని బతకనివ్వవా \’ అని అరిచాడు. అప్పుడు కుంభకర్ణుడు ఆగ్రహంతో పైకి ఎరిగి \’ నేను తింటుంటే నువ్వు ఎవడివిరా చెప్పడానికి \’ అని, ఆ ఐరావతాన్ని ఒక్క తోపు తోసాడు. అప్పుడా ఐరావతం కింద పడిపోయింది. అప్పుడాయన ఆ ఐరావతానికి ఉన్న దంతాన్ని పీకి దానితో ఇంద్రుడిని కొట్టాడు. ఇంద్రుడు భయపడి బ్రహ్మ దెగ్గరికి వెళ్ళి జెరిగినది చెప్పాడు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు \’ సృష్టిలో ఇలాంటివాడు ఒకడు వచ్చాడ! అలా తినెయ్యడమేమిటి, వాడిని ఒకసారి ఇక్కడికి తీసుకురండి \’ అన్నారు.

తరువాత వాళ్ళు కుంభకర్ణుడిని బ్రహ్మగారి దెగ్గరికి తీసుకొచ్చారు. కుంభకర్ణుడిని చూడగానే బ్రహ్మగారు ఉలిక్కిపడి \’ నువ్వు వెంటనే భూమి మీద పడి చచ్చినట్టు నిద్రపో \’ అన్నారు.

కుంభకర్ణుడు అలా నిద్రపోతుంటే లోకమంతా సంతోషించి, కాని రావణుడికి బాధ కలిగింది. అప్పుడాయన బ్రహ్మగారితో \’ అదేమిటి తాత అలా శపించావు, వాడు నీకు మునిమనవడు. అలా నిద్రపోమంటే ఎలా, కొన్నాళ్ళు లేచేటట్టు ఏర్పాటు చెయ్యి \’ అన్నాడు.

అప్పుడు బ్రహ్మగారు \’ వీడు 6 నెలలు నిద్రపోతాడు, ఒక్క రోజే నిద్రలేస్తాడు. ఆ ఒక్క రోజులోనే 6 నెలల తిండి తినేస్తాడు. తినంగానే మళ్ళి నిద్రపోతాడు \’ అన్నారు.

అందుకని వాడు అలా నిద్రపోతుంటాడు రామ. ఇవ్వాళ మా అన్నయ్య వాడిని యుద్ధం కోసం నిద్రలేపాడు. వాడితొ యుద్ధం అంటె సామాన్య మైన విషయం కాదు రామ \” అన్నాడు.

ఇంతలో కుంభకర్ణుడు రావణుడి అంతఃపురానికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు తన బాధ అంతా చెప్పుకుని కుంభకర్ణుడిని యుద్ధానికి వెళ్ళమన్నాడు.

అప్పుడు కుంభకర్ణుడు \” అన్నయ్య! మనం ఏదన్నా ఒక పని చేసేముందు ఆలోచించి చెయ్యాలి. సీతని అపహరించే ముందు ఎవరితో అన్న ఆలోచన చేశావ. ఒక్కడివే ఎవరితో చెప్పకుండా వెళ్ళి తీసుకొచ్చావు, ఇప్పుడది ఉపద్రవం అయ్యి కూర్చుంది. నీకు చెప్పగలిగేంత వాడిని కాదు కాని, నీకన్నా అవతలివాడి పౌరుష పరాక్రమాలు ఎక్కువ అనుకున్నప్పుడు సంధి చేసుకోవాలి, సమానుడు అనుకుంటేనే యుద్ధం చెయ్యాలి, లేదా నీకంటే తక్కువ శక్తి కలిగిన వాడైతేనే యుద్ధం చెయ్యాలి అని విభీషణుడు చెబితే, ఆయనని రాజ్యం నుండి బయటకి పంపించేశావు. ఇప్పుడు అందరూ మరణించిన తరువాత నన్ను నిద్రలేపి యుద్ధానికి వెళ్ళమంటున్నావు. నీ మంత్రులైనా నీకు మంచి చెప్పరా?, నీ ముఖ ప్రీతి కోసం మాట్లాడుతూ ఉంటారా?. వచ్చే ఉపద్రవాన్ని కనిపెట్టి నీకు సలహా ఇవ్వగలిగిన మంత్రులు నీకు లేరా?. ఏమి రాజ్య పాలన చేస్తున్నావన్నయ్యా నువ్వు \” అని అడిగాడు.

ఈ మాటలకి రావణుడికి కోపం వచ్చి \” నేను తప్పే చేశాను అనుకో, దానిని దిద్దుబాటు చెయ్యమని నిన్ను నిద్రలేపాను తప్ప, నా తప్పుని పది మార్లు ఎత్తి చూపమని నిన్ను నిద్రలేపలేదు. నువ్వు ఉపకారం చెయ్యగలిగితే రామలక్ష్మణులని సంహరించు, లేకపోతె వెళ్ళి పడుకో, కాని ఇవ్వాల్టితో నీకు నాకు ఉన్న అనుబంధం తెగిపోతుంది \” అన్నాడు.

అప్పుడు కుంభకర్ణుడు \” ఎందుకన్నయ్యా అంత బెంగ పెట్టుకుంటావు. నేను ఉండి కూడా నీకు ఉపకారం చెయ్యకపోతే నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి. యుద్ధరంగానికి వెళ్ళి ఆ రాముడిని తప్పకుండా సంహరిస్తాను \” అని బయలుదేరుతున్నాడు.

ఆ సమయంలోనే మహోదరుడు అనే రాక్షసుడు అక్కడికి వచ్చి \” కుంభకర్ణా! రాముడు అంత బలవంతుడు అంటూనే యుద్ధానికి వెళతానంటావేంటి. ఇలాంటప్పుడు యుద్ధం చెయ్యకూడదు, మోసాన్ని ప్రయోగం చెయ్యాలి. మనం ఒక అయిదుగురము బయలుదేరి రాముడి మీదకి యుద్ధానికి వెళదాము. అయిదుగురము రాముడి చుట్టూ చేరి ఆయనని నిగ్రహించగలిగితే అదృష్టవంతులం, ఒకవేళ రాముడిని నిగ్రహించలేకపోతె రామనామాంకితమైన బాణములు మన శరీరంలో గుచ్చుకుని ఉంటాయి.అప్పుడు మనం యుద్ధ భూమిలో ఉండకుండా వెనక్కి తిరిగొచ్చి రావణుడి కాళ్ళ మీద పడదాము. అప్పుడాయన ఫలాన అయిదుగురు వెళ్ళి రాముడిని సంహరించారు అని అందరికీ చెబుతాడు. అప్పుడు రావణుడు సీత కూర్చున్న చోట ఒక సభ నిర్వహించి మనన్ని కోరికలు కోరమంటాడు. అప్పుడు మనము డబ్బు, బంగారము, వాహనాలు అడుగుదాము. అవన్నీ రావణుడు సభలో మనకి ఇస్తాడు. అప్పుడు సీత అనుకుంటుంది \’ ఇంత సభ జెరుగుతుంది, బయట భేరీలు మ్రోగుతున్నాయంటే రాముడు మరణించి ఉంటాడు. ఇంక రాముడు ఎలాగూ లేడు కదా….  \’ అని చాలా కాలం సుఖాలకు దూరమైన స్త్రీ కనుక రావణుడి పాన్పు ఎక్కుతుంది. అప్పుడు రావణుడి కోరిక తీరుతుంది \” అన్నాడు.

అప్పుడు రావణుడు \” ఈ మహోదరుడికి రాముడితో యుద్ధం అంటె భయంరా, అందుకని ఇలాంటి నాటకాలన్నీ చెబుతున్నాడు \” అని అన్నాడు.

అప్పుడు కుంభకర్ణుడు \” మీరెవరు రావక్కరలేదు, నేనొక్కడినే వెళతాను \” అన్నాడు.

అప్పుడు రావణుడు \” నువ్వు ఒక్కడివే వెళ్ళద్దు, రాక్షస సైన్యాన్ని తీసుకొని వెళ్ళు \” అని చెప్పి, కుంభకర్ణుడి మెడలో ఒక మాల వేశాడు.

అప్పుడా కుంభకర్ణుడు మంచి ఉత్తరీయము వేసుకొని, ఒక మంచి పంచె కట్టుకొని, శూలాన్ని పట్టుకుని యుద్ధానికి బయలుదేరాడు. ఆయన వెనకాల కొన్ని లక్షల సైన్యం అనుగమించి బయలుదేరింది.

యుద్ధ భూమిలోకి వచ్చిన కుంభకర్ణుడిని ఆ వానరాలు యంత్రము అనుకొని చూస్తున్నారు. హనుమకి, సుగ్రీవుడికి, సుషేనుడికి, గంధమాదనుడికి, నీలుడికి, మైందుడికి మొదలైన నాయకులకి వస్తున్నది యంత్రము కాదు కుంభకర్ణుడు అని తెలుసు. అందుకని వాళ్ళు పెద్ద పెద్ద పర్వతాలు, శిలలు, చెట్లు పట్టుకెళ్ళి కుంభకర్ణుడిని కొడుతున్నారు. వాళ్ళు అలా కొడుతుంటే కుంభకర్ణుడు తన శూలాన్ని ఆడిస్తూ ఆ పర్వతాలని, చెట్లని కొట్టాడు, అప్పుడవి చూర్ణమయ్యి కిందపడ్డాయి. ఆయన తన అరి చేతులతో కొడుతుంటే వేలకు వేల వానరములు మరణిస్తున్నాయి. అలా మరణించిన వానరాలని నోట్లో వేసుకుని నములుతున్నాడు. ఆయన అలా నడుస్తూ వెళుతూ ఒక చేతితో 200 మంది వానరాలని పట్టుకొని నోట్లో వేసుకునేవాడు. ఆయన నోట్లోకి వెళ్ళిన వానరాలలో కొంతమంది ఆయన చెవుల నుండి బయటకి దుకేస్తున్నారు, కొంతమంది ఆయన ముక్కులో నుండి బయటకి దుకేస్తున్నారు. అలా బయటకి వస్తున్న వాళ్ళని కుంభకర్ణుడు మళ్ళి ఏరుకొని తినేస్తున్నాడు. పెద్ద పెద్ద భల్లూకాలని పట్టుకొని కొరుక్కుని తింటున్నాడు. ఆయన శూలం పెట్టి కొడుతుంటే కొన్ని వేల వానరాలు చనిపోయాయి.

అక్కడున్న వానరాలకి వచ్చింది యంత్రము కాదు రాక్షసుడే అని తెలిసిపోయింది. అప్పుడు వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద నుంచి, పడిపోయిన వాళ్ళ మీద నుంచి దూకుకుంటూ పారిపోయారు. కొంతమంది చెట్లు ఎక్కేశారు, కొంతమంది పర్వత గుహలలో దాక్కున్నారు, కొంతమంది సముద్రంలో దూకేశారు, కొంతమంది సేతువు ఎక్కి పారిపోయారు.

అప్పుడు అంగదుడు వాళ్ళందరి దెగ్గరికి వెళ్ళి అన్నాడు \” ఏరా మీరందరూ ఇలా పారిపోతున్నారు కదా, రేపు ఇంటికి వెళ్ళాక మీ భార్యలు మిమ్మల్ని అడిగితే ఏమి చెబుతారు. యుద్ధ భూమిలో కుంభకర్ణుడిని చూసి పారిపోయి వచ్చామని చెబుతార. మీ పౌరుషం ఏమయ్యింది \” అని అందరినీ వెనక్కి తీసుకువస్తున్నాడు.

ఇంతలో నీలుడు, ఋషభుడు, గంధమాధనుడు, సుగ్రీవుడు మొదలైనవారు కుంభకర్ణుడి దెగ్గరికి వెళ్ళారు. అప్పుడా కుంభకర్ణుడు ఓ ఇద్దరిని చేతితో పట్టుకుని నలిపాడు. అప్పుడు వాళ్ళ నోట్లో నుంచి, ముక్కులో నుంచి, కళ్ళల్లో నుంచి, చెవులలో నుంచి నెత్తురు వరదలై పారింది. తరువాత వాళ్ళని అవతలికి విసిరేశాడు. కాని వాళ్ళు చాలా దేహ ధారుడ్యం, బలము ఉన్నవాళ్లు కనుక కిందపడి మూర్చపోయారు. తరువాత ఆ కుంభకర్ణుడు కొంతమందిని పాదాలతో తన్నాడు, కొంతమందిని మోకాళ్ళతో పొడిచాడు. ఈలోగా సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని తీసుకొచ్చి ఆయన మీద పడేశాడు. అది ఆ కుంభకర్ణుడి శరీరానికి తగిలి చూర్ణమయ్యి కిందపడిపోయింది. అప్పుడాయన తన శూలంతొ సుగ్రీవుడిని కొట్టాడు, ఆ దెబ్బకి సుగ్రీవుడు మూర్చపోయి కిందపడిపోయాడు, కాని మళ్ళి స్పృహ వచ్చి పైకి లెగబోతుంటే కుంభకర్ణుడు అన్నాడు \” సుగ్రీవ! నీ జన్మ ఎటువంటిదో నీకు జ్ఞాపకం ఉందా, నువ్వు ఋక్షరజస్సు కొడుకువి(బ్రహ్మగారి కొడుకైన ఋక్షరజస్సు ఒకనాడు తెలియక శాపం ఉన్న ఒక సరస్సులొ స్నానం చేశాడు. అలా స్నానం చేసేసరికి ఆయన ఒక అప్సరస అయ్యాడు. అప్పుడు సూర్యుడు, ఇంద్రుడు ఆ అప్సరస యుక్క తలోచెయ్యి పట్టుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరి వీర్యము స్కలనమయ్యింది. ఇంద్రుడు తన వీర్యాన్ని ఆ అప్సరస యొక్క వాల భాగమునందు విడిచిపెట్టాడు. సూర్యుడు తన వీర్యాన్ని ఆమె కంఠ భాగమునందు విడిచిపెట్టాడు. ఆ కంఠ భాగమునుండి సుగ్రీవుడు, వాల భాగమునుండి వాలి పుట్టారు. ఆ తరువాత బ్రహ్మగారు ఆ అప్సరసని తీసుకెళ్ళి ఇంకొక తటాకంలో స్నానం చేయించాడు, అప్పుడాయన మళ్ళి తన వానర రూపాన్ని పొందాడు). నేను నిన్ను విడిచిపెడతాన….\” అని శూలం పట్టుకొని సుగ్రీవుడిని గట్టిగా కొట్టాడు. ఆ సుగ్రీవుడు నెత్తురు కక్కుతూ కిందపడిపోయాడు.

అప్పుడు హనుమంతుడు ఆ కుంభకర్ణుడి చేతిలో ఉన్న శూలాన్ని లాక్కుని తన తొడకేసి కొట్టి వంచేశాడు. అప్పుడా కుంభకర్ణుడు హనుమంతుడిని ఒక దెబ్బ కొట్టాడు, ఆ దెబ్బకి హనుమంతుడు నోటి వెంట రక్తం కక్కుతూ విచలితుడై పడిపోయాడు. తరువాత ఆ కుంభకర్ణుడు కిందపడిపోయి ఉన్న సుగ్రీవుడిని తన సంకలో పెట్టుకొని తిరిగి లంకలోకి వెళ్ళిపోదామని బయలుదేరాడు. ఆ సమయంలో హనుమంతుడు చూసి అనుకున్నాడు \’ నాకు ప్రభువు అయినవాడిని శత్రువు అపహరిస్తుండగా సేవకుడనైన నేను వెళ్ళి ఆయనని రక్షిస్తే, అది ప్రభువుకి అమర్యాద. సుగ్రీవుడికే తెలివొస్తుంది, వేచి చూద్దాము \” అని హనుమంతుడు అనుకున్నాడు.

ఈలోగా ఆ లంకలో ఉన్న రాక్షస స్త్రీలకి సుగ్రీవుడిని తీసుకువస్తున్న కుంభకర్ణుడిని చూసి చాలా సంతోషం కలిగింది. వాళ్ళు అంతఃపుర గోపురముల మీదనుంచి, మేడల మీదనుంచి చందన ద్రవాలని కుంభకర్ణుడి మీద పోశారు. సువాసనతో కూడిన గంధపు నీళ్ళు మీద పడేసరికి సుగ్రీవుడికి తెలివొచ్చి వెంటనే కుంభకర్ణుడి చెవులు, ముక్కు కొరికేశాడు. తరువాత ఆయన డొక్కల్ని తన గోళ్ళతో చీల్చేశాడు. అలా చీల్చేసేసరికి బాధతో కుంభకర్ణుడు సుగ్రీవుడిని వదిలేశాడు. సుగ్రీవుడు వెంటనే ఆకాశానికి ఎగిరి వెళ్ళిపోయాడు.

ఇంక ఆ కుంభకర్ణుడు కోపంతో మళ్ళి యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆయనకి కోపం ఎక్కువ అవ్వడంతో వానరులతో, భల్లూకాలతో కలిపి రాక్షసులని కూడా నోట్లో వేసుకుని తినేశాడు. ఇంక ఆ సమయంలో లక్ష్మణుడు ఆ కుంభకర్ణుడి మీద బాణ ప్రయోగం చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములు వేసినా అవి కుంభకర్ణుడికి తగిలి కిందపడిపోతున్నాయి. అప్పుడాయన లక్ష్మణుడితో \” ఏమో అనుకున్నాను కాని నువ్వు బాగానే యుద్ధం చేస్తున్నావు. కాని పిల్లాడివి నీతో నాకు యుద్ధం ఏమిటి, నిన్ను చంపితే లాభం ఏమిటి. నేను రాముడిని చంపి వెళ్ళిపోతాను. నన్ను విడిచిపెట్టు, నేను రాముడి దెగ్గరి వెళతాను \” అన్నాడు.

లక్ష్మణుడు కొట్టిన బాణాలకి, సుగ్రీవుడు కొరికిన దానికి ఆ కుంభకర్ణుడి శరీరం నుండి నెత్తురు కారుతోంది. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు \” వీడు ఇలా నిలబడి నడిచినంతసేపు అందరినీ చంపేస్తాడు. వీడు కిందపడిపోతే గొడవ వదిలిపోతుంది. అందుకని మొత్తం వానర సైన్యం అంతా ఎగిరి వెళ్ళి వాడి మీద కూర్చోండి. అప్పుడా బరువుకి వాడు కిందపడిపోతాడు \” అన్నాడు.

అప్పుడు కొన్ని కోట్ల వానరాలు ఎగిరి వాడిమీదకి దూకారు. ఇంతమంది మీద పడేసరికి ఆ కుంభకర్ణుడు ఒకసారి తన శరీరాన్ని దులుపుకున్నాడు, అంతే, అన్ని వానరాలు కిందపడిపోయాయి. అప్పుడు అందరూ రాముడి దెగ్గరికి వెళ్ళారు. \” రామ! ఈ కుంభకర్ణుడిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ నిగ్రహించలేరు. మీరొచ్చి ఈ కుంభకర్ణుడిని సంహరించండి \” అన్నారు.

రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని పరుగు పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి బాణములతో కొట్టాడు. ఆ బాణములు తగిలి రక్తం బాగా కారింది, కాని ఆ కుంభకర్ణుడు ఇంకా వ్యగ్రతని పొంది రాముడి మీదకి వస్తున్నాడు. ఇంక వీడిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి, తీవ్రమైన ములుకులు కలిగిన బాణములని ప్రయోగించాడు. ఆ బాణములు ఆ కుంభకర్ణుడి వక్షస్థలంలో తగిలి వాడి చేతిలో ఉన్న ఆయుధములు జారిపోయి, కళ్ళు తిరిగినంత పనయ్యింది. తరువాత రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడి కుడి చెయ్యి నరికేశాడు. ఆ చెయ్యి కిందపడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరాలు పడి చనిపోయాయి. అప్పుడా కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టుని పట్టుకుని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకూ నరికేశాడు.

రెండు చేతులు పోయినా ఆ కుంభకర్ణుడు తన పాదాలతో వానరాలని తొక్కడం ప్రారంభించాడు. అప్పుడు రాముడు రెండు అర్ధచంద్రాకార బాణములతో వాడి రెండు తొడలని నరికేశాడు. తరువాత వాడి శిరస్సుని ఖండించారు. అప్పుడు వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది, మిగిలిన సగభాగం లంకా ద్వారం వరకూ పడిపోయింది.

కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ \” అయ్యయ్యో, నిద్రపోతున్నవాడిని లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఇవ్వాళ రాముడి చేతిలో నిహతుడయిపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర, మహాపార్ష, ప్రహస్తులు ఎవ్వరూ నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను. ఇప్పుడు కుంభకర్ణుడు మరణించాడు, నా కుడి భుజం ఇవ్వాళ విరిగిపోయింది \” అని కిందపడి ఏడుస్తుంటే, రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు.

వాళ్ళన్నారు \” నాన్నగారు! మీరు అంత బాధ పడకండి. మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్టుగా రామలక్ష్మణులని నిగ్రహించి వస్తాము \” అన్నారు.

అప్పుడు రావణుడు \” ఇప్పటికయినా నా కోరిక తీర్చండి \” అన్నాడు.

అప్పుడు యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి, వాడు తల పగిలి చనిపోయాడు. తదనంతరం మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడినిత్రిశిరుడిని (మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు.

ఆ తరువాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు \” విభీషణ! అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడు \” అని అడిగాడు.

అప్పుడు విభీషణుడు \” ఆయన సామాన్యుడు కాదు. ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దెగ్గర వరాలు పొందాడు. ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు. అందుచేత అతనిని నిహతుడిని చెయ్యడం చాలా కష్టం \” అన్నాడు.

ఆ అతికాయుడు యుద్ధంలో చాలా మందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడితో యుద్ధం చెయ్యబోతుంటే వాడన్నాడు \” లక్ష్మణా! నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి. నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చెయ్యను, అలా చెయ్యడం నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయివాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో \” అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు \” ఈ డాబులెందుకురా, నాతో యుద్ధం చెయ్యి \” అన్నాడు.

అతికాయుడన్నాడు \” పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు, నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు. ఆ తరువాత నీ శరీరం పడిపోయాక బాధ పడతావు. వెళ్ళి రాముడిని పిలువు \” అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు \” నీ బతుక్కి రాముడు కావాలేంటి, నీకు నేను సమాధానం చెబుతాను \” అని అర్ధచంద్రాకార బాణాలని అతికాయుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలాక వాడన్నాడు \” అబ్బో నీతో యుద్ధం చెయ్యవలసిందే \” అని ఐంద్రాస్త్రం, వాయువ్యాస్త్రం మొదలైన ఎన్నో అస్త్రాలని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రములన్నిటికి లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములను ప్రయోగించినా, ఎన్ని అస్త్రములను ప్రయోగించినా, అన్నీ వాడి యొక్క కవచానికి తగిలి పడిపోతున్నాయి.

ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో \” వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం. వాడు ఆ కవచం పెట్టుకుని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది \” అన్నాడు.

అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుడిని సంహరించాడు.

అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు క్రుద్ధుడై, సామాన్యమైన వారిని పంపిస్తే వీలులేదని మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి \” నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది \” అన్నాడు.

అప్పుడా ఇంద్రజిత్ 4 గుర్రములు పూన్చిన రథం ఎక్కి అనేకమంది సైన్యంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మొహరించి ఉంది, కాని ఇంద్రజిత్ మాత్రం కొంతసేపు ఎవరికీ కనపడలేదు.(ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్ సమిధలు, పుష్ప మాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకిలేస్తుంది, అప్పుడు ఒక నల్ల మేకని పట్టుకొచ్చి తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి, మెడ చీల్చి, ఆ మేక మాంసాన్ని ఆ హోమాగ్నిలో వేస్తాడు {వీటిని ఆభిచారిక హోమాలు అంటారు, ఇవి చాలా ప్రమాదకరమైనవి}. అప్పుడా పుష్పాలని, అక్షతలని తన ఆయుధముల మీద వేసి, ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, రథం ఎక్కి మాయమయిపోతాడు, ఇంక ఎవరికీ కనపడడు. ఆ ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కాని, వాడి ధనుస్సు యొక్క శబ్దము కాని, వాడి బాణ ప్రయోగం కాని ఎవరికీ వినపడదు, అర్ధం కాదు. ఆయనకి అందరూ కనపడతారు, కాని ఆయన ఎవరికీ కనపడడు. ఒక్క విభీషణుడు మాత్రమే ఆయనని మాయా బలంతో చూడగలడు)

హోమాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్ రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేసి, బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవ్వరికీ కనపడలేదు, అప్పుడాయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకి వెళ్ళిన ఇంద్రజిత్ దిక్కులని, విదిక్కులని మంచుతొ కప్పేసి, ధనుష్టంకారం కూడా వినపడకుండా కొన్ని వేల బాణాలను ప్రయోగం చేసి హనుమంతుడిని, సుగ్రీవుడిని, ద్వివిదుడిని, మైందుడిని, అంగదుడిని, గంధమాదనుడిని, జాంబవంతుడిని, సుషేణుడిని, వేగదర్సిని, నీలుడిని, గావాక్షుడిని, కేసరిని మొదలైన అనేకమంది వానర వీరులని తన బాణములతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రం చేత కట్టి పడేశాడు.

అప్పుడు వాడు పైనుంచి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో అన్నాడు \” ఒకసారి నాగ పాశాలతో మిమ్మల్ని కట్టాను, కాని మీరు విడిపించుకున్నారు. ఇవ్వాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను, ఇవ్వాల్టితో యుద్ధం అయిపోతుంది \” అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడితో \” లక్ష్మణా! ఇవ్వాళ మనకి వేరొక దారిలేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు, ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టచ్చు, కాని వాడు మాయా యుద్ధం చేస్తున్నాడు, కనుక మనం వాడిని కొట్టలేము. అందుచేత వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తరువాత స్పృహతప్పినవాడు పడిపోయినట్టు రణభూమిలో పడిపో. అప్పుడు వాడు ఎన్ని బాణములు కొట్టాలో అన్ని బాణములతో మన శరీరాలని కొడతాడు. అలా కొట్టేశాక శత్రువు మరణించాడనుకొని, జయలక్ష్మిని పొందాననుకొని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బతికుంటే చూద్దాము. ముందు వాడిని కొట్టెయ్యని \” అన్నాడు.

అప్పుడు ఇంద్రజిత్ రామలక్ష్మణులిద్దరినీ బాణాలతో కొట్టేశాడు. ఇద్దరి శరీరాల నిండా బాణాలతొ కొట్టాడు, నెత్తురు వరదలై కారిపోయింది. వాడి బాణ పరంపరని తట్టుకోలేక రామలక్ష్మణులిద్దరూ భూమి మీద పడిపోయారు. అప్పుడు వాడు వికటాట్టహాసం చేసి చూసేసరికి ఆ యుద్ధ భూమిలో నిలబడి ఉన్నవాడు ఎవడూ లేడు, అందరినీ ఒక్కడే కొట్టేశాడు, మొత్తం 67 కోట్ల వానర సైన్యాన్ని ఇంద్రజిత్ ఒక్కడే కొట్టాడు. తరువాత వాడు అంతఃపురానికి వెళ్ళి రావణుడితో \” రామలక్ష్మణులిద్దరినీ బ్రహ్మాస్త్ర బంధనం చేశాను, వాళ్ళు పడిపోయి ఉన్నారు \” అని చెప్పాడు.

ఇంద్రజిత్ బాణములు ప్రయోగించకముందే విభీషణుడు యుద్ధ భూమినుంచి పారిపోయాడు. హనుమంతుడికి ఉన్న వరం వలన ఆయనని ఏ అస్త్రము బంధించలేదు. ఆ విభీషణుడు హనుమంతుడు కలుసుకొని \” అసలు మన సైన్యంలో ఉన్న పెద్ద పెద్ద వీరులు ప్రాణాలతో ఉన్నారా, ప్రాణాలు విదిచిపెట్టేశార? \” అని ఒక కాగడా పట్టుకొని ఆ యుద్ధ భూమిలో వెతికారు.( ఇంద్రజిత్ అందరినీ కనురెప్పలు కూడా తెరవడానికి వీలులేకుండా బాణాలతో కొట్టాడు)

అలా వెతుకుతుండగా వాళ్ళకి జాంబవంతుడు కనిపించాడు, అప్పుడు విభీషణుడు \” జాంబవంత! నీకు స్పృహ ఉందా, మేము మాట్లాడుతుంది నీకు అర్ధం అవుతుందా \” అని అడిగాడు.

అప్పుడు జాంబవంతుడు మెల్లగా కనురెప్పలు పైకి ఎత్తి అన్నాడు \” నాయనా, నీ కంఠం చేత గుర్తుపట్టానయ్య, నువ్వు విభీషణుడివి కదా. హనుమంతుడు ప్రాణాలతో ఉన్నాడా? \” అని అడిగాడు.

విభీషణుడు అన్నాడు \” నువ్వు పెద్దవాడివి, వానర యోధులకందరికి కూడా నువ్వు తాతవంటి వాడివి. అటువంటి నువ్వు  రామలక్ష్మణులు బతికి ఉన్నారా అని అడగకుండా హనుమంతుడు జీవించి ఉన్నాడా అని ఎందుకు అడిగారు \” అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు అన్నాడు \” మొత్తం వానర సైన్యం అంతా మరణించని, హనుమంతుడు ఒక్కడు బతికుంటే మళ్ళి వీళ్ళందరూ బతుకుతారు. మొత్తం వానర సైన్యం బతికి ఉండని, హనుమంతుడు ఒక్కడు చనిపోతే అందరూ చనిపోయినట్టే. హనుమ శక్తి ఏమిటో నాకు తెలుసు, హనుమ ఉన్నాడా? \” అని అడిగాడు.

వెంటనే హనుమంతుడు జాంబవంతుడి పాదాలు పట్టుకొని \” తాత! హనుమ నీకు నమస్కరించుచున్నాడు \” అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు \” అందరినీ రక్షించగలిగినవాడివి నువ్వే. ఆలస్యం చెయ్యకుండా ఉత్తర క్షణం బయలుదేరి హిమాలయ పర్వతాలకి వెళ్ళు. అక్కడ కైలాశ పర్వతం పక్కన ఓషది పర్వతం ఒకటి ఉంది. దానిమీద ఉండే మృతసంజీవని (దీని వాసన చూస్తే చనిపోయిన వాళ్ళు బతుకుతారు) , విశల్యకరణి (దీని వాసన చూస్తే, శరీరంలో బాణపు ములుకులు గుచ్చుకుని ఉంటె అవి కింద పడిపోతాయి), సంధానకరణి (దీని వాసన చూస్తే విరిగిపోయిన ఎముకలు అతుక్కుంటాయి), సౌవర్ణకరణి (దీని వాసన చూస్తే, ముర్చపోయిన వాళ్ళకి తెలివి వస్తుంది) అనే నాలుగు ఓషదులని తీసుకురా \” అన్నాడు.

జాంబవంతుడు ఈ మాట చెప్పగానే హనుమంతుడు ఒక పర్వతాన్ని ఎక్కి, మెరుపు వెళ్లినట్టు ఆ పర్వతాన్ని తొక్కేసి ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. హనుమంతుడు తీవ్రమైన వేగంతో హిమాలయ పర్వతాలని చేరుకొని, ఓషది పర్వతం ఎక్కడుందని చూస్తుండగా ఆ హిమాలయాల మీద ఆయనకి బ్రహ్మగారి ఇల్లు కనపడింది, అక్కడే పరమ శివుడు తన ధనుస్సుని పెట్టే ఒక పెద్ద అరుగు కనపడింది. అక్కడే హయగ్రీవుడిని ఆరాధన చేసే ప్రదేశం కనపడింది, సూర్య భగవానుడి కింకరులు ఉండే ప్రదేశం కనపడింది, అక్కడే ఇంద్రుడు ఉండే గృహం, కుబేరుడు ఉండే గృహం కనపడింది, అక్కడే సూర్య భగవానుడిని విశ్వకర్మ చెక్కిన వేదిక కనపడింది.

తరువాత ఆయన ఆ ఓషది పర్వతం కోసం వెతికాడు.

ఆ ఓషది పర్వతంలోని ఓషదులు తమని ఎవరో తీసుకుపోడానికి వస్తున్నారని, అవి తమ ప్రకాశాన్ని తగ్గించేసి లోపలికి అణిగిపోయాయి.

ఆ ఓషదులను చూసిన హనుమంతుడు \” ఆ ఓషదులని నాకు కనపడకుండా దాస్తార, రామ కార్యానికి సాయం చెయ్యరా \” అని ఆ పర్వత శిఖరాన్ని పీకి, చేతితో పట్టుకొని వాయు వేగంతో ఆ శిఖరాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిలో పెట్టాడు.

అలా పెట్టేసరికి వాటి వాసనలు పీల్చిన ఇన్ని కోట్ల వానరాలు పైకి లేచిపోయాయి, రామలక్ష్మణులు పైకి లేచారు.

అప్పుడు హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్ళి ఆ హిమాలయ పర్వతాల దెగ్గర పెట్టి వచ్చేశాడు.

అప్పుడు సుగ్రీవుడు అన్నాడు \” మనన్ని బ్రహ్మాస్త్ర బంధనం చేసి వెళ్ళిన ఇంద్రజిత్ కి బుద్ధి రావాలి. అందుకని మీరందరూ ఒకసారి ఎగిరి లంకలోకి దూరిపోండి, కాగడాలు పట్టుకొని లంకనంతా కాల్చెయ్యండి \” అన్నాడు.

సుగ్రీవుడు అలా అనంగానే ఇన్ని కోట్ల వానరాలు లంక యొక్క అంతఃపురాల మీద పడిపోయి రావణ అంతఃపురంతో సహా అన్ని ఇళ్ళని అగ్నికి ఆహుతి చేశారు. ఆ ఇళ్ళల్లో ఉన్న రకరకాల వస్త్రాలు, బంగారు పాత్రలు, ముత్యాలు, రత్నాలు మొదలైనవన్నీ కాలిపోయాయి. బాలురు, వృద్ధులు మినహాయించి లంకలో ఉన్న మిగిలిన మూలబలంలోని రాక్షసులు చాలామంది కాలిపోయారు. ఇదేసమయంలో రామచంద్రమూర్తి క్రుద్ధుడై ధనుష్టంకారం చేశాడు. ఒకపక్క ధనుష్టంకారం, ఒకపక్క వానర ఘోష, ఒకపక్క రాక్షసుల అరుపులు, ఒకపక్క రామ బాణ పరంపర వచ్చి లంకా పట్టణ ప్రాసాదముల మీద పడిపోతుంది. ఎక్కడా చూసినా అరుపులతో పరిస్థితి ఘోరంగా ఉంది.
అప్పుడు రావణుడు కుంభకర్ణుడి కుమారులైన కుంభుడునికుంభుడిని యుద్ధానికి పంపాడు. వాళ్ళతో పాటు ప్రజంఘుడుమకరాక్షుడు అనే తన కుమారుడిని యుద్ధానికి పంపాడు.

అప్పుడు సుగ్రీవుడు కుంభుడిని, హనుమంతుడు నికుంభుడిని, అంగదుడు ప్రజంఘుడిని, రాముడు మకరాక్షుడిని సంహరించారు.

ఈ వార్త విన్న రావణుడు విశేషమైన శోకాన్ని పొంది, మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి యుద్ధానికి వెళ్ళమన్నాడు.

ఆ ఇంద్రజిత్ మళ్ళి అదృశ్యమయిపోయి బాణ పరంపరతో వానరాలని కొట్టడం మొదలుపెట్టాడు.

అప్పుడు లక్ష్మణుడు రాముడితో \” అన్నయ్య! వీడు ఎన్నోసార్లు యుద్ధానికి వస్తున్నాడు. నువ్వు నాకు అనుమతిని ఇవ్వు, సమస్త రాక్షసజాతి నశించిపోవాలని సంకల్పించి, అభిమంత్రించి బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టేస్తాను \” అన్నాడు.

రాముడన్నాడు \” పారిపోతున్నవాడిని, ప్రమత్తుడై ఉన్నవాడిని, కనపడకుండా మాయా యుద్ధం చేస్తున్నవాడిని, వెన్ను చూపి పారిపోతున్నవాడిని, శరణాగతి చేసినవాడిని కొట్టకూడదు. పైగా బ్రహ్మాస్త్రం వేస్తే సమస్త భూమండలం క్షోభిస్తుంది. అందుకని ఒక్కడిని సంహరించడం కోసం అలాంటి అస్త్ర ప్రయోగం చెయ్యకూడదు. మనం అదును చూసి, వాడు ఎటువైపు తిరుగుతున్నాడో, బాణాలు ఎటువైపు నుండి వస్తున్నాయో చాలా నిశితంగా పరిశీలించు. ఇవ్వాళ వాడు ఎక్కడో అక్కడ దొరకకపోడు, అప్పుడు తీవ్రమైన వేగం కలిగిన బాణములతో ఇంద్రజిత్ ని కొట్టి భూమి మీద పడేస్తాను. లక్ష్మణా! ఇది నా ప్రతిజ్ఞ \” అన్నాడు.

రాముడి మాటలను విన్న ఇంద్రజిత్ అనుకున్నాడు \’ ఈ రామలక్ష్మణులు నన్ను కనిపెట్టి కొట్టడానికి సిద్ధపడుతున్నారు. కాబట్టి నేను ఏదో ఒక మోసం చేసి, రామలక్ష్మణుల దృష్టిని నా నుంచి మరల్చాలి \’ అనుకుని ఆలోచించాడు. అప్పుడాయన వెంటనే సీతమ్మని మాయ చేత సృష్టించి తన రథంలొ కుర్చోపెట్టాడు.

ఆయనకి ఎదురుగా హనుమంతుడు ఒక పర్వతాన్ని పట్టుకొని వస్తున్నాడు. అప్పుడా ఇంద్రజిత్ తన రథంలో ఉన్న మాయా సీత చెంపల మీద ఎడాపెడా కొట్టాడు. వాడు అలా కొడుతుంటే ఆవిడ \’ హా రామ, హా రామ \’ అని ఏడుస్తోంది. అలా ఏడుస్తున్న సీతమ్మని చూసిన హనుమంతుడు తట్టుకోలేక ఆ పర్వతాన్ని కిందపడేసి, ఏడుస్తూ \” దుర్మార్గుడా, ఆమె మహా పతివ్రత, రామ కాంత. సీతమ్మని అలా కొడతావ, నాశనమయిపోతావురా నువ్వు, నేను, సుగ్రీవుడు నిన్ను విడిచిపెట్టము, నీ శిరస్సు గిల్లేస్తాను. సీతమ్మని వదులు \” అని హనుమంతుడు బాధతో ఏడుస్తూ అరిచాడు.

అప్పుడు ఇంద్రజిత్ అన్నాడు \” ఆమె స్త్రీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. కాని మాకు దుఃఖాన్ని కల్పించింది కాబట్టి ఈమెని మాత్రం నేను విడిచిపెట్టను \” అని చెప్పి ఒక ఖడ్గాన్ని తీసుకొని ఆమె శరీరాన్ని చీరేశాడు. అప్పుడా మాయా సీత మరణించి ఆ రథంలో పడిపోయింది. తరువాత ఇంద్రజిత్ ఆ రథంతో వెళ్ళిపోయాడు.

ఎప్పుడైతే సీతమ్మ పడిపోయిందో అప్పుడు హనుమంతుడు యుద్ధం మానేసి, ఏడుస్తూ, పెద్ద పెద్ద కేకలు వేస్తూ \” ఇంకా ఈ యుద్ధం ఎవరి కోసం చేస్తారురా. ఏ తల్లిని రక్షించడానికి యుద్ధానికి వచ్చామో ఆ తల్లిని సంహరించాడు. ఇంక నేను యుద్ధం చెయ్యను \” అని ఏడుస్తూ రాముడి దెగ్గరికి వెళ్ళి \” రామ! దుర్మార్గుడైన ఇంద్రజిత్ వానరులందరూ చూస్తుండగా సీతమ్మని తీసుకొచ్చి, సంహరించి తీసుకెళ్ళిపోయాడు. ఇంక సీతమ్మ లేదు \” అని చెప్పాడు.

ఈ మాటలు విన్న రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు.

తరువాత వాళ్ళు రాముడి ముఖం మీద కొన్ని నీళ్ళు పోసి ఆయనని లేపారు.

అప్పుడు లక్ష్మణుడు అన్నాడు \” అన్నయ్యా! నువ్వు ధర్మము ధర్మము ధర్మము అని ఇన్నాళ్ళు పట్టుకు తిరిగావు. ఆ ధర్మం నీకు ఏ ఫలితాన్ని ఇచ్చింది. నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల రాజ్య భ్రష్ట్రుడివి అయ్యావు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల తండ్రిగారు మరణించారు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల సీతమ్మ అపహరింపబడింది, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల జటాయువు మరణించాడు, నువ్వు పట్టుకున్న ధర్మం వల్ల 14 సంవత్సరాలుగా అరణ్యాలలో తిరుగుతున్నావు. ధర్మాన్ని విడిచిపెట్టిన రావణుడు అంతఃపురంలో కులుకుతున్నాడు, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నాడు. అధర్మంతో ఉన్నవాడు అంత సంతోషంగా ఉన్నాడు, ధర్మంతో ఉన్న నువ్వు ఇంత కష్టంలో ఉన్నావు. ఇంకా ధర్మము ధర్మము అని ఎందుకంటావు అన్నయ్యా, ఆ ధర్మాన్ని విడిచిపెట్టు. మనం కూడా అధర్మాన్నే స్వీకరిద్దాము \” అన్నాడు.

వెంటనే విభీషణుడు పరుగు పరుగున వచ్చి \” ఎంతమాటన్నావు లక్ష్మణా, సీతమ్మని ఇంద్రజిత్ సంహరిస్తే రావణుడు ఊరుకుంటాడనుకున్నావ? ఎంతోమంది చెప్పినా సీతమ్మని విడిచిపెట్టనివాడు ఇంద్రజిత్ సీతమ్మని చంపితే ఊరుకుంటాడ. ఆ ఇంద్రజిత్ మహా మాయావి, మీరు అంతలోనే వాడి మాయ మరిచిపోయారు. వాడు మాయా సీతని సంహరించి తీసుకుపోయాడు. వాడు ఇప్పుడు ఏం చేస్తుంటాడో తెలుసా. పెద్ద ఊడలు దిగిపోయిన మర్రి చెట్టు ఒకటి ఉంది, దాని చుట్టూ చాలా చీకటిగా ఉంటుంది. వాడు అక్కడికి వెళ్ళి నికుంభిలా హోమం చేస్తాడు. అక్కడ వాడు నికుంభిలా దేవతని ఉద్దేశించి హోమాన్ని పూర్తి చేసి, వాడి గుర్రాల మీద, ఆయుధముల మీద ఆ అక్షతలని చల్లుకొని యుద్ధ రంగంలోకి వస్తే దేవేంద్రుడు కూడా వాడితో యుద్ధం చెయ్యలేడు. సీతమ్మ చనిపోయింది అనుకుని మీరు ఇక్కడ ఏడుస్తున్నారు, కాని వాడు అక్కడ హోమం చేస్తుంటాడు. రామ! నన్ను అనుగ్రహించు, నాతో లక్ష్మణుడిని తీసుకెళ్ళి ఆ హోమం పూర్తవకుండానే వాడిని సంహరిస్తాను \” అన్నాడు.

అప్పుడు రాముడు లక్ష్మణుడిని ఆశీర్వదించి, హనుమ మొదలైన వీరుల్ని సాయంగా పంపారు.

విభీషణుడు లక్ష్మణుడిని ఇంద్రజిత్ హోమం చేసుకునే చోటుకి తీసుకెళ్ళాడు. వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఇంద్రజిత్ ఆ హోమం చెయ్యడం కోసం సిధ్దపడుతున్నాడు. తన హోమాన్ని ఎవరూ పాడుచెయ్యకుండా చుట్టూ సైన్యాన్ని కాపు పెట్టాడు.

అప్పుడు విభీషణుడు \” లక్ష్మణా! నువ్వు ఒకపక్క నుంచి సైన్యాన్ని బాణాలతో కొట్టి కాకావికలం చెయ్యి, అప్పుడు ఇంద్రజిత్ కనపడతాడు. అదే సమయంలో హనుమ వెళ్ళి రాక్షస సైన్యాన్ని తుదముట్టించెయ్యాలి. అంతమంది అక్కడ పడిపోతుంటే వాడు అక్కడ కూర్చుని హోమం చెయ్యలేడు. కాబట్టి రథం ఎక్కి వస్తాడు, అప్పుడు నువ్వు వాడిని కొట్టాలి \” అన్నాడు.

వెంటనే లక్ష్మణుడు బాణ ప్రయోగం చేశాడు. అప్పుడా సైన్యం పక్కకి తప్పుకుంది, వాళ్ళు పక్కకి తప్పుకోగానే ఆ మర్రి చెట్టు కనపడింది. వెంటనే హనుమంతుడు అరవీరభయంకరుడై ఆ రాక్షసులని మర్దించేశాడు. హనుమ ప్రతాపం ముందు ఆ రాక్షస సైన్యం నిలబడలేక పెద్ద హాహాకారాలు చేశారు. ఆ హాహాకారాలు విన్న ఇంద్రజిత్ హోమాన్ని ఆపి \’ ముందు హనుమంతుడిని సంహరించి, అప్పుడు హోమం చేస్తాను \’ అని అనుకొని రథం ఎక్కాడు. అప్పుడాయన ఒక బ్రహ్మాండమైన అస్త్రాన్ని హనుమంతుడి మీద ప్రయోగిద్దామని ఆ అస్త్రాన్ని అభిమంత్రిస్తుండగా లక్ష్మణుడు ధనుష్టంకారం చేశాడు. ఆ టంకారానికి ఇంద్రజిత్ లక్ష్మణుడి వైపు చూశాడు.

అప్పుడు లక్ష్మణుడు \” దుర్మార్గుడా, హనుమతో యుద్ధం ఎందుకు, నీతో యుద్ధం చెయ్యడానికి నేను వచ్చాను. పౌరుషం ఉంటె నాతో యుద్ధం చెయ్యి \” అన్నాడు.

అప్పుడు ఇంద్రజిత్ \” ఇంతకముందు నిన్ను రెండు మూడుసార్లు కొట్టాను, అయినా బుద్ధి లేకుండా మళ్ళి వచ్చావు. చూడు నీకు ఎటువంటి యుద్ధం చూపిస్తానో ఇవ్వాళ \” అని ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు.

లక్ష్మణుడి పక్కన ఉన్న విభీషణుడిని ఇంద్రజిత్ చూసి అన్నాడు \” నువ్వు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగావు, నువ్వు స్వయానా నా తండ్రికి తమ్ముడివి, నాకు పినతండ్రివి. నీ కొడుకు వరసైన నన్ను చంపడానికి ఇవ్వాళ శత్రువులతో చేతులు కలిపావే నీకు ఇలా చెయ్యడానికి సిగ్గుగా లేదా. శత్రువులతో చేతులు కలిపి తనవారిని చంపినవాడు చివరికి ఆ శత్రువుల చేతులలోనే చనిపోతాడు \” అన్నాడు.

విభీషణుడు అన్నాడు \” నీ తండ్రియందు, నీయందు పాపం ఉంది కనుక నేను మిమ్మల్ని విడిచి ధర్మాత్ముడైన రాముడి పక్కకి వచ్చాను \” అన్నాడు.

అప్పుడు ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి ఘోరమైన యుధం జెరిగింది. ఇద్దరూ ఒకరిని ఒకరు బాణాలతో కొట్టుకున్నారు. లక్ష్మణుడు వేసిన బాణాలకి ఇంద్రజిత్ యొక్క ధనుస్సు ముక్కలయిపోయింది. తరువాత ఇంద్రజిత్ బాణాలతో లక్ష్మణుడి కవచాన్ని పగలగొట్టాడు. ఇద్దరూ సింహాలలా యుద్ధం చేశారు. విభీషణుడు ఆ రాక్షసుల మీద బాణాలని వేసి వాళ్ళని సంహరించాడు.

ఇంద్రజిత్ కి లక్ష్మణుడికి 3 రోజుల పాటు భయంకరమైన యుద్ధం జెరిగింది. ఆఖరికి ఇంద్రజిత్ యొక్క సారధిని లక్ష్మణుడు కొట్టాడు. అప్పుడా ఇంద్రజిత్ ఒక చేతితో సారధ్యం చేస్తూ లక్ష్మణుడితో యుద్ధం చేశాడు. అప్పుడు నలుగురు వానర వీరులు ఆ రథం యొక్క గుర్రాలని కిందకి లాగేసి ఆ రథాన్ని నాశనం చేశారు.

లక్ష్మణుడు ఎన్ని అస్త్రాలని వేసినా ఇంద్రజిత్ సంహరింపబడకపోయేసరికి విభీషణుడు అన్నాడు \” ఆ ఇంద్రజిత్ పౌరుషం పెరిగిపోతుంది. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రజిత్ ని సంహరించు \” అన్నాడు.

ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాశరథిర్యది
పౌరుషే చా అప్రతిద్వంద్వః తదైనం జహి రావణిమ్

అప్పుడు లక్ష్మణుడు రెండు కోరలు కలిగిన సర్పంలాంటి ఒక బాణాన్ని తీసి, వింటినారికి తొడిగి \” మా అన్న రాముడు ధర్మాత్ముడైతే, సత్యసంధుడైతే, దశరథుడి కొడుకే అయితే, పౌరుషం ఉన్నవాడే అయితే నా ఎదురుగా నిలబడిన ప్రతిద్వంది అయిన ఇంద్రజిత్ నిగ్రహింపబడుగాక \” అని బాణ ప్రయోగం చేశాడు. ఆ బాణం వెళ్ళి ఇంద్రజిత్ కంఠానికి తగలగానే ఆయన శిరస్సు శరీరం నుండి విడిపోయి కింద పడిపోయింది. ఇంద్రజిత్ మరణించాడు.

 

Thank you for watching 39వ దినము యుద్ధకాండ.

Please watch to 40వ దినము యుద్ధకాండ.

And follow us on YouTube channel

Leave a Reply

error: Content is protected !!