6th Day Bala Kanda (6 వ దినము బాల కాండ.) :
6th Day Bala Kanda :
శతానందుడు రాముడితో ఇలా చెప్పసాగాడు ” గాధి కుమారుడైన విశ్వామిత్రుడు చాలాకాలం రాజ్యపాలన చేశాడు. ఒకనాడు ఆయన ఒక అక్షౌహిణీ సైన్యంతో భూమి అంతా తిరుగుతూ తన రాజ్యంలోనే ఉన్న వశిష్ఠుడి ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో జంతువులు పరస్పర వైరం మరిచి జీవిస్తుంటాయి. పులి-జింక, ఎలుక-పాము, కుక్క-పిల్లి ఒకదానిని ఒకటి తరమదు, చంపదు. ఆ ఆశ్రమంలో కొన్ని వేల మంది శిష్యులున్నారు. ఎన్నో పర్ణశాలలతో, చెట్లతో, జంతువులతో ఆ ఆశ్రమం శోభాయమానంగా ఉండేది. ఆ ఆశ్రమంలో శబళ అనే కామధేనువు ఉండేది, అది అమృతంతో సమానమైన క్షీరాన్ని(పాలు) ఇస్తుండేది. ఆ పాలతోనే ఆ ఆశ్రమంలో యజ్ఞయాగాది క్రతువులు చేసేవారు. అంత పరమ పవిత్రమైన ఆశ్రమంలోకి విశ్వామిత్ర మహారాజు తన సైన్యాన్ని బయట విడిది చేయించి, ఆశ్రమంలోకి వెళ్ళారు.
అప్పుడు విశ్వామిత్ర మహారాజు వశిష్ఠుడితో……అయ్యా! మీ ఆశ్రమంలో ఉన్న చెట్లన్నీ ఫలవంతంగా ఉన్నాయా, మీ యజ్ఞయాగాది క్రతువులు బాగా జెరుగుతున్నాయా, మీ ఆశ్రమంలోని ఋషుల తపస్సులు ఎటువంటి విఘ్నం కలగకుండా సాగుతున్నాయా, మీరంతా సంతోషంగా ఉన్నారా అని పలు కుశల ప్రశ్నలు అడిగాడు.
సంతోషించిన వశిష్ఠుడు ఇలా అన్నాడు…….నాయనా! నేను కుశలంగా ఉన్నాను, నువ్వు రాజధర్మంతో రాజ్యం చేస్తున్నావా ( రాజధర్మం అంటె, ఎంత పన్ను ప్రజల దెగ్గర నుండి పుచ్చుకోవాలో రాజు అంత మాత్రమే పుచ్చుకోవాలి. ఆ పుచ్చుకున్న ద్రవ్యంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం చెయ్యకుండా, ఆ ధనాన్ని వృద్ధి చెయ్యాలి. అప్పుడు దాన్ని అవసరంలో ఉన్న వాళ్ళకి ఇచ్చి దేశ క్షేమాన్ని కోరుకోవాలి), సామంతులందరూ నీకు లొంగి ఉన్నారా, శత్రువులను జయించావా, నీ మంత్రులు నీకు సహాయపడుతున్నార అని పలు విషయాలని ప్రస్తావించిన తరువాత కొంతసేపటికి విశ్వామిత్రుడు ఇక నేను వెళతాను అన్నాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు………
సత్క్రియాం తు భవాన్ ఏతాం ప్రతీచ్ఛతు మయా కృతాం |
రాజన్ త్వం అతిథి శ్రేష్ఠః పూజనీయః ప్రయత్నతః ||
ఈ భూమిని పరిపాలించే నువ్వు నాకు అతిథులలో శ్రేష్టుడివి, కనుక నా ఆతిధ్యం తీసుకోవాలన్నాడు.
మీరు నాకు చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి, తాగడానికి నీళ్ళు ఇచ్చారు, మీరు తినే తేనె, కందమూలాలు నాకు పెట్టారు, అలాగే నాకు మీ దర్శనం కూడా అయ్యింది. ఇంతకంటే నాకు ఏమి కావాలి, ఇక మీరు శ్రమతీసుకోవద్దు అని విశ్వామిత్రుడు అన్నాడు. అలా కాదు మీరు నా ఆతిధ్యం స్వీకరించాల్సిందే అని వశిష్ఠ మహర్షి అన్నారు. సరే, మీ ఇష్టం అని విశ్వామిత్రుడన్నాడు.
అప్పుడు వశిష్ఠ మహర్షి శబళని పిలిచి, చూశావా మన ఆశ్రమంలోకి ఈ రోజు విశ్వామిత్ర మహారాజుగారు వచ్చారు, నువ్వు ఆయనకి, ఆయన అక్షౌహిణీ సైన్యానికి ఉత్తమమైన భోజనం ఏర్పాటు చెయ్యాలి. ఎవరెవరికి ఏది కావాలో నువ్వు అది ఏర్పాటు చెయ్యి అన్నారు. ఆ శబళ ఎవరెవరు మనస్సులలో ఏమి కావాలని అనుకుంటున్నారో గ్రహించి, చెరుకు కర్రలు, తేనె, పానీయములు, కొండలంత ఎత్తున్న సన్నటి అన్నరాసులని, కొరుక్కు తినేవి, తాగేవి, నాకేవి, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పళ్ళరసాలు, పాలు, తాంబూలాలు మొదలైనవి సిద్ధం చేసింది.
శబళ సృష్టించిన భోజనాన్ని ఆ సైనికులందరూ భుజించారు, అందరూ ఈ భోజనం ఎంత బాగుందో అనుకున్నారు, మళ్ళి మన జీవితంలో ఇలాంటి రుచికరమైన భోజనం ఎప్పుడు చేస్తామో అని ఆవురావురుమని తిన్నారు. ఒక గోవు ఉత్తరక్షణంలో ఇంతమందికి సరిపడా భోజనాన్ని సృష్టించేసరికి విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు. ఆయనకి మెల్లగా ఆ శబళ మీద వ్యామోహం పెరిగింది, ఆ శబళని తన సొంతం చేసుకోవాలనిపించింది. అప్పుడాయన ఆ వశిష్ఠ మహర్షితో……..
గవాం శత సహస్రేణ దీయతాం శబలా మమ |
నేను మీకు ఒక లక్ష ఆవుల్ని ఇస్తాను, మీరు నాకు శబళని ఇవ్వండి అన్నాడు.
అయితే ఈ విశ్వామిత్రుడు నాకు లంచం ఇవ్వాలని చూస్తున్నాడు అని వశిష్ఠ మహర్షి గ్రహించారు. వశిష్ఠుడు నవ్వి, నేను నీకు శబళని ఇవ్వలేను అన్నారు.
విశ్వామిత్రుడికి మెల్లగా క్రోధం పెరిగి ఇలా అన్నారు, ………..రాజ్యంలో ఎక్కడన్నా రత్నాలు ఉంటె అవి రాజుకే చెందుతాయి. రాజు దెగ్గర విలువైనవి ఉండాలి. చాలా విలువైనది రత్నమైతే, ఇంత విలువైన శబళ కూడా రత్నమే. నా సొత్తు అయిన ఆ రత్నాన్ని నువ్వు ఉంచుకున్నావు, అందుకే ఇప్పుడు నేను ఆ రత్నాన్ని తీసుకెళుతున్నాను అని అన్నాడు.
నాయనా విశ్వామిత్రా! ఈ ఆవు ఒక రత్నము, దీనిని విలువగా దాచుకోవాలని అనుకుంటున్నావు. కాని ఈ ఆవు మా ఆశ్రమంలో దేవతారాధనకి, పితృదేవతారాధనకి పాలు ఇస్తుంది, నా ప్రాణయాత్ర దీనితో జెరుగుతుంది. ఈ ఆశ్రమంలోని యజ్ఞాలు, విద్యాభ్యాసం సమస్తము ఈ శబళ మీద ఆధారపడి ఉంది, కాబట్టి నేను ఈ ధేనువుని నీకు ఇవ్వలేను అని వశిష్ఠ మహర్షి అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు,……..నేను నీకు మెడలో బంగారు తాడులున్న పద్నాలుగు వేల ఏనుగులని ఇస్తాను, ఎనిమిది వందల బంగారు రథాలని ఇస్తాను, ఆ ఒక్కో రథానికి స్వర్ణాభరణములతో అలంకరింపబడ్డ నాలుగు గుర్రాలు ఉంటాయి, అలాగే గొప్ప గొప్ప జాతులకి చెందిన పదకొండు వేల గుర్రాలు ఇస్తాను, ఒక కోటి గోవుల్ని ఇస్తాను, బంగారము, వెండి ఎంత కావాలో నువ్వే అడుగు, నేను ఇచ్చేస్తాను అన్నాడు. ఇవన్నీ విన్న వశిష్ఠ మహర్షి, నేను ఇంక ఏమి మాట్లాడను అన్నారు.
ఆగ్రహించిన విశ్వామిత్రుడు, ఈయన ఇవ్వడమేంటి నేను పుచ్చుకోవడమేంటి, అడిగినకొద్ది బెట్టు చేస్తున్నాడు, ఈ రత్నం నాకు చెందినది అని ఆ శబళ మెడలో తాడు కట్టి, సైనికులకిచ్చి తీసుకెళ్ళమన్నాడు. వాళ్ళు దాన్ని ఈడ్చుకెళుతుంటె ఆ శబళ ఏడ్చింది. ఇంత జెరుగుతున్నా వశిష్ఠుడు మాత్రం అలానే నిశబ్దంగా ఉన్నారు. అప్పుడా శబళ……..ఇంతకీ నన్ను వశిష్ఠుడు వదిలేశాడ, లేకపోతే విశ్వామిత్రుడు తీసుకెళుతున్నాడ, వశిష్ఠుడు నన్ను ఇవ్వను అంటె విశ్వామిత్రుడు నన్ను తీసుకెళ్ళగలడా, వశిష్ఠుడు నన్ను వదిలేశాడంటే నేను ఏదో పాపం కాని, పొరపాటు కాని చేసి ఉండాలి, ఒకవేళ నేను ఏదన్నా పాపం చేసి ఉంటే వశిష్ఠుడికి క్షమార్పణ చెప్తాను, ఆయన బ్రహ్మర్షి కనుక నన్ను తప్పకుండా క్షమిస్తారు అని తాడు విడిపించుకొని వశిష్ఠుడి దెగ్గరికి పరుగుతీసి వెళ్ళింది.
అప్పుడు వశిష్ఠుడు…….
శబళా! నేను నిన్ని విడిచిపెట్టలేదు. విశ్వామిత్రుడే నిన్ను బలాత్కారంగా తీసుకెళుతున్నాడు. ఆయన ఈ భూమికి ప్రభువు, కాని నేడు తప్పు ద్రోవలొ వెళుతున్నాడు, అతను దోషం చేస్తే, ఆ దోషం అతనిని కాలుస్తుంది. నిన్ను ఈడ్చుకెళ్ళి దోషం చేశాడు, ఇక ఆయన అపరాధమే ఆయనని కాలుస్తుందని చెప్పాడు.
అయితే నన్ను నేను రక్షించుకోనా అని శబళ అడుగగా, తప్పకుండా రక్షించుకో అని వశిష్ఠుడు చెప్పాడు.
అప్పుడా శబళ గట్టిగా అంబా అని అరిచి శూలాయుధధరులైన పహ్లవులు కొంతమందిని సృష్టించింది. వాళ్ళు విశ్వామిత్రుడి సైన్యాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు. ఇది గమనించిన విశ్వామిత్రుడు కత్తి పట్టుకొని యుద్ధరంగంలోకి వెళ్ళి చాలామంది పహ్లవులని సంహరించాడు. ఆ శబళ పహ్లవులతో పాటు యవనులని సృష్టించింది, వాళ్ళందరూ కలిసి విశ్వామిత్రుడి సైన్యాన్ని తుడిచెయ్యడం ప్రారంభించారు. అప్పుడా శబళ వశిష్ఠుడితో……..చూశార! ఆయన నాకు ఎదురుతిరిగాడు, ఇప్పుడు ఓటమి అంచులలో ఉన్నాడు అని అన్నది. అయితే నువ్వు ఇక యదేచ్ఛగా సైన్యాన్ని సృష్టించు అని వశిష్ఠుడు అన్నాడు.
అప్పుడా శబళ సూర్యుడి ప్రకాశంతో సమానమైన కాంభోజ వంశీయులని, తన పొదుగు నుండి కొన్ని వేల పహ్లవులని, యోని నుండి యవనులని, గోమయం పడే స్థానం నుంచి శకులు, రోమకుపాల నుండి హారీతులు మరియు కిరాతకులని సృష్టించింది. వీరందరూ కలిసి ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. రథం నుండి కిందకి దిగి తన సైన్యాన్ని చూసిన విశ్వామిత్రుడు నిస్తేజుడయ్యాడు. ఇది కదా శబళ గొప్పతనం అనుకొని తన 100 కుమారుల వైపు చూశాడు. తమ తండ్రిని బాధపెట్టిన వశిష్ఠుడిని చంపెయ్యాలని అందరూ కత్తులు పట్టుకొని ఆయన మీదకి పరుగుతీసారు.
కూర్చుని ఉన్న వశిష్ఠుడు తన మీదకి వస్తున్న ఆ నూరుగురు పిల్లల్ని చూసి గట్టిగా “ఆ……” అని హుంకారం చేశారు, ఆ నూరుగురు పిల్లలు భస్మరాసులై కిందపడిపోయారు. ఇది చూసిన విశ్వామిత్రుడు ఆశ్చర్యపోయాడు.
ఇది కదా బ్రహ్మర్షి యొక్క గొప్పతనం అంటె, ఆయన “ఆ….” అంటె వందమంది బూడిదైపోయారు, ఆ ఆవు తలుచుకుంటె గొప్ప సైన్యాన్ని, అమోఘమైన భోజనాన్ని సృష్టించింది. రాచరికం కన్నా తపఃశక్తి చాలా గొప్పది, ఈ వశిష్ఠుడిని నాశనం చెయ్యాలంటే నాకున్న శక్తి సరిపోదు. కావున నాకు ధనుర్వేదంలోని సమస్త అస్త్ర-శస్త్రాలు తెలియాలి అనుకొని ఒక కుమారుడిని సింహాసనం మీద కూర్చోబెట్టి, రాజ్యపాలన చెయ్యమని చెప్పి తాను తపస్సు చేసుకోడానికి హిమాలయ పర్వతాలకి వెళ్ళాడు.
హిమాలయ పర్వతాలమీద మహాదేవుడైన శివుని గూర్చి ఘోరమైన తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై,……నాయనా విశ్వామిత్రా! నీ మనసులో ఏ కోరికుందో చెప్పు, ఆ కోరికని నేను తీరుస్తాను అన్నాడు.
అప్పుడు విశ్వామిత్రుడు…….
యది తుష్టో మహాదేవ ధనుర్ వేదో మమ అనఘ |
సా అంగ ఉప అంగ ఉపనిషదః స రహస్యః ప్రదీయతాం ||
మహాదేవ! నువ్వు నిజంగా నా తపస్సుకు ప్రీతి చెందినవాడివైతే, నేను ఎవరి దెగ్గరికి వెళ్ళి ధనుర్వేదాన్ని ఉపదేశం పొందకుండా నాకు ఆ ధనుర్వేదంలోని అస్త్రాలన్నీ రహస్యాలతో సహా తెలిసిపోయేటట్టు అనుగ్రహించమన్నాడు. శివుడు తధాస్తు అన్నాడు. పౌర్ణమి నాడు సముద్రుడు ఎలా పొంగుతాడో, అలా విశ్వామిత్రుడు పొంగిన ఆత్మవిశ్వాసంతో రథమెక్కి వశిష్ఠుడి ఆశ్రమాన్ని చేరుకున్నాడు. ఆయన వచ్చేసరికి ఆ ఆశ్రమం జింకలతో, పక్షులతో, ఆవులతో, గురువుల దెగ్గర వేదం నేర్చుకుంటున్న శిష్యులతో ఎంతో పవిత్రంగా ఉంది. ఇది చూసిన విశ్వామిత్రుడికి ఆగ్రహం ఎక్కువయ్యింది. కనీసం ఒకమాట కూడా చెప్పకుండా ఆ అస్త్రాలని ఆశ్రమం మీద ప్రయోగించాడు. ఒక్కసారిగా భూకంపం వస్తే ఎలా ఉంటుందో, అలా అస్త్రాలన్నిటిని ఒకదాని వెంట ఒకదాన్ని పంపాడు. కన్నుమూసి తెరిచేలోగా ఆ ఆశ్రమం అంతా బూడిదయ్యింది. ఆ ఆశ్రమంలోని గురువులు, శిష్యులు, జింకలు, ఆవులు అన్ని తలకోదారి పట్టి అరణ్యంలోకి పరుగు తీశాయి. అప్పుడు వశిష్ఠుడు పారిపోతున్న వారిని ఆగండి, పారిపోకండి, నేను మిమ్మల్ని కాపాడతాను అని అన్నారు. ఆకాశం నుండి పడుతున్న అస్త్రాలని చూసి భయపడి అందరూ పారిపోయారు. ఆశ్రమంలో వశిష్ఠుడు ఒక్కడే మిగిలాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ ఆగ్నేయాస్త్రం నిప్పులు కక్కుతూ ఆయన మీదకి వచేస్తోంది.
ఇన్ని సంవత్సరాలుగా ఈ ఆశ్రమాన్ని పోషించాను, ఇవ్వాళ నీ ఆవేశానికి ఈ ఆశ్రమాన్ని బూడిద చేశావు అని వశిష్ఠుడు తన బ్రహ్మదండం పట్టుకొని కింద కూర్చున్నారు. ఆయన ఆ బ్రహ్మదండాన్ని అలా పట్టుకుని ఉంటె అది ఎలా ఉందంటే, సమస్తలోకాలని శాసించగలిగే యమదండాన్ని పట్టుకున్న యముడిలా పట్టుకున్నారు. మండుతున్న నిప్పు మీద నీళ్ళు పడితే ఎలా చల్లారిపోతుందో, అలా ఆ ఆగ్నేయాస్త్రం చల్లారిపోయి ఆ బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది.
తను అంత తపస్సు చేసి ప్రయోగించిన అస్త్రాన్ని వశిష్ఠుడు కనీసం వేరొక అస్త్రాన్ని ప్రయోగించి ఆపలేదు, కేవలం తన బ్రహ్మదండాన్ని అడ్డుపెట్టి ఆపేసరికి విశ్వామిత్రుడికి కోపం బాగా పెరిగిపోయింది. అప్పుడాయన ఒకేసారి వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, పాశుపతాస్త్రం,
కాని ఆయన వేసినవన్ని వశిష్ఠుడి బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయాయి.
ఇక తనదెగ్గర ఉన్న ఒకేఒక అస్త్రమైన బ్రహ్మాస్త్రాన్ని వెయ్యడానికని ఆ మంత్రాలని స్మరిస్తుండగా సముద్రాలు పొంగాయి, పర్వతాలు బద్దలయ్యాయి, ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణులు ఒక్కసారి మనస్సులో క్షోభ పొందాయి. అంతటి శక్తివంతమైన ఆ బ్రహ్మాస్త్రాన్ని విశ్వామిత్రుడు అభిమంత్రించి వదిలాడు. ఇప్పటిదాకా ఎంతోమంది గొప్పవాళ్ళని మట్టుపెట్టిన ఆ బ్రహ్మాస్త్రం నిశబ్ధంగా ఆయన బ్రహ్మదండంలోకి వెళ్ళిపోయింది. అప్పుడు విశ్వామిత్రుడు………
ఛి! ఆ బ్రహ్మర్షి బలం ముందు ఈ క్షత్రియ బలం ఎందుకు పనికొస్తుంది. ఎన్నో అస్త్రాలని నేర్చుకున్నాను, అన్నీ ప్రయోగించాను. కాని ఆయన ఒక కర్రముక్క పట్టుకొని నా అస్త్రాలన్నిటిని మింగేసారు, అని ఆ రథం దిగి వెళ్ళిపోయాడు. వశిష్ఠుడు బ్రహ్మర్షి కనుక నేను ఆయనని ఓడించలేకపోయాను, కాబట్టి నేనూ బ్రహ్మర్షిని అవుతానని ఆ విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకి వెళ్ళాడు. అక్కడికి ఆయన తన పెద్ద భార్యతో వెళ్ళి 1000 సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేశాడు. ఈ కాలంలోనే ఆయనకి హవిష్పందుడు,
మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు అని నలుగురు కుమారులు పుట్టారు. ఆయన తపస్సుకి సంతోషించిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అన్నారు ” నువ్వు చేసిన ఈ తపస్సు చేత రాజర్షి లోకాలని గెలిచావు, ఇవ్వాళ నుంచి నిన్ను విశ్వామిత్ర మహారాజు అని కాకుండా రాజర్షి విశ్వామిత్రుడు అని పిలుస్తారు ” అని చెప్పారు. ఇన్ని సంవత్సరాలు తపస్సు చేస్తే రాజర్షిని అయ్యాను, ఇంక బ్రహ్మర్షిని ఎప్పుడవుతానో అని విశ్వామిత్రుడు దిగులుపడ్డాడు.
అదే కాలంలొ ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు పరిపాలన చేసేవాడు. ఆయనకి శరీరం మీద ఉన్న వ్యామోహం వలన స్వర్గానికి శరీరంతో వెళ్ళాలన్న కోరిక పుట్టింది. వెంటనే కులగురువైన వశిష్ఠుడికి తన కోరిక చెప్పాడు. నువ్వు ఎంత గొప్ప రాజువైనా కాని, ఎంత గొప్ప యాగాలన్నా చెయ్యి, కాని శరీరంతో స్వర్గానికి వెళ్ళడమనేది ధర్మశాస్త్రంలో లేదు. ఎవరి శరీరమైన కొంత కాలానికి పడిపోవాల్సిందే, అది పడిపోయిన తరవాతే స్వర్గలోక ప్రవేశం. కావున శరీరంతో స్వర్గానికి వెళ్ళడం అనేది జెరగదు అన్నాడు వశిష్ఠుడు. అప్పుడా త్రిశంకుడు వశిష్ఠుడి నూరుగురు కుమారుల దెగ్గరికి వెళ్ళి జెరిగినది చెప్పాడు. మా తండ్రిగారు కుదరదన్నారు, ఆయనకి అన్నీ తెలుసు, అయినా స్వర్గానికి శరీరంతో ఎవరూ వెళ్ళలేరు, అది జెరిగేపనికాదన్నారు ఆ నూరుగురు కుమారులు.
అయితే నేను వేరొక గురువుని వెతుక్కుంటాను అన్నాడు ఆ త్రిశంకుడు. నువ్వు నీ గురువు మాట వినలేదు, ఆయన పుత్రులమైన మా మాట వినలేదు, ఇప్పుడు వేరొక గురువుని వెతుకుతాను అంటున్నావు, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టింది కనుక నువ్వు చణ్డాలుడివి అవుతావని శపించారు.
మరుసటి రోజు ఆ త్రిశంకుడు నిద్రలేవగానే ఆయన ముఖంలోని కాంతి పోయి నల్లగా అయ్యాడు, ఆయన వేసుకొన్న బంగారు ఆభరణాలన్ని ఇనుమ ఆభరణాలయ్యాయి, జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆయనని చూసిన ఆ మందిరంలోని వాళ్ళు, ఇతర మంత్రులు అందరూ పారిపోయారు. ఆ రూపంతో అలా తిరుగుతూ చివరికి విశ్వామిత్రుడిని ఆశ్రయించాడు.
వశిష్ఠుడిని ఎలాగు అస్త్రాలతో ఓడించలేకపోయాను, వశిష్ఠుడు చెయ్యలేనన్నది విశ్వామిత్రుడు చేశాడు అని లోకం అనుకోవాలని, కనుక ఆ త్రిశంకుడి కోరిక తీరుస్తానన్నాడు విశ్వామిత్రుడు. అప్పుడాయన తన శిష్యుల్ని, కొడుకుల్ని పిలిచి…….మీరు ఈ బ్రహ్మాండం అంతా తిరిగండి, వశిష్ఠుడు చెయ్యలేని యాగం విశ్వామిత్రుడు చేస్తున్నాడు, త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపిస్తున్నాడు అని చెప్పి బ్రాహ్మణుల్ని, ఋషుల్ని తీసుకురండి. ఎవరన్నా ఆ యాగం చెయ్యలేరు, మేము రాము అంటె, వాళ్ళ వివరాలు తీసుకోండని చెప్పాడు. విశ్వామిత్రుడికి భయపడి అందరూ వచ్చారు. తరువాత ఆయన కొడుకులు వచ్చి వశిష్ఠ మహర్షి కొడుకులు ఈ యాగానికి రామన్నారు, అలాగే మహోదయుడనే బ్రాహ్మణుడు కూడా రానన్నాడు, కాని ఆయన ఒక మాటన్నాడు, అదేంటంటే, యాగం చేస్తున్నవాడు ఒక క్షత్రియుడు, యాగం చేయిస్తున్నవాడు ఒక చణ్డాలుడు, ఇలాంటప్పుడు దేవతలు హవిస్సులని ఎలా తీసుకుంటారు, అసలు సశరీరంగా స్వర్గానికి పంపవచ్చని వేదంలో ఎక్కడా లేదు, అందుకని రానన్నాడు అని చెప్పారు.
విశ్వామిత్రుడికి ఎక్కడలేని కోపం వచ్చి, వశిష్ఠ మహర్షి కొడుకులని, మహోదయుడిని, మీరు భస్మరాశులై పడిపోయి నరకానికి వెళతారు, ఆ తరవాత 700 జన్మలపాటు శవ మాంసం తిని బతుకుతారు, ఆ తరవాత ముష్టికులన్న పేరుతో పుట్టి, కొన్ని జన్మల పాటు కుక్క మాంసం తిని బతుకుతారు. ఆ మహోదయుడు సర్వలోకాలలోని జనాలచేత ద్వేషింపపడి నిషాదుడై బతుకుతాడని శపించాడు.
అందరూ కలిసి యాగం మొదలుపెట్టారు, యాగాగ్నిలో హవిస్సులు తీసుకోవడానికి ఏ దేవతా రాలేదు. ఎవరూ రాకపోయేసరికి విశ్వామిత్రుడికి ఆగ్రహం వచ్చి తన తపఃశక్తితొ త్రిశంకుడికి పైకి పంపాడు. త్రిశంకుడు ఆకాశమార్గంలో ప్రయాణిస్తూ స్వర్గలోకం వైపు దూసుకుపోతున్నాడు. ఈ విషయం దేవేంద్రుడికి తెలిసి ఆయన…….
త్రిశంకా, నువ్వు గురు శాపానికి గురయ్యావు, నీకు స్వర్గలోక ప్రవేశం లేదు అని, తలక్రిందులుగా కిందకిపో అన్నాడు. ఆ త్రిశంకుడు అలా తలక్రిందులుగా భూమి మీదకి తోసేయబడ్డాడు. కిందకి పడిపోతు ఆయన విశ్వామిత్రుడిని ప్రార్ధించగా, విశ్వామిత్రుడు మిగిలిన తపఃశక్తితో దక్షిణ దిక్కున నక్షత్ర మండలాన్ని సృష్టించాడు, సప్తర్షులని సృష్టించాడు. కాని దేవతలు అప్పటికి కూడా రాకపోయేసరికి, దేవతలని కూడా సృష్టిద్దామని అనుకుంటుండగా దేవతలందరూ వచ్చారు.
మహానుభావ! శాంతించు. ఎంత తపఃశక్తి ఉంటె మాత్రం ఇలా వేరె స్వర్గాన్ని సృష్టిస్తావ, మీకు శాస్త్రం తెలుసు, సశరీరంగా ఎవరిని స్వర్గానికి పంపలేము. మీలాంటివారు చెయ్యవలసిన పని కాదు అన్నారు. మీరు మీ తపఃశక్తిని ధారపోసి సృష్టించిన ఆ నక్షత్ర మండలం జ్యోతిష్య చక్రానికి అవతల ఉంటుంది, అందులో ఈ త్రిశంకుడు తిరగబడి ఉంటాడు అని వరం ఇచ్చారు దేవతలు. శాంతించిన విశ్వామిత్రుడు సరే అన్నాడు. తనకి ఇక్కడ మనస్సాంతి లేదని, ప్రశాంతంగా తపస్సు చేసుకోవడానికి ఆయన పశ్చిమ దిక్కుకి వెళ్ళారు.
పశ్చిమ దిక్కున విశ్వామిత్రుడు మహొగ్రమైన తపస్సు చెయ్యడం మొదలుపెట్టాడు. అదే కాలంలో అయోధ్య నగరాన్ని అంబరీషుడనే రాజు పరిపాలన చేస్తుండేవాడు. ఆయన అశ్వమేథ యాగం చేసి వదిలిపెట్టిన గుర్రాన్ని ఇంద్రుడు తీసుకెళ్ళిపోయాడు. అశ్వం దొరకకపోతే తనకి మంచి జెరగదు అని మహర్షులు చెప్పారు. కాని అశ్వానికి బదులుగా ఒక మనుష్యుడిని తీసుకువస్తే యాగాన్ని పూర్తిచెయ్యచ్చు అన్నారు. అది కూడా న్యాయంగా తీసుకురావాలన్నారు.
ఒక మనిషిని తీసుకురావడం కోసం అంబరీషుడు బయలుదేరగా ఒక చోట, భృగుతుంగమనే ఒక పర్వత శిఖరం మీద, ఋచీకుడనే ఒక ఋషి భార్య పిల్లలతో కూర్చుని ఉన్నాడు. అప్పుడు ఆ అంబరీషుడు వాళ్ళ దెగ్గరికి వెళ్ళి తన యాగాశ్వం అపహరణకి గురైనందుకుగాను నాకు ఒక యాగపశువు కావాలి, మీకు ఉన్న పిల్లలలో ఒకడిని ఇచ్చి నన్ను అనుగ్రహించండి అన్నాడు. అప్పుడా ఋచీకుడు ఇలా అన్నాడు ” పెద్దకొడుకు ధర్మసంతానం( పూర్వ జన్మలలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని పెద్ద కొడుకుగా ఇస్తారు) కావున నేను వాడిని ఇవ్వలేను, శాస్త్రం ప్రకారం చిట్టచివరి వాడిని ఇస్తే ఐశ్వర్యం పోతుందన్నారు. అప్పుడా మధ్య కొడుకైన శునఃశేపుడు అంబరీషుడితో వస్తానన్నాడు.
రాజు బతికుంటే రాజ్యం బాగుంటుంది, రాజు బతకాలంటే యాగం పూర్తవ్వాలి, యాగం పూర్తి చెయ్యడానికి తన కొడుకుని పంపాడు ఆ ఋచీకుడు. అంబరీషుడు ఆయనకి లక్ష గోవుల్ని దానంగా ఇచ్చాడు. శునఃశేపుడిని తీసుకెళుతున్న అంబరీషుడు కొంతదూరం ప్రయాణించాక విశ్రాంతి తీసుకుందామని ఒక చోట ఆగాడు. అప్పుడు అక్కడకి దెగ్గరలో ఉన్న విశ్వామిత్రుడి ఆశ్రమాన్ని శునఃశేపుడు చూశాడు. వెంటనే ఆశ్రమంలోకి వెళ్ళి విశ్వామిత్రుడి కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు ” నేను నీ అక్కయ్య కొడుకుని, మీరు నాకు మేనమామ అవుతారు. పెద్దవాడిని నాన్నగారు ఇవ్వనన్నారు, ఆఖరివాడిని మా అమ్మ ఇవ్వననింది, మధ్యలో పుట్టినందుకు నన్ను యజ్ఞపశువుగా ఇచ్చేసారు. నాకు దీర్ఘకాలం బ్రతికి తపస్సు చేసి స్వర్గలోకం పొందాలని ఉంది. కాబట్టి మీరు నన్ను రక్షించాలి ” అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు సరే అని తన కొడుకులని పిలిచి, తండ్రి మాట విని పాటించేవాడు కదా కొడుకంటే, మీలో ఎవరన్నా ఈ శునఃశేపుడి స్థానంలో యాగపశువుగా వెళ్ళండి అన్నాడు.
నీ కొడుకుని నువ్వు యాగపశువుగా పంపిస్తావా, ఇంకొకడి కొడుకుని రక్షిస్తావ, మీరు చెప్పిన ధర్మం కుక్క మాంసం తిన్నట్టు ఉంది అని విశ్వామిత్రుడి కొడుకులన్నారు. ఆగ్రహించిన విశ్వామిత్రుడు……..
శ్వ మాంస భోజినః సర్వే వాసిష్ఠా ఇవ జాతిషు |
పూర్ణం వర్ష సహస్రం తు పృథివ్యాం అనువత్స్యథ ||
మీరు కూడా వశిష్ఠుడి కుమారుల జాతిలో పుట్టి వెయ్యి సంవత్సరాలు వాళ్ళలాగ కుక్క మాంసం తింటూ బతకండని శపించాడు.
అప్పుడాయన శునఃశేపుడితో………నువ్వు బెంగపెట్టుకోమాకు, నిన్ను తీసుకెళ్ళి యూప స్తంభానికి కడతారు. ఇప్పుడు నేను నీకు రెండు మంత్రాలని చెప్తాను, నిన్ను అలా యూప స్తంభానికి కట్టినప్పుడు నువ్వు ఆ రెండు మంత్రాలని జపించు, అలా జపించడం వల్ల ఇంద్రుడు సంతోషించి, నిన్ను బలి ఇవ్వకముందే వచ్చి, నేను ఈ యాగానికి ప్రీతి చెందాను అని యాగ ఫలితం ఇస్తాడని చెప్పి ఆ రెండు మంత్రాలని ఉపదేశం చేసి పంపించాడు.
తరవాత శునఃశేపుడిని యూప స్తంభానికి కట్టారు, అప్పుడాయన విశ్వామిత్రుడు చెప్పిన మంత్రాలని జపించగా ఇంద్రుడు ప్రత్యక్షమయ్యి, నేను ఈ యాగానికి సంతోషించాను, మీరు యాగపశువుని బలి ఇవ్వకుండానే మీకు కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తున్నాను అన్నాడు. అందరూ సంతోషించారు.
కోపంలో తన కొడుకులని శపించానని విశ్వామిత్రుడు బాధ పడ్డాడు. ఈ సారి ఎవరితో మాట్లాడకుండా తపస్సు చేస్తానని మళ్ళి 1000 సంవత్సరాలు తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అలా కొంతకాలం అయ్యాక విశ్వామిత్రుడు స్నానం చేద్దామని పుష్కర క్షేత్రానికి వెళ్ళగా మేనక కూడా అక్కడే స్నానం చేస్తూ కనిపించింది. మేఘాల మధ్య మెరుపు వస్తే ఎలా ఉంటుందో మేనక కూడా అలా ఉంది. ఆ మేనక సౌందర్యాన్ని చూసిన విశ్వామిత్రుడు ముగ్ధుడైనాడు.
మేనక! నేను నీయందు కందర్ప వశుడనయ్యాను( అంటె మన్మధ ఆవేశం కలిగింది), అందుకని నువ్వు నా ఆశ్రమానికి వచ్చి నా కోరిక తీర్చు అన్నాడు. మేనక సరే అనింది. అలా మేనకతో క్రీడిస్తూ క్రీడిస్తూ పదేళ్ళు గడిచిపోయాయి.
పది సంవత్సరాల తరువాత విశ్వామిత్రుడికి అసలు తను ఎందుకు రాజ్యాన్ని విడిచిపెట్టి వచ్చాడో గుర్తొచ్చింది. ఈ మేనకతో ఏదో, ఒక రోజు లేకపోతే రెండు రోజులు అనుకున్నాను, కాని ఇలా పది సంవత్సరాలు గడిచిపోతాయి అనుకోలేదు. నా మనస్సుని దేవతలు వక్రీకరించడానికి ఈ మేనకని పంపారు అనుకొని కోపంగా మేనక వైపు చూశాడు, కాని ఇంతలోనే శాంతించి, ఇందులో నీ తప్పేముంది అని మేనకని వెళ్ళిపోమన్నాడు. ఈ సారి ఇంకా జాగ్రత్తగా తపస్సు చెయ్యాలని ఉత్తర దిక్కుకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
ఉత్తర దిక్కున కౌశికి నది పక్కన కూర్చుని ఘోరాతిఘోరమైన తపస్సు 1000 సంవత్సరాలు చేశాడు. 1000 సంవత్సరాలు తపస్సు చేశాక దేవతలతో కలిసి బ్రహ్మగారు ప్రత్యక్షమై, నేను నీ తపస్సుకి చాలా ఆనందించాను, ఇక నుంచి అందరూ నిన్ను మహర్షి అని పిలుస్తారు అని అన్నారు. ఈ మాట విన్న విశ్వామిత్రుడికి బాధ కాని సంతోషం కాని కలగలేదు. ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే ఇప్పటికి మహర్షిని అయ్యాను, ఇక బ్రహ్మర్షిని ఎప్పుడు అవుతానో అనుకొని బ్రహ్మగారిని, నేను నా ఇంద్రియాలని గెలిచాన అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పటికైతే నువ్వు ఇంకా నీ ఇంద్రియాలని గెలవలేదు, ఇంద్రియాలని గెలవడం అంత తేలిక కాదు అన్నాడు.
మెల్లగా విశ్వామిత్రుడి పగ వశిష్ఠుడి మీద నుంచి తన ఇంద్రియాల మీదకి వెళ్ళింది. తను అనవసరంగా వశిష్ఠుడి మీద క్రోధాన్ని పెంచోకోవడానికి, మేనకతో కామానికి లొంగడానికి తన ఇంద్రియాలే కారణమని గ్రహించాడు.
మళ్ళి ఘోరమైన తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఈ సారి ఎండాకాలంలో తన చుట్టూ నాలుగు పక్కల అగ్నిని పెట్టుకొని, తల పైకెత్తి సూర్యుడి వంక చూస్తూ చేతులెత్తి తపస్సు చేశాడు. వానాకాలంలో నడుముదాకా నీళ్ళల్లో ఉండి తపస్సు చేశాడు. విశ్వామిత్రుడు చేస్తున్న ఈ తపస్సుని చూసిన దేవేంద్రుడు ఆయనని పరీక్షించాలని రంభని పంపాడు. రంభ భయపడి వెళ్ళనంటే నానారకాలుగా నచ్చ చెప్పి పంపించాడు. మరుసటి రోజు విశ్వామిత్రుడు స్నానం చేద్దామని వెళుతుంటే ఆయనకి అప్పుడే స్నానం చేసి బయటకొస్తున్న రంభ కనిపించింది, చెట్లన్నీ వసంత ఋతువులో ఎలా పూలతో ఉంటాయో అలా పూలతో కళకళలాడుతున్నాయి, కోకిల పాట కూడా వినిపించింది. విశ్వామిత్రుడికి అనుమానం వచ్చింది, ఇది వసంత ఋతువు కాకపోయినప్పటికీ చెట్లన్నీ పూలతో ఉన్నాయి, కోకిల పాట పాడుతోంది. అయితే ఇదంతా ఇంద్రుడు నా తపోభగ్నానికి చేస్తున్న ప్రయత్నం అని గ్రహించి కోపంతో ఇలా అన్నాడు…..
నన్ను ప్రలోభపెడదామని వచ్చిన ఓ రంభా! నువ్వు పదివేల సంవత్సరాలు రాయివై పడుండు అని శపించాడు.
తరవాత కొంతసేపటికి శాంతించి, అసలు రంభ చేసిన తప్పేముంది, నేను మళ్ళి క్రోధానికి లోనయ్యాను, ఇంద్రుడు పంపిస్తే ఆమె వచ్చింది అనుకొని రంభ అడగకుండానే ఒకనాడు ఒక బ్రాహ్మణుడు నీకు శాపవిమోచనం కలిగిస్తాడు అని అన్నాడు.
విశ్వామిత్రుడు తన ఆశ్రమానికి వెళ్ళి ఆలోచించాడు, నా శత్రువులు ఎక్కడో లేరు, నాలోనే ఉన్నారు. ఈ కోపము, కామము నాకు కలగడానికి నా మనస్సు కారణం, ఆ మనస్సు నా ఊపిరి మీద ఆధారపడిఉంది. అందుకని ఊపిరిని తీసి బయటకి వదలను, కుంభకం(యోగాలో ఒక ప్రక్రియ) చేస్తాను, అలాగే ఈ శరీరానికి అప్పుడప్పుడు కోరికలు కలగడానికి కారణం నా శరీరానికి కొంచెం ధృడత్వం ఉండడంవలన, కనుక కుంభకం చేస్తే నా శరీరం ఒక పుల్లలా అవుతుంది అని తూర్పు దిక్కుకి వెళ్ళి బ్రహ్మాండమైన తపస్సు మొదలుపెట్టాడు. అలా వెయ్యి సంవత్సరాలు కుంభకంలో ఉండి తపస్సు చేసేసరికి ఆయన శరీరం ఒక పుల్లంత సన్నగా అయ్యింది. తన శరీరాన్ని నిలబెట్టుకోడానికి కొంత కబళాన్ని తిందామని అనుకుంటుండగా ఇంద్రుడు ఒక బ్రాహ్మణ రూపంలొ వచ్చి, అయ్యా! నాకు బాగా ఆకలిగా ఉంది, మీదెగ్గరున్నది నాకు కొంచెం పెడతారా అన్నాడు. వచ్చిన వాడు ఇంద్రుడని విశ్వామిత్రుడికి అర్ధమయ్యింది, కాని ఈ సారి ఆయన ఇంద్రియాలకి లొంగలేదు, ఇంద్రుడు తింటే ఏంటి నేను తింటే ఏంటి అనుకొని ఇంద్రుడికి ఆ కబళాన్ని ఇచ్చి మళ్ళి కుంభకంలోకి వెళ్ళి తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.
అలా విశ్వామిత్రుడు తపస్సు చేస్తుండగా ఆయన బ్రహ్మస్థానం నుంచి ఆయన తపఃశక్తి పొగగా బయలుదేరింది. ఆయన తపోధూమం సమస్త లోకాలని కప్పేసింది, సముద్రాలు కదలడం ఆగిపోయాయి, సమస్త ప్రాణులు క్షోభించాయి. ఇక ఈ స్థితిలో విశ్వామిత్రుడిని ఎవరూ కదపలేరు, ఆయనకి శత్రువు లేడు మిత్రుడు లేడు, ఆయనకి అంతటా ఆ పరబ్రహ్మమే కనిపిస్తుంది. అప్పుడు దేవతలతో కలిసి బ్రహ్మగారు వచ్చి………
బ్రహ్మర్షే స్వాగతం తే అస్తు తపసా స్మ సు తోషితాః |
బ్రాహ్మణ్యం తపసా ఉగ్రేణ ప్రాప్తవాన్ అసి కౌశిక ||
ఓ కౌశికా! నీ తపస్సుకి సంతోషించాను, నువ్వు బ్రహ్మర్షివయ్యావు. దేవతలందరితో కలిసి నేను నిన్ను బ్రహ్మర్షి అని పిలుస్తున్నాను, నీకున్న సమస్త కోరికలు తీరుతాయి. నువ్వు దీర్ఘాయిష్మంతుడవై జీవిస్తావు అన్నారు.
అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మగారితొ…….నేను బ్రహ్మర్షిని అయిన మాట నిజమైతే నాకు ఓంకారము, వషట్కారము వాటంతట అవి భాసించాలి అన్నాడు( ఓంకారము, వషట్కారము భాసిస్తే తాను ఒకరికి వేదం చెప్పడానికి అర్హత పొందుతాడు, అలాగే తాను కూర్చుని యజ్ఞం చేయించడానికి అర్హత పొందుతాడు. ఎందుకంటే విశ్వామిత్రుడు పుట్టుక చేత క్షత్రియుడు కనుక). అలాగే, ఎవరిమీద కోపంతో నేను బ్రహ్మర్షిని అవ్వాలన్న పట్టుదలతో ఇన్ని సంవత్సరాలు తపస్సు చేశానో, ఆ వశిష్ఠుడితో బ్రహ్మర్షి అని పిలిపించుకోవాలని ఉందన్నాడు. బ్రహ్మగారు సరే అన్నారు.
అప్పుడు దేవతలు వశిష్ఠుడిని తీసుకురాగా, ఆయన విశ్వామిత్రుడిని చూసి బ్రహ్మర్షి విశ్వామిత్రా అని పిలిచారు. అప్పుడు విశ్వామిత్రుడు ఆ వశిష్ఠుడి కాళ్ళు కడిగి పూజ చేశాడు.
ఏ వశిష్ఠుడి మీద కోపంతో ప్రారంభించాడో, ఆ వశిష్ఠుడి కాళ్ళు కడగడంతో విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు అని శతానందుడు రాముడితో చెప్పాడు.
బ్రహ్మర్షి అవ్వడానికి, కామక్రోధాలని జయించడానికి మీ గురువు ఎన్ని సంవత్సరాలు తపస్సు చేశాడో, ఎంత కష్టపడ్డాడో, ఇలాంటి గురువుని పొందిన రామ నువ్వు అదృష్టవంతుడివి అన్నారు. విశ్వామిత్రుడి కథ విన్న రాముడు పొంగిపోయాడు. అక్కడున్న వాళ్ళంతా విశ్వామిత్రుడికి ప్రణిపాతం చేశారు.
రేపు సూర్యోదయం అయ్యాక ఒకసారి నాకు దర్శనం ఇవ్వండని జనక మహారాజు విశ్వామిత్రుడితో చెప్పి వెళ్ళిపోయాడు.
Thank you for watching 6th Day Bala Kanda
Please watch to 5th Day Bala Kanda (5 వ దినము బాల కాండ.)